ఆ సినిమా ‘వేదం’గా..


 కందుకూరు :వేదం సినిమాలో అల్లు అర్జున్ తన ప్రియురాలి కోసం బెకుపై వెళ్తూ  దొంగతనం చేసే సీన్ ఇద్దరు యువకుల జీవితాలను కటకటాల పాల్జేసింది. ఆ సినిమా చూసిన యువకులు హీరో తరహాలో జీవితాన్ని గడపాలన్న కోరికతో జల్సాలకు అలవాటు పడి పెడదోవ పట్టారు. అల్లు అర్జున్ తరహాలో బైకుపై వెళ్తూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఏడాది నుంచి పట్టణంలో జరుగుతున్న చైన్‌స్నాచింగ్ కేసులతో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు శనివారం స్థానిక పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను కందుకూరు డీఎస్పీ శంకర్ విలేకరులకు వెల్లడించారు.

 

    పొన్నలూరు మండలం వెంకుపాలేనికి చెందిన ముసలి శ్రీహరి అలియాస్ కన్నా, నెల్లూరు జిల్లా సాయిపేట గ్రామానికి చెందిన కోటకొండ మోహన్‌లు ఒంగోలులోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివే సమయంలో స్నేహితులయ్యారు. ఇంటర్ తర్వాత కందుకూరులోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతూనే మధ్యలో ఆపేశారు. ఆ తర్వాత మోహన్ హైదరాబాద్ వెళ్లి సినీపరిశ్రమలో అసిస్టెంట్ ఫొటో గ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. అక్కడ సరదాలకు అలవాటుపడ్డాడు. చేతి నిండా డబ్బులు సంపాదిస్తున్నా వృత్తిని మానుకుని తిరిగి కందుకూరు వచ్చాడు. ఈ నేపథ్యంలో శ్రీహరి, మోహన్‌లిద్దరూ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అనంతరం కందుకూరులోని జనార్దనకాలనీలో వేర్వేరుగా ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురాలు పెట్టారు. ఈ క్రమంలో కుటుంబ పోషణ జరగకపోవడం, వీరి సరదాలకు డబ్బులు లేకపోవడంతో ఈజీగా డబ్బులు సంపాదించాలన్న కోరిక పుట్టింది.

 

 అదే సమయంలో వేదం సినిమా చూసిన వీరు.. ఆ సినిమాలో అల్లు అర్జున్ తన ప్రియురాలి కోసం బైకు వెళ్తూ మహిళల వద్ద డబ్బులు లాక్కొని వెళ్లే సన్నివేశం వీరిని ఆకట్టుకుంది. అదే తరహాలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత సింగరాయకొండలో ట్రైల్ వేసుకున్నారు. ఓ మహిళ మెడలో బంగారు చైన్ లాక్కొని వెళ్లారు. చైన్ అమ్మగా వచ్చిన రూ.30 వేలు జల్సాలకు ఖర్చు చేశారు. ఇక అప్పటి నుంచి ఇదే తరహా దొంగతనాలు చేస్తున్నారు. దాదాపు ఎనిమిది నెలల నుంచి కందుకూరు, సింగరాయకొండ, కనిగిరి, పొదిలి ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. 10 చైన్‌స్నాచింగ్ సంఘటనల్లో  రూ. 8.20 లక్షల విలువైన 40 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకున్నారు.

 ఇలా చేస్తారు..

 

 ఒంటరిగా ఉండే మహిళలే వీరిద్దరి టార్గెట్. వేకువ జామున వాకింగ్‌కు వెళ్లే మహిళలు, ఇళ్ల ముందు ముగ్గులు చేసేవారిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడతారు. వీరిలో ఒకరు బైకును రెడీగా ఉంచగా మరొకరు మహిళ వద్దకు వెళ్లి మెడలో ఆభరణాలను లాక్కొని వస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి క్షణాల్లో మాయమవుతారు. వీరు చోరీ చేసిన ఆభరణాలను ఇప్పటి వరకూ అమ్ముకోలేదు. మొత్తం ఒకేసారి అమ్మాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల గాయత్రీ కాలేజీ సమీపంలో వీరిద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డారు. వారి విచారణలో వీరి గుట్టురట్టయింది. వీరిని పట్టుకునేందుకు కృషి చేసిన హెడ్‌కానిస్టేబుళ్లు షేక్ మహ్మద్, చెంచురామయ్య, కానిస్టేబుళ్లు జి.గోపీ,  రాఘవేంద్రరాజు, మాధవరావు, ఆనంద్‌లను డీఎస్పీ అభినంధించారు.  డీఎస్పీతో పాటు సీఐ ఎం.మధుబాబు, పట్టణ, రూరల్ ఎస్సైలు వైవీ రమణయ్య, సురేష్ ఉన్నారు.

 

 చదువులో టాప్

 శ్రీహరి, మోహన్‌లు చదువులో మాత్రం టాప్ స్టూడెంట్స్. శ్రీహరికి పదో తరగతిలో 542 మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 940 మార్కులు వచ్చాయి. చదువులో టాప్ స్టూడెంట్స్‌గా ఉన్న వీరు మద్యం, జల్సాలకు అలవాటు పడి పెడదోవపట్టారు.   

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top