బత్తాయి భారం

బత్తాయి భారం


► నిమ్మ సాగుపై అనాసక్తి

► రాయితీలకు స్వస్తి పలికిన ఉద్యానశాఖ

► సాగుకు దూరమవుతున్న రైతులు

► పంట కాపాడుకునేందుకు ఏటా రైతుల భగీరథ ప్రయత్నం

► 250 అడుగుల లోతుకు బోర్లు వేసినా కనిపించని నీటి చెమ్మ

► రానున్న కాలంలో పంట కనుమరుగయ్యే ప్రమాదం


ఒంగోలు టూటౌన్‌ : జిల్లాలో ఒకప్పుడు సిరులు కురిపించిన బత్తాయి, నిమ్మ తోటలు ఆదరణ కోల్పోతున్నాయి. రైతులు ఈ పండ్ల తోటల పట్ల ఆసక్తి చూపడం మానేస్తున్నారు. గత నాలుగేళ్ళుగా జిల్లాలో వర్షాలు లేకపోవడం.. వాతావరణ పరిస్థితులు సక్రమంగా ఉండకపోవడం.. పంట కోతల సమయంలో మార్కెట్లో ధరలు పతనమవడం.. వంటి కారణాలు రైతులను వెం టాడుతున్నాయి. దీనికి తోడు భూగర్భజలాలు అడుగంటి.. బోర్లలో నీళ్ళు రాకపోవడం కూడా ప్రధాన కారణంగా రైతులు ఈ పండ్ల తోటలను వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది.


గత రెండేళ్ళలో చాలా తోటలు ఎండిపోవడంతో రైతులు వాటిని కొట్టేయాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో గత పదేళ్ళ క్రితం కనిగిరి ప్రాంతంలో విస్తారంగా కనిపి ంచే బత్తాయి, నిమ్మ తోటలు ఆదరణ కోల్పోతున్నాయి. రానురాను తోటల కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో బత్తాయి, నిమ్మ తోటలు 2,782 హెక్టార్లకు పైగా సాగవుతాయి. గత పదేళ్లకు ముందు ఈ పండ్ల తోటలు విస్తీర్ణం పెరిగేది. ఎక్కువగా ఈ తోటలు మార్కాపురం, కనిగిరి ప్రాంతంలో విస్తారంగా కనిపించేవి. కొనకనమిట్ల మండలంలోని చినారికట్లలో ప్రధాన సాగు నిమ్మతోటలే.


1200 ఎకరాలలో రైతులు సాగు చేస్తారు. ముఖ్యంగా నిమ్మతోటలకు కనిగిరి ప్రసిద్ధి. ఎకరాకు ఎరువులు, పురుగుమందులు, ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.50 వేల నుంచి రూ.75 వేల  వరకు పెట్టుబడి అయ్యేది. అలాంటిది గత నాలుగేళ్లుగా జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనలు సకాలంలో రావడంలేదు. వర్షాలు కురవడం గగనమయింది. దీంతో భూగర్భజలాలు దారుణంగా పడిపోతున్నాయి.


పంట రాగానే ధరల పతనం..

పశ్చిమప్రాంతంలో 200 నుంచి 250 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీటి చెమ్మ కనిపించని స్థితికి భూగర్భజలాలు పడిపోయాయి. దీంతో వేసవి కాలంతో పాటు వర్షాకాలంలో కూడా పండ్ల తోటలను కాపాడుకోవడానికి ఏటా రైతులు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోంది. గత యేడాది కరువు విలయతాండవం చేయడంతో వందల ఎకరాల్లో పండ్లతోటలను రైతులు వదిలేశారు. కొన్ని ప్రాంతాలలో అష్టకష్టాలు పడి తోటలను కాపాడుకున్నారు. ఈ పరిస్థితిలలో పంట దిగుబడి మార్కెట్లో రాగానే నిమ్మ ధరలు పతనమయ్యాయి.


సాధారణంగా ఎకరాకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ప్రతికూల వాతావరణం వల్ల సగానికి దిగుబడి పడిపోయింది. అయినా.. కనిగిరి మార్కెట్‌ నుంచి ఆయా సీజన్‌లలో రోజుకి 70 నుంచి 85 టన్నుల వరకు కాయలు ఎగుమతి అయ్యేవి. అలాంటి పరిస్థితి నుంచి రానురాను నిమ్మ రైతులు నష్టాలతో పాటు కష్టాలను ఎదుర్కొనే దుస్థితి వచ్చింది. గత డిసెంబర్‌లో ప్రారంభంలో కిలో నిమ్మకాయలు రూ.5 నుంచి రూ.10 వరకు పలికింది. తరువాత కిలో రూపాయికి చేరింది.


ఒక దశలో అర్ధరూపాయికి కూడా పడిపోయింది. మార్కెట్‌కు 50 కిలోల బస్తా తెస్తే కేవలం రూ.20 నుంచి రూ.30 మిగిలాయి. ఈ పరిస్థితులలో కోతకు వచ్చిన కాయలను కూడా చెట్లకే రైతులు వదిలేశారు. ఈ పరిస్థితులలో జిల్లాను ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించింది. పండ్లతోటలు ఎక్కువ విస్తీర్ణంలో ఎండిపోయాయి.


రాయితీ నిలిపివేత..

జిల్లాలోని పరిస్థితిని గమనించిన జిల్లా ఉద్యానశాఖ అధికారులు విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పండ్లతోటలపై సమీక్షించారు. ఈ ఏడాది నుంచి బత్తాయి, నిమ్మ తోటల సాగును ప్రోత్సాహించవద్దని ఆదేశించారు. ఆ పండ్ల తోటలకు ఇచ్చే 50 శాతం రాయితీని నిలిపివేయాలని సూచించారు. వాటి స్థానంలో విషయాన్ని యాపిల్‌బెర్, దానిమ్మ, నేరెడు, జామ తోటలను ప్రోత్సాహించాలని ఆదేశించారు. వీటికి రాయితీలను ప్రోత్సాహించి ఉద్యాన రైతులను అటువైపు మళ్లించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. దీంతో  పాటు ప్రతి ఐదెకరాలకి ఒక ఫాంపాండ్‌ (నీటికుంట)ను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు రాయితీ ఇవ్వాలని ఉద్యాన అధికారులకు తెలిపారు.


ముఖ్యంగా ఉద్యాన పంటలకు కూడా 100 శాతం డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు జిల్లాను వెంటాడుతున్న ప్రతికూల వాతావరణం కూడా తోడవడంతో రానున్న కాలంలో జిల్లాలో బత్తాయి, నిమ్మ తోటల సాగుకు రైతులు దూరమయ్యే అవకాశం ఉంది. తోటలు కూడా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి రాబోతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వీటిపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు ఇతర మార్గాలను ఎంచుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలవైపు వెళుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top