ఆర్థిక ప్రణాళికతోనే జీవితంలో విజయం


కడప కార్పొరేషన్/వైవీయూ : జీవితంలో విజయం సాధించడానికి ఆర్థిక ప్రణాళిక ఎంతో ఉపయోగపడుతుందని ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఏపీ, తెలంగాణ రీజినల్ హెడ్ జి.వి.రవిశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కడప నగరంలోని మయూర గార్డెనియాలో సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ ఆధ్వర్యంలో మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్ ప్రతినిధులు, ఫైనాన్సియల్ అడ్వైజర్‌లు ఇన్వెస్ట్‌మెంట్, సేవింగ్స్, ఈక్విటీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్స్ తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మదుపరులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు విచ్చేసిన జి.వి. రవిశేఖర్ మదుపరులను ఉద్దేశించి  మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించి సంపాదించిన సొమ్మును సరైన సమయంలో సరైన చోట పెట్టుబడి పెట్టినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. చేసే పని ఏదైనా ప్రణాళిక ఉంటే విజయం సాధిస్తామన్నారు. అదే విధంగా  తెలిపారు. సాధారణ ప్రజలు సైతం పెట్టుబడి పెట్టాల్సిన అంశాలపై అవగాహన తెచ్చుకోవాలన్నారు.

 

 డబ్బు అందరికీ ప్రధానమేనని, అందరూ పనిచేసేది దానికోసమేనన్నారు. అయితే సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రణాళిక, లక్ష్యం లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఒక మొబైల్, ఒక ఫ్రిజ్ కొనేటప్పుడు అందరినీ విచారించి కొంటారని, పెట్టుబడి మాత్రం ఆలోచించకుండానే పెట్టేస్తుంటారని ఇది సరైన విధానం కాదన్నారు. అలాగే ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయాలా, పెట్టుబడి పెట్టాలా అన్న విషయంలో కూడా సందిగ్ధత నెలకొంటుందన్నారు. సెన్సెక్స్‌లో దీర్ఘకాలంపాటు పెట్టుబడి పెడితే నష్టాలు రావన్నారు.

 

  అనంతరం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్  శాంతి రాజ్ మాట్లాడుతూ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటి, ఆదాయం, ఖర్చులు, పొదుపు ఎలా చేస్తున్నాం, పెట్టుబడి ఎందుకు పెట్టాలి, ఎలాంటి బీమా చేయాలి వంటి వాటి గురించి సుదీర్ఘంగా వివరించారు. సాక్షి  కడప యూనిట్ ఇన్‌చార్జి నాగభూషణం మాట్లాడుతూ మదుపరుల అవగాహన సదస్సును మొట్టమొదటగా కడపలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. అంతకుముందు మదుపరులకు అవగాహన కల్పించడానికి ప్రదర్శించిన లఘునాటిక ఆకట్టుకొంది. ఈ కార్యక్రమంలో సాక్షి ప్రతినిధి ఉగ్రగిరి రావు, బ్యూరో ఇన్‌చార్జి ఎం. బాలక్రిష్ణారెడ్డి, సాక్షి ఏడీవీటి రీజనల్ మేనేజర్ సుబ్బారెడ్డి, ఏడీవీటి జిల్లా ఇన్‌చార్జి చాముండేశ్వరి, స్టాఫ్ రిపోర్టర్ నాగిరెడ్డి పలువురు వ్యాపారులు, డాక్టర్లు, ఫైనాన్షియర్లు, పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top