చలనం లేని ప్రభుత్వం


అనంతపురం అర్బన్ : అనంత రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ టీడీపీ ప్రభుత్వానికి చలనం కలగడం లేదని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేయడంపై నిలదీస్తూ వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శనివారం చేపట్టిన   ఆయన మాట్లాడారు.  వరుస కరువులతో అనంతపురం జిల్లాలో వ్యవసాయం ఆందోళనకరంగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితిలో జిల్లాలో 50 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం ఈ ప్రభుత్వానికి తెలియదా.. తెలిసిన స్పందించదా.. అని ప్రశ్నించారు.



జిల్లాలో సాధారణంగా 552 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 272 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైందన్నారు. ఇలాంటి పరిస్థితిలో పంటలు చేతికి రాక.. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వరి ధాన్యానికి కేవలం రూ. 50 మాత్రమే టీడీపీ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు నిలువ ఉన్న సుమారు 75 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చెయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేవలం 15 లక్షల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.


తీవ్రమైన కరువు జిల్లాలోని రైతులకు ఈ ప్రభుత్వం రూ.740 కోట్లు రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ఇన్‌పుట్ సబ్బిడీ రూ.643 కోట్లు, పంటల బీమా రూ.277 కోట్లు.. మొత్తం రూ.920 కోట్లు రైతులకు చెల్లించకుండా, రూ.740 కోట్లు రుణ మాఫీ చేశామని గొప్పలు చెప్పుకోవడం దారుణం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.58 వేల కోట్లు బ్యాంక్ రుణాలను రైతులు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉండగా, ఈ ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు హామీ వల్ల అందులో కేవలం 20 శాతం మాత్రమే రెన్యూవల్ అవుతందన్నారు.



వైఎస్ పాలనలో రూ.లక్ష వరకు వడ్డీలేని రుణం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించారన్నారు. జిల్లాలోని కరువును నివారించడానికి 'హంద్రీ-నీవా' పథకాన్ని చేపట్టి, 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మిగతా పనులను పూర్తి చేసి పొలాలకు నీరివ్వడానికి టీడీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. మళ్లీ అలాంటి నేత వస్తేనే తమ కష్టాలు తీరుతాయని జనం కోరుకుంటున్నారని చెప్పారు.


రైతులు, పేదలు, మహిళల కోసం దీక్ష చేపట్టిన జగన్‌ను విమర్శించడానికి టీడీపీ నేతలకు హక్కు లేదన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ నెరలవేర్చే వరకు పోరాటం సాగిస్తామన్నారు. రైతు దీక్షలో యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. యోగిశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డికి నాగలి, చర్నాకోల బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పొరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపి నాగిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మైనుద్ధీన్, యూవజన విభాగం నగర అధ్యక్షుడు ఎల్లుట్ల మారుతినాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top