ఏపీలో శాంతిభద్రతల సమస్య లేదు

ఏపీలో శాంతిభద్రతల సమస్య లేదు - Sakshi


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల సమస్య లేదని సీఎం నారా చంద్రబాబు చెప్పారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్రం ఎంపిక చేసిన మూడు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని, పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్రం స్వర్గధామంగా ఉందన్నారు. సోమవారం ముంబైలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ (సిటీ ఇండియా ఇన్వెస్టర్స్) సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని లైఫ్ సెన్సైస్, ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, విశాఖను పారిశ్రామిక హబ్‌గా తయారుచేస్తామని చెప్పారు. 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం ఖాయమని పేర్కొన్నారు. డెయిరీ, పౌల్ట్రీ, సిమెంట్, పేపర్ పరిశ్రమలలో ఇప్పటికే ముందున్న ఏపీ.. ఫార్మా, బయోటెక్నాలజీ, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమల రంగాలలో దూసుకెళ్లనున్నదని చెప్పారు. ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పులు, పెట్రో కెమికల్ కాంప్లెక్సులను అభివృద్ధి చేస్తామన్నారు.


 


ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కులను, అపెరల్ పార్కులను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు,  పీపీపీ పద్ధతిలో భవిష్యత్తులో పది లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇలావుండగా.. విద్యుత్, సహజవాయువు రంగాలలో అతిపెద్ద కంపెనీగా ఉన్న తమ కంపెనీ ఏపీలో వివిధ రంగాలలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని బాబుతో భేటీ అయిన సూయజ్ ఎనర్జీ ఇంటర్నేషనల్ కంపెనీ సీఈవో బెర్నెడ్ చెప్పారు. సన్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుధీర్ వాల్యా కూడా సీఎంతో సమావేశమయ్యారు. రూ.12 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామన్నారు. సుజ్లాన్, ఆదిత్య బిర్లా గ్రూప్, ఎల్ అండ్ టీ, టాటా ఆపర్చ్యునిటీస్ ఫండ్, బ్లాక్ స్టోన్, ఐడీఎఫ్, ఫిడెలిటీ వరల్డ్ వైడ్, బ్రూక్ ఫీల్డ్, జీఐసీ కంపెనీల ప్రతినిధులు కూడా సీఎంతో భేటీ అయినట్లు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం వెల్లడించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top