చందనం తా‘కట్టు’ కథ

చందనం తా‘కట్టు’ కథ - Sakshi


పెరుగుతున్న చెట్లను తనఖా పెడతామంటూ ఏపీ సీఎం వింత మాటలు

 


చట్టంలో, రాజ్యాంగంలో ఎక్కడా అలాంటిది లేదంటున్న న్యాయవేత్తలు

అలాంటి రుణాల మంజూరీ అసాధ్యమని తేల్చిచెబుతున్న బ్యాంకులు

సర్కారు ఆదేశాలతో చెట్లను లెక్కబెట్టడానికి బయల్దేరిన సిబ్బంది




విజయవాడ బ్యూరో, హైదరాబాద్: అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఎడాపెడా వాగ్దానాలు... వాటిని అమలు చేయగలమా? లేదా? అనే సాధ్యాసాధ్యాలను కూడా పట్టించుకోకుండా మేనిఫెస్టోలో పెట్టేసి ఎన్నికల్లో ప్రచారం!! తీరా ఆ వాగ్దానాలను నమ్మి జనం ఓట్లేయటంతో గెలిచిన చంద్రబాబు... ఇపుడు ఆ హామీలను పక్కనబెట్టడానికి కమిటీల ఏర్పాటంటూ... ఆర్‌బీఐకి లేఖలంటూ రకరకాల విన్యాసాలకు దిగుతున్నారు. రాజధాని పేరిట హుండీలు పెట్టి అభాసు పాలయ్యారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇపుడు ఎర్రచందనం పేరుతో తా‘కట్టు కథ’లు చెబుతున్నారు.  బ్యాంకులేమో అలాంటి అవకాశమే లేదంటున్నాయి. అటవీ శాఖేమో అలా అనుమతిచ్చే అధికారం కేంద్రానికి సైతం లేదంటోంది.



మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికివేమీ తెలీవా అంటే... ఆయనకు కావలసిందల్లా ఏదో ఒక ప్రకటనతో రోజులు నెట్టుకురావటం! అంతే..!! రుణ మాఫీ కోసం ఎర్రచందనం దుంగలను బహిరంగ మార్కెట్లో విక్రయించటమే కాకుండా అడవిలో పెరుగుతున్న ఎర్రచందనం చెట్లను తాకట్టు పెట్టి నిధులు సమీకరిస్తామని తాజాగా ఆయన చేసిన ప్రకటన కూడా అలాంటిదే. ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక ఏదో ఒక సాకుతో కాలయాపన చేయడానికేనని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎర్రచందనం నిల్వల అమ్మకానికే కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. వాటిని బహిరంగ మార్కెట్‌లో వేలం వేసి వచ్చిన డబ్బును వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం ఎర్రచందనం తగినంత అందుబాటులో లేదు. అందుకని రేటు బాగానే ఉది. కానీ ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో అందుబాటులోకి వస్తే రేటు పడిపోతుందన్నది కొత్త విషయమేమీ కాదు. ఎర్రచందనం చెట్లను తాకట్టు పెట్టి నిధులు సమీకరిస్తామన్న మాటలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ‘‘అడవులు జాతి సంపద. వాటిని బ్యాంకులు, ఆర్థికసంస్థల దగ్గర తాకట్టు పెట్టడానికి చట్టాలు అంగీకరించవు’’ అని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా ప్రకటనలు చేస్తుండటాన్ని చూస్తే ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని అర్థమవుతోందని వారు వ్యాఖ్యానించారు. దీనిపై అటవీ శాఖలో కీలక పదవులు నిర్వహించి రిటైరైన అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘ఇది ఆచరణ సాధ్యం కాదు. జాతి సంపదను తాకట్టు పెడతామని సీఎం చెప్పటం ఎప్పుడూ వినలేదు. కేంద్రం దీనికి అనుమతివ్వదు. ఇలా ఇచ్చే అధికారం దానికి లేదు’అని అన్నారు. చెట్టు ను తాకట్టు పెట్టడమన్నది రాజ్యాంగంలో లేదని, లేని చట్టాలపై చర్చే అనవసరమని సీనియర్ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు.

 స్కీముల్నే ఆర్‌బీఐ నిషేధించింది: బ్యాంకర్లు

 దీనిపై జాతీయ బ్యాంకుల సీనియర్ అధికారులిద్దరు స్పందిస్తూ ‘‘ప్రభుత్వం గానీ, ప్రయివేటు సంస్థలు లేదా వ్యక్తులు గానీ ఇలా చెట్లను తనఖా పెట్టి రుణం తీసుకోవటమన్నది ఇంతకు ముందెన్నడూ జరగలేదు. అయినా ఇది కోటి రూపాయలో, రెండు కోట్ల రూపాయలో కాదు. వేల కోట్ల రూపాయలు అప్పివ్వాలంటే ఏదో ఒక బ్యాంకు నిర్ణయిస్తే చాలదు. బ్యాంకులన్నీ కన్సార్షియంగా ఏర్పడి నిర్ణయం తీసుకోవాలి. ఏ రుణమైనా దానికి తగ్గ విలువున్న ఆస్తిని తనఖా పెట్టుకుని ఇస్తారు. లేదంటే నెలవారీ అద్దెల వంటి గ్యారంటీ వచ్చే ఆదాయాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఇస్తారు. కానీ ఏమీ లేకుండా చెట్లను తనఖా పెట్టుకుని రుణాలివ్వటమనేది హాస్యాస్పదం. ఆ చెట్లు పెరగకుండానే ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతినవచ్చు. అయినా ఆ చెట్లను నరికేసే అధికారం ఎవ్వరికీ ఉండదు. అలాంటిది వాటిని తనఖాగా ఉంచుకుని రుణాలెలా ఇస్తాం? ఇది సాధ్యం కానేకాదు’’ అని అభిప్రాయపడ్డారు. మొక్కల్ని పెంచుతామంటూ డబ్బులు వసూలు చేసే పథకాలను (ప్లాంటేషన్ స్కీమ్‌లు) ఆర్‌బీఐ నిషేధించడాన్ని వారు గుర్తు చేశారు. ‘‘అలాంటిది ప్రభుత్వమే ఈ రకంగా తనఖా పెడతానంటే దానికి ఎవరు ఒప్పుకుంటారు?’’ అని ఎదురు ప్రశ్నించారు.



8,500 టన్నుల విక్రయూనికి సన్నాహాలు



రాజంపేట: వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేట డిపోలో ఉన్న 690 టన్నుల ఎర్రచందనం విక్రయూనికి రంగం సిద్ధమయింది. అటవీ శాఖ ఉన్నతాధికారుల ప్రత్యేక కమిటీ మంగళవారం డిపోను సందర్శించింది. రాష్ట్రంలో 10,500 టన్నుల ఎర్రచందనం నిల్వలున్నాయని, ఇందులో 8,500 టన్నులు విక్రరుుంచడానికి (ఈ-వేలం) సన్నాహాలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి 4 వేల టన్నులకు టెండర్లు పిలవనున్నట్లు తెలియజేశారు. ధరపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, పది రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఈ నిల్వలు అమ్మడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు టన్నుకు రూ.10 లక్షల రూపాయల అప్‌సెట్ ధరతో టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తున్నా, అంతర్జాతీయ స్థాయిలో ఈ ధర లభిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top