మంటగలసిన మానవత్వం

మంటగలసిన మానవత్వం - Sakshi

బతికుండగానే బయటపడేసిన గుంటూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది

- కాళ్లావేళ్లాపడ్డా కనికరించని వైనం

చనిపోయిన తర్వాత మహాప్రస్థానం వాహన ఏర్పాటుకు నిరాకరణ

చుట్టుపక్కల వారు నిలదీయడంతో చివరకు దిగొచ్చిన సిబ్బంది

 

గుంటూరు ఈస్ట్‌: తన తండ్రి ప్రాణాలు కాపాడమంటూ ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆ కుమార్తెకు కన్నీళ్లే మిగిలాయి. ఆస్పత్రి సిబ్బంది నిరాదరణతో ఆమె కళ్ల ముందే ఆ తండ్రి ప్రాణాలొదిలాడు. కనీసం మృతదేహాన్ని తరలించేందుకు వాహనాన్ని కూడా ఇవ్వలేదు. ఈ హృదయ విదారక సంఘటన బుధవారం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ముళ్లమూరు మండలం రాజగోపాలరెడ్డినగర్‌కు చెందిన పంతా భోగిరెడ్డి(79) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన కుమార్తె ఎర్రమ్మ ఈ నెల 19న అతన్ని జీజీహెచ్‌లోని అత్యవసర విభాగంలో చేర్చింది.



ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు బుధవారం మూడో వార్డుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె తండ్రిని తీసుకొని మూడో వార్డుకు వెళ్లగా.. అక్కడి సిబ్బంది వార్డులో చేర్చుకోకుండా వెనక్కి పంపించేశారు. తిరిగి అత్యవసర విభాగానికి రాగా.. అక్కడి వైద్యులు, సిబ్బంది  పట్టించుకోవపోవడంతో తన తండ్రి ప్రాణాలు కాపాడాలంటూ ఎర్రమ్మ వారి కాళ్లావేళ్లా పడింది. కనీస మానవత్వం చూపని ఆ వైద్యులు, సిబ్బంది.. బతికుండగానే భోగిరెడ్డిని స్ట్రెచర్‌తో సహా బయటపడేశారు. కొంతసేపటికి భోగిరెడ్డి అందరి ఎదుటే విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలాడు. 

 

ముందే మృతి చెందినట్టు నమోదు..

ఎర్రమ్మ భోరున విలపిస్తూ కేకలు వేయడంతో.. వైద్యులు, సిబ్బంది హడావుడిగా వచ్చి భోగిరెడ్డి మృతదేహాన్ని లోపలికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి రాకముందే అతను మృతి చెందినట్టుగా రికార్డుల్లో నమోదు చేసి మృతదేహాన్ని తిరిగి ఎర్రమ్మకు అప్పగించారు. కాగా, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తన వద్ద డబ్బుల్లేవని.. మహాప్రస్థానం వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆస్పత్రి అధికారులను ఎర్రమ్మ వేడుకుంది. కానీ వారు ఇందుకు అంగీకరించలేదు. ఎర్రమ్మ పడుతున్న బాధను చూసిన వారు అధికారులను నిలదీయడంతో ఎట్టకేలకు దిగొచ్చిన సిబ్బంది మహాప్రస్థానం వాహనంలో భోగిరెడ్డి మృతదేహాన్ని ఇంటికి తరలించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top