అనర్హులను ఓటరు జాబితా నుంచి తొలగించాలి

అనర్హులను ఓటరు జాబితా నుంచి తొలగించాలి - Sakshi


రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్‌లాల్



 విజయవాడ : రాష్ట్రంలో ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పోలింగ్ బూత్‌లు తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి బన్వర్‌లాల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ బాబూ.ఏ హైదరాబాద్  నుంచి, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల గుర్తింపు కార్డు జారీలో డూప్లికేషన్, అర్హతలేని మరణించిన, ఇళ్లు మారిన  ఓటర్లను గుర్తించి జాబితానుంచి తొలగించడానికి చర్యలు చేపట్టాలన్నారు.



క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇంటి నంబరు, ఇంటిలో ఉండే వ్యక్తుల పేర్లను అనుసంధానం చేస్తూ వాటికి సంబంధించిన  పోలింగ్ బూత్‌ను గుర్తించేలాగా రూట్ మ్యాప్‌ను రూపొందించాలని చెప్పారు.  2016 ఎలక్ట్రోరల్ ప్రత్యేక సమ్మరి రోల్‌ను సెప్టెంబర్ 10 నాటికి పూర్తి చేసి అక్టోబర్ 5వ తేదీనాటికి డ్రాఫ్ట్ రోల్ ప్రచురించాలని బన్వర్‌లాల్ ఆదేశించారు. బీఎల్‌వో స్థాయిలో ప్రతి సిబ్బందికి వారి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలని, వారికి  జరిపే అన్ని రకాలైన చెల్లింపులు ఖాతాలకు జమచేస్తామని తెలిపారు. 



జిల్లా కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ జిల్లాలో 1,066 డూప్లికేట్ ఎపిక్ కార్డులు ఎలక్షన్ కమిషన్ గుర్తించిందని, వాటిని  బీఎల్‌వో స్థాయిలో పరిశీలించి తొలగించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 2,190 మరణాల వలన 37,730 ఇళ్లు మారడం వల్ల వారి పేర్లను ఓటర్‌లిస్టు నుంచి తొలగించినట్లు వివరించారు. జిల్లాలో 33,41,069 మంది ఓటర్లు నమోదు కాగా వారిలో పురుషులు 16,59,455, మహిళలు 16,81,361, ఇతరులు 253 మంది ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వీరిలో ఆధార్ సీడింగ్ ప్రక్రియ నిమిత్తం 29,15,374 మందిని గుర్తించి వారిలో 99.23 శాతం మంది వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్-కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ -2 ఒంగోలు శేషయ్య, ఆర్డీవోలు సీహెచ్.రంగయ్య, సాయిబాబా, ఇన్‌చార్జి డీఆర్వో చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top