ఈ‘సారీ’.. అంతే!


► ఈ ఏడాదీ ట్రిపుల్‌ ఐటీ తరగతులు లేనట్లే?

► ఇప్పటికీ పూర్తికాని స్థల కేటాయింపులు

► రాష్ట్ర మానవ వనరుల శాఖకు కొరవడిన ముందస్తు ప్రణాళిక


ఎచ్చెర్ల క్యాంపస్‌ : జిల్లాకు ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్‌ ఐటీని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే తరగతులు మాత్రం కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో నిర్వహిస్తోంది. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. గత ఏడాది వెయ్యి మంది, ఈ ఏడాది ప్రవేశాలు కల్పించనున్న వెయ్యిమందితో కలిపి.. మొత్తం రెండు వేల మందితో తరగతులు ప్రారంభించాలి. అయితే ఈ ఏడాది సైతం తరగతుల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.


జిల్లాకు మంజూరు చేసిన ట్రిపుల్‌ ఐటీ అనేక మలుపులు తిరుగుతోంది. అయినా సంస్థ ప్రారంభం మాత్రం సాధ్యం కావడం లేదు. రాష్ట్ర మానవ వనరుల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం, ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయకపోవడం, స్థల సేకరణ రోజుకో మలుపు తిరగడం వంటి అంశాలు ప్రధాన అవరోధాలుగా మారాయి. మరోవైపు నూజివీడులో సైతం వసతి కొరత వెంటాడుతోంది.


అక్కడ ఆరువేల మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారు. జిల్లాకు చెందిన రెండు వేల మందికి అదనపు వసతి కల్పించాలి. తరగతులు, వసతిగృహం, ల్యాబ్‌లు.. ఇలా అదనపు వసతి అవసరం. అక్కడ అదనంగా నిర్మాణాలు చేపట్టినా.. నిరుపయోగమే. ఎందుకంటే శ్రీకాకుళానికి చెందిన విద్యార్థులను భవిష్యత్‌లో ఇక్కడికి తరలించాల్సిందే!


ఇదీ ప్రస్తుత పరిస్థితి..

జిల్లాకు మంజూరు చేసిన విద్యాసంస్థను ఇక్కడికి తరలించి, ఎలాగైనా  తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వంతోపాటు, అధికారులు భావించారు. అందుకే ప్రస్తుతం ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఎచ్చెర్ల సమీపంలోని 21వ శతాబ్ది గురుకుల భవనాలు, 47 ఎకరాల స్థలం ట్రిపుల్‌ ఐటీకి అప్పగిస్తూ.. స్వాధీన ధ్రువీకరణ పత్రాన్ని గత మార్చి 18న అప్పగించారు. అయితే ఇక్కడ వసతి, తరగతుల నిర్వహణ 600 మందికి మాత్రమే సాధ్యం.


ప్రస్తుతం తరగతులు ప్రారంభించాలంటే 2 వేల మందికి వసతి, తరగతుల నిర్వహణ సామర్థ్యం, మరో 500 మంది సిబ్బందికి నివాస సముదాయం ఉండాలి. జూన్‌లో ప్రవేశాలు, ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభించాలి. రెండో ఏడాది తరగతులు జూన్‌ నుంచే ప్రారంభించాలి. జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ తరగతులు ప్రారంభించాలంటే ప్రస్తుతం వసతి అత్యవసం. రెండు, మూడు నెలల్లో వసతి కల్పన సాధ్యం కాదు. ట్రిపుల్‌ ఐటీ, రాష్ట్ర మావన వనరులు, ఇంజినీరింగ్‌ అధికారులు సుదీర్ఘ సమీక్ష సమావేశం సైతం ఇక్కడ నిర్వహించారు.


భవనాలు, సౌకర్యాలను పరిశీలించారు. అద్దె భవనాలు తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే, ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకోవడం కంటే.. నూజివీడులో తరగతుల నిర్వహణ మేలన్నది అధికారుల అభిప్రాయం. మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కూడా 21 శతాబ్ది గురుకులంలో సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారు. 2 వేల మందికి తరగతుల నిర్వహణ, వసతి కోసం అద్దెకు జిల్లాలో విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే, ఏడాదికి మాత్రమే అద్దెకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.


ముందస్తు ప్రణాళిక లేకనే..

విద్యాసంవత్సరం ముంచుకొస్తున్న నేపథ్యంలో హడావుడి ప్రదర్శిస్తున్న రాష్ట్ర మానవ వనరుల శాఖ అధికారులు.. మందస్తు చర్యలు మాత్రం తీసుకోలేదు. స్థల సేకరణ సైతం అనేక మలుపులు తిరగాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర మానవ వనరుల శాఖ అధికారుల మధ్య సమన్వయం సైతం కొరవడింది. గత ఏడాది అక్టోబర్‌ 9న 21వ శతాబ్ది గురుకులంలో కార్యాలయాన్ని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు.


అనంతరం అదే ఏడాది డిసెంబర్‌ 19న 340 ఎకరాలు కేటాయిస్తూ జీఓ నంబరు 1164 విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 2న ఆ జీఓ రద్దు చేశారు. జనవరి 12న 47 ఎకరాలు కేటాయిస్తూ జీఓ విడుదల చేశారు. మార్చి 18న స్థల స్వాధీన ధ్రువీకరణ పత్రం అందజేశారు. ప్రస్తుతం మరో 23 ఎకరాలు అందజేసేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికీ ట్రిపుల్‌ ఐటీకి ఏర్పాట్లు పూర్తి చేయలేకపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తరగతుల మాటెలా ఉన్నా.. వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.


పరిశీలిస్తున్నాం..

ప్రస్తుతం ఇక్కడికి ట్రిపుల్‌ ఐటీ తరలించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. 2 వేల మందికి వసతి, తరగతుల నిర్వహణకు అకడమిక్‌ బ్లాక్‌లు అవసరం. తాత్కాలిక పద్ధతిలో నిర్మాణం సాధ్యమా? అద్దె భవనాలు తీసుకోవాలా? అన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం. సాధ్యం కాకపోతే నూజివీడులో తరగతుల నిర్వహణను సైతం పరిశీలిస్తున్నాం.  – ప్రొఫెసర్‌ పప్పల అప్పలనాయుడు, శ్రీకాకుళం ట్రిపుట్‌ ఐటీ డైరెక్టర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top