జీఓ 279 రద్దు చేయాల్సిందే


► సీఐటీయూ డివిజనల్‌ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు

► మున్సిపల్‌ కార్మికుల విధుల బహిష్కరణ

► శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎదుట ధర్నా




శ్రీకాకుళం అర్బన్‌: మున్సిపల్‌ కార్మికులకు ఉద్వాసన పలికే జీఓ 279ను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ డివిజనల్‌ ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, మున్సిపల్‌ యూనియన్‌ కార్యదర్శి ఎన్‌.బలరాంలు డిమాండ్‌ చేశారు. జీఓ 279 రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద బుధవారం వేకువజాము నుంచి మున్సిపల్‌ కార్మికులు విధులు బహిష్కరించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాలను, నగరాలను కాంట్రాక్టర్లు బాగా పరిశుభ్రం చేసి అభివృద్ధి చేస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయని, కార్మికులు, ఉద్యోగులు ఒళ్లు వంచి పనిచేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



ఒకవైపు సుప్రీంకోర్టు సైతం జీఓ 151 ప్రకారం జీతాలు పెంచాలని చెప్పినా ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. కార్మికులకు మంచి చేసే జీఓలను అమలు చేయడంలో శ్రద్ధ చూపకుండా కార్మికుల బతుకులను నాశనం చేసే జీఓలను తెచ్చి ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్, సెమీస్కిల్డ్‌ జీతాలు, పర్మినెంట్‌ కార్మికులకు హెల్త్‌కార్డులు, జీపీఎఫ్‌ అకౌంట్లు, ఇంక్రిమెంట్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఇటీవల ప్రకటించిన పరిశుభ్ర నగరాలు, పట్టణాల అవార్డులు మున్సిపల్‌ కార్మికుల శ్రమ నుంచే వచ్చాయని గుర్తు చేశారు.



కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని యంత్రాల తయారీ కంపెనీలకు, దళారీలను పెంచి పోషించేందుకే జీఓ 279ను తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఎన్‌.ఎం.ఆర్‌లను, పార్ట్‌టైమ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని, స్కూల్‌ స్వీపర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఆందోళన, పోరాటాలను చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒకటో పట్టణ ఎస్‌ఐ చిన్నంనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులనుపోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. నిరసన కార్యక్రమంలో యూనియన్‌ ప్రతినిధులు ఎన్‌.పార్థసారథి, కె.రాజు, ఎ.గణేష్, చిట్టిబాబు, గోవిందరావు, యుగంధర్, తిరుమల, నర్సమ్మ, సీతమ్మ, రాజేశ్వరి, కమలమ్మ, గౌరమ్మ, లలిత, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top