అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పెట్టొద్దు

అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పెట్టొద్దు - Sakshi


గూడూరు టౌన్ : సొసైటీలకు చేరిన యూరియాను రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం తగదని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని రైతులు, అన్ని మండలాల ఏఓలతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదాముల్లో ఉన్న యూరియాను కొంత మంది బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, మరికొంత మంది వారికి కావాల్సిన వారికి ఇచ్చుకోవడం తన దృష్టికి వచ్చిందన్నారు.



ఇలాంటి పక్షపాతం తగదన్నారు. అనంతరం మండలాల వారీగా రైతులు ఎన్ని హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు, యూరియా అవసరం ఎంత.. ఎంత అందుబాటులో ఉంది తదితర విషయాలపై మండలాల వారీగా ఏఓలను అడిగి తెలుసుకున్నారు. వాకాడు మండలంలో సొసైటీ అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే యూరియా ఇస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, వారు చెప్పిన వారికే యూరియా ఇస్తే మిగిలిన రైతులు ఏమై పోవాలని ప్రశ్నించారు. కోట మండలంలో మార్కెట్‌లో యూరియాను కొనుగోలు చేసుకోవాలని అధికారులే చెప్పడం ఏమిటన్నారు.  



గూడూరులో సొసైటీ కార్యాలయం ఒక్కటే ఉందని, రూరల్ ప్రాంతంతో పాటు పట్టణంలో కూడా రైతులు అధికంగా ఉన్నారని వారందరికి సరిపోయేలా యూరియా తెప్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఏఓలు అందజేసిన వివరాలను పరిశీలించి యూరియా కోసం జిల్లా వ్యవసాయశాఖ జేడీతో మాట్లాడి తెప్పిస్తామని, అవసరమైతే మంత్రితో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామన్నారు.



అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ, గూడూరు, నాయుడుపేట  వ్యవసాయాధికారులు శివనాయక్, నర్సోజీరావు తదితరులు పాల్గొన్నారు.  

 

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి

ప్రభుత్వ భూములను పరిరక్షిచాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండల వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించడంతో పాటు వాటిని కాపాడాలన్నారు. గ్రామాల్లో ఇంటి, కుళాయి పన్నులను వసూలు చేసి ప్రతి రోజు ఆ విషయాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు.



గ్రామాల్లో పన్నులు వసూళ్లు కాకపోవడంతో విద్యుత్ బిల్లులను 13వ ఆర్థిక సంఘం నిధులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయ నాయకులు చెప్పారని వసూళ్లు ఆపితే ఇబ్బందులు పడేది ఉద్యోగులేనని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న లే అవుట్‌లను గుర్తించడంతో పాటు ఏర్పాటు చేసి ఉన్న లే అవుట్‌ల్లో ప్రజల కోసం వదిలిన స్థలాలను గుర్తించాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రొటోకాల్‌ను పాటించాలని సూచించారు.



ఇటీవల జెడ్పీ సీఈఓ ఐదుగురు పంచాయితీ కార్యదర్శులను సస్పెండ్ చేశారని, నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే ఉద్యోగులు ఇబ్బందులు పడతారన్నారు.  పనుల కోసం వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలుంటే ఉన్నతాధికారులకు చెప్పాలని తెలిపారు.  కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top