డబ్బుల్లేవ్!

డబ్బుల్లేవ్!


నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేనట్టే

ప్రస్తుతం 29 సిగ్నల్స్‌లో పనిచేసేవి ఆరే సిగ్నల్స్ ఏర్పాటు,

జీబ్రా లైన్ల బాధ్యత నగరపాలక సంస్థదే

కనీసం పుష్కర నిధుల్లో కేటాయించాలని

కోరిన పోలీసులు చేతులెత్తేసిన నగరపాలక సంస్థ


 

సాక్షి, విజయవాడ : నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యే సూచనలు లేవు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా లైన్లు, ఇతర ట్రాఫిక్ అవసరాలు తీర్చాల్సిన నగరపాలక సంస్థ తమ వల్ల కాదని చేతులెత్తేసింది. దీంతో నగరంలో ట్రాఫిక్ పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. మరో 100 రోజుల్లో కృష్ణా పుష్కరాలు రానున్నాయి. ఈ క్రమంలో అయినా కనీసం నగరంలో కొద్దిమేరకైనా ట్రాఫిక్ తక్షణ అవసరాలు తీర్చకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ట్రాఫిక్ పోలీసు అధికారులు నగర మేయర్‌ను కలిసి అదే కోరారు. తమ వద్ద నిధులు లేవని ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసే చలానాలతోనే అభివృద్ధి చేసుకోవాలంటూ ఆయన సూచించటంతో రెండు శాఖల మధ్య జగడం మొదలైంది.



 రాజధాని అయిన తరువాత నగరంలో ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. రద్దీ నియంత్రణకు అనువుగా ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ లైన్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, ఫ్రీ లెఫ్ట్ కోసం రోడ్డు మార్జిన్ల విస్తరణ, రోడ్లపై ఆక్రమణలకు తావు లేకుండా హాకర్ జోన్లు.. ఇలా అన్నీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ పైనే ఉంది. నగరంలోని ట్రాఫిక్ అవసరాలను నగరపాలక సంస్థ తీర్చటం ప్రధాన విధి. ముఖ్యంగా విజయవాడ నగరంలో 29 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండగా వాటిలో పనిచేస్తున్నవి కేవలం ఆరే. మిగిలినవి అటకెక్కి కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. ప్రస్తుత నగర ట్రాఫిక్ స్థితికి అనుగుణంగా 65 చోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని గతంలో ఒక నివేదిక సూచించింది. దీంతో కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం కూడా సిగ్నల్స్ పెంచాలని, కొత్త జంక్షన్లలో ట్రాఫిక్ మెరుగుకు చర్యలు తీసుకోవాలని, రూ.45 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించాలని కోరింది.





 చేతులెత్తేశారు...

 కమిషనరేట్ ట్రాఫిక్ అదనపు డీసీపీ నాగరాజు నేతృత్వంలో ట్రాఫిక్ ఏసీపీలు, ట్రాఫిక్ సీఐలు బుధవారం నగర మేయర్ కోనేరు రాజేంద్రప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరారు. మేయర్ మాత్రం.. కార్పొరేషన్ వద్ద నిధులు లేవని తేల్చిచెప్పారు. ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసే చలానాల్లో కొంత మొత్తం ఖర్చుపెట్టి సిగ్నల్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పుష్కరాల పనుల కోసం కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.145 కోట్లు కేటాయించింది. వాటిలో నగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆ నిధుల్లో అయినా కొంతమేరకు కేటాయిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఎంతోకొంత తగ్గుతాయనేది పోలీసుల వాదన.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top