అవినీతి సొమ్ముతో కిడారి ఖుషీ

అవినీతి సొమ్ముతో కిడారి ఖుషీ - Sakshi


గిరిజనుల కష్టాలు గాలికొదిలేశారు

ఆంత్రాక్స్ బాధితులను పరామర్శించే తీరికా లేదు

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఎద్దేవా


 

హుకుంపేట: ప్రమాదకర ఆంత్రాక్స్ లక్షణాలతో గిరిజనులు బాధపడుతుంటే అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాత్రం పెదబాబు, చినబాబు ఇచ్చిన నోట్ల కట్టలు లెక్కపెట్టుకునే పనిలో ఉన్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి  ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం పనసపుట్టు గ్రామంలో పర్యటించి అన్ని వీధుల్లోనూ తిరిగి ఆంత్రాక్స్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. వ్యాధి భయంతో ఇళ్లకే పరిమితమైన గ్రామస్తులు ఈశ్వరి  రాకతో  బయటకు వచ్చి తమ కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు.



నెల రోజుల వ్యవధిలో 16 పశువులు మృతి చెందాయని, ఈ వారం రోజుల్లో 18 మంది గిరిజనులకు చేతులు, కాళ్లు, ముఖంపై పెద్ద కురుపులు ఏర్పడి ఆత్రాక్స్ వ్యాధి లక్షణాలు ఏర్పడ్డాయని, వీరంతా విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే తమ ఓట్లతో గెలిచిన అర కు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గాని, ఇతర మండల ప్రజా ప్రతినిధులెవరూ తమ గ్రామానికి ఇంతవరకు రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి స్పందిస్తూ, ఉన్నత వైద్యసేవలు కల్పించడంతోపాటు భవిష్యత్తులో   అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని, గ్రామంలో అన్ని కుటుంబాలకు  నిత్యవసరాలను ప్రభుత్వం పంపిణీ చేసేలా అధికారులపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.



గ్రామంలో  తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గతంలో నిర్మించిన గ్రావిటీ పథకం చుక్క నీరు లేక మూలకు చేరిందని, కొత్త తాగునీటి పథకం మంజూరుకు అధికారులతో మాట్లాడాలని ఇక్కడ గిరిజనులంతా ఎమ్మెల్యేను కోరారు. ఈ సమస్యపై ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లి తాగునీటి సమస్యను వేగవంతంగా పరిష్కరిస్తానని  ఈశ్వరి చెప్పారు.





 కిడారి చర్య సిగ్గుచేటు

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఈశ్వరి మాట్లాడుతూ ఓట్లు వేసి గెలిపించిన గిరిజనులు కష్టాల్లో ఉంటే అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు డబ్బు సంపాదన, అధికారమే ధ్యేయంగా పనిచేయడం సిగ్గుచేటన్నారు.  టీడీపీలోకి చేరి అమరావతిలో రూ.20 కోట్ల నోట్ల కట్టలను లెక్కపెట్టుకుంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు.  నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉండే గిరిజన సాంప్రదాయాన్ని కూడా మట్టిలో కలిపిన ఘనత కిడారికే దక్కిందన్నారు. ఇలాంటి నమ్మక ద్రోహికి మన్యం ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.



244 పంచాయతీల పరిధిలో  గిరిజనులు తాగునీటికి అల్లాడుతున్నారని, ఈ సమస్యను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.   ప్రస్తుతం నిర్మిస్తున్న తాగునీటి పథకాలు కూడా నిర్వహణ లోపంతో మూలకు చేరుతున్నాయని, పనులు   నాసిరకంగా చేస్తూ తాగునీటి పథకాల్లో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు  గిరిజనుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ పోరాటాలను ఉధృతం చేస్తుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు కె.పద్మకుమారి, పాడేరు వైస్ ఎంపీపీ మాదెల బొజ్జమ్మ, పాడేరు ఎంపీటీసీ సభ్యులు గిడ్డి విజయలక్ష్మి, కూడి దేవి, కిల్లు చంద్రమోహన్, కోఆప్షన్‌సభ్యులు ఎండీ తాజుద్దీన్, వైఎస్సార్‌సీపీ నేతలు చింతపల్లి సుధాకర్, లకే రత్నాభాయి, కూడి వలసయ్య, బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top