జిల్లాలో దొంగలు పడ్డారు


ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లె పరిధిలోని రాజేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్న వ్యాపారి కర్నాటి వీరశేఖర్‌రెడ్డి ఇంటిలో భారీ చోరీ జరిగింది. దొంగలు బంగారు, వెండి నగలతోపాటు నగదును అపహరించారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు ... వీరశేఖర్‌రెడ్డి తన సతీమణి శ్రీదేవి, పిల్లలు విశ్వనాథరెడ్డి, శివకుమార్‌రెడ్డి, జ్యోతిలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలంకు వెళ్లారు.

 

 ఇంటిలో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దొంగలు అదే రోజు రాత్రి చోరీకి పాల్పడ్డారు.  బీరువాలోని నెక్లస్‌లు, చైన్‌లు, బ్రాస్‌లైట్లు తదితర 25 తులాల బంగారు నగలు, వెండి ప్లేట్లు, చెంబు తదితర మూడున్నర కిలోల వెండి నగలను చోరీ చేశారు. వీటితోపాటు బీరువాలోనే ఉంచిన రూ.2.15లక్షల నగదును తీసుకెళ్లారు. సుమారు లక్ష రూపాయల విలువ గల మూడు పట్టు చీరెలను కూడా అపహరించారు. సోమవారం మధ్యాహ్న సమయంలో పక్కింటిలో నివశిస్తున్న మహిళ వీరశేఖరరెడ్డి ఇంటి తలుపులు తెరచిన విషయాన్ని గమనించింది.

 

 వెంటనే వీరశేఖర్‌రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపింది. ఆయన తమ బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు ఇంటి వద్దకు వెళ్లి చోరీ జరిగినట్లు గుర్తించారు. సోమవారం సాయంత్రానికి ఇంటికి వచ్చిన వీరశేఖర్‌రెడ్డి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం క్లూస్ టీం అధికారులతోపాటు టూటౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి విచారించారు. సినీ హబ్ అధినేత బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, కౌన్సిలర్ నారాయణరెడ్డితోపాటు పలువురు వీరశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.



 వారంలో రెండో సంఘటన

 ప్రొద్దుటూరులో వారంలో రెండో భారీ చోరీ సంఘటన వెలుగు చూడటం గమనార్హం. ఈనెల 23న వైఎంఆర్ కాలనీలోని డీఏడబ్ల్యూ కళాశాల కరస్పాండెంట్ దేవరశెట్టి నాగరాజు కుటుంబ సభ్యులతో బెంగుళూరుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఇంటి తాళాలు పగులగొట్టి రూ.12.50 లక్షల విలువైన బంగారు, నగదును అపహరించుకెళ్లారు. 26వ తేదీన చోరీ సంఘటనను గుర్తించారు. ఇదే తరహాలో ప్రస్తుతం వీరశేఖర్‌రెడ్డి ఇంటికి తాళం వేసి శ్రీశైలంకు వెళ్లగా చోరీ జరగింది. దీనిని బట్టి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఈసంఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top