సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటించాలి


కర్నూలు(అగ్రికల్చర్): సమైక్యాంధ్ర పరిరక్షణకు 80 రోజుల పాటు చేపట్టిన సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవులుగా ప్రకటించాలని ఏపీఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. నగరంలోని కేవీఆర్ కళాశాల సమావేశ మందిరంలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు.. హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు 13 జిల్లాల స్థితిగతులపై సమీక్షించారు.

 

జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పలు డిమాండ్లు, సమస్యలను రాష్ట్ర కార్యవర్గం ముందుంచారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పీఆర్‌సీ కోసం కమిటీ వేశారని.. రెండు నెలల క్రితమే కమిటీ నివేదిక అందజేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం తగదన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధమని, అవసరమైతే అదనపు గంటలు కూడా పని చేస్తామన్నారు. విజయవాడలోనూ, అసెంబ్లీలో ప్రకటించినట్లుగా కాంట్రాక్ట్, కంటింజెంట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసేందుకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేసేందుకు వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలన్నారు.

 

అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కోశాధికారి వీరేంద్రబాబు, ఉపాధ్యక్షులు జి.రామకృష్ణారెడ్డి, ప్రభాకర్, రవిశంకర్, విద్యాసాగర్, శివారెడ్డి,రమణ, కార్యదర్శులు లూక్, గంగిరెడ్డి, నరసింహారావు, నరసింహులు.. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి, శ్రీరాములు, కోశాధికారి పి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top