కలప వృక్షం కనుమరుగు

కలప వృక్షం కనుమరుగు - Sakshi

  • లక్షలాది చెట్లు నేలమట్టం

  •  కుప్పకూలిన 100ఏళ్ల నాటి వృక్షాలు

  •  అటవీ రహదారులు ఛిద్రం

  •  రూ.100 కోట్లకు పైగా నష్టం

  •  సవాల్‌గా మారిన భారీ వృక్షాల తొలగింపు

  •  స్మగ్లర్లు రెచ్చిపోయే ప్రమాదం

  •  ఉష్ణోగ్రతలు 5డిగ్రీల మేర పెరిగే అవకాశం

  • సాక్షి, విశాఖపట్నం :  హుదూద్ ధాటికి అటవీ సంపద కనుమరుగైంది. విధ్వంసానికి మొక్కలు..చెట్లే కాదు.. వందేళ్ల నాటి మహావృక్షాలు తలలువాల్చాయి. విశాఖ మహానగరంలో సుమారు 5 లక్షలు, జిల్లాలో 4.7 లక్షల చెట్లు నేలమట్టమైనట్టు ప్రాథమిక అంచనా. నష్టం రూ.కోట్ల పైనే ఉంటుందంటున్నారు. ఈ ప్రభావంతో భవిష్యత్‌లో 3 నుంచి 5డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

     

    విశాఖలోనే అత్యధికం



    ఉత్తరాంధ్రలో మొత్తం 10లక్షలకు పైగా వృక్ష సంపద నేలమట్టం కాగా, ఒక్క విశాఖ నగరంలోనే ఐదులక్షలకుపైగా చెట్లు సర్వనాశనమైపోయాయి. అటవీ ప్రాం తంలో మరో 15 లక్షలకు పైగా వృక్షాలు మోడువారాయి. టేకు, సరుగుడు, యూకలిప్టస్, అకేషియా (ఆస్ట్రేలియా తుమ్మ), కేషియా, సిల్వర్‌ఓక్, వేగిస, బండారు లతో పాటు ఎర్రచందనం చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 3.5 లక్షల హెక్టార్లలో సరుగుడు, 1.50 లక్షల హెక్టార్లలో టేకు, లక్ష ఎకరాల్లో యూకలిప్టస్ చెట్లు నేలకొరిగాయి. విశాఖ చుట్టు పక్కల కొండలైతే పూర్తిగా బోసిపోయాయి. సీతకొండ, కంబాలకొండ, నరవ, ఎర్రకొండ, గీల్‌మెన్‌ఫీల్డ్, అమనామ్ తదితరమైనవి బోడిగుండుల్లా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం రూ.60కోట్ల నష్టం వాటిల్లినట్టుగా నిర్ధారించిన అటవీశాఖాధికారులు వాస్తవ నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం వందకోట్లపైగానే ఉంటుందంటున్నారు.

     

    తొలగింపునకు ఏడాదిపైమాటే



    వందలాది పొక్లెయినర్‌లు, వేలాది మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నా మైదాన ప్రాం తాల్లో నేలకొరిగిన చెట్లను తొలగింపు కార్యక్రమం కనీసం 50 శాతం కూడా దాటలేదు. అలాంటిది లక్షలహెక్టార్లలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో నేలకొరిగిన వృక్షాలను తొలగించడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. కనీసం ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచార మేనని.. అటవీ బీట్‌ల వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఈనష్టం మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అటవీప్రాంతాలకు వెళ్లే దారులన్నీ ఛిద్రమై పోయాయి. లోపలికి వెళ్లేందుకు మార్గాలు కూడా లేకుండా ఎక్కడికక్కడ వేలాది చెట్లు అడ్డంగా కూలిపోయాయి. అయినప్పటికీ అటవీశాఖ ప్రత్యేక బృందాలను నియమించి  క్షేత్ర స్థాయిలో జరిగిన వాస్తవ నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైంది. ప్రాథమిక సమాచారం మేరకు నేలమట్టమైన అటవీసంపదను తొలగించేందుకు కనీసం రూ.5 కోట్లకుపైగా వ్యయం అవుతుందని అంచనా.

     

    స్మగ్లర్లకు కాసులపంటే.. : సాధారణ రోజుల్లోనే విలువైన చెట్టు కన్పిస్తే ఇట్టే మాయం చేసే స్మగ్లర్లు, అక్రమార్కులు ఇప్పుడు హుదూద్ విధ్వంసాన్ని తమకు అను కూలంగా చేసుకుని కోట్లు ఆర్జించేందుకు పథక రచన చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో లక్షల విలువైన ఎర్రచందనం, టేకు తదితర వృక్షాలు వేలాదిగా నేలమట్టంకావడంతో వాటిని కల్పతరువుగా మార్చుకుంటున్నారు. అధికార పార్టీ అండదండలతో విలువైన వృక్షసంపదను దారి మళ్లించేందుకు పావులు కదుపుతున్నారు. దీనికి కళ్లెం వేసేందుకు అటవీశాఖ ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపింది. ధ్వంసమైన అటవీ సంపదను పరిరక్షించేందుకు ఏజెన్సీలో గిరిజనులను భాగస్వాములను చేస్తున్నారు.

     

    మరో 30 ఏళ్లు పడుతుంది



    అటవీసంపద పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి మరో 30 ఏళ్లకు పైగా సమయంపడుతుంది. కొన్ని రేంజ్‌ల పరిధిలో కనుచూపు మేర లో భారీ వృక్షాలనేవే లేకుండా పోయాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు త్వరగా ఎదగాలన్న ఆలోచనతోనే గతంలో తురాయి వంటి వృక్షజాతుల పెంపకాన్ని ప్రోత్సహించాము. ఇప్పటికైనా విపత్తులను తట్టుకునే చెట్లను పెం చడం చాలా అవసరం. బొగడ, కానుగ, వేప, లెగిస్ట్రోమియా, బాహానియా, మర్రి, రావి జా తులను పెంచితే అవి పెనుగాలులను తట్టుకుం టాయి. ఏజెన్సీ భూముల్లో నేలకొరిగిన వృక్షసంపదను ఆయా రైతులకు ఇచ్చేం దుకు నిబంధనలను సరళతరం చేశాం. వీఆర్వో సర్టిఫైచేస్తే చాలు వారి భూముల్లో ఏఏ చెట్లు నేలమట్టమయ్యాయో నిర్ధారించి వారెక్కడకు తరలించుకునేందుకైనా అనుమతులివ్వాలని ఆదేశించాం.

     -పి.రామ్మోహనరావు, డిఎఫ్‌ఒ, విశాఖ జిల్లా

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top