నమ్మి ఓట్లేస్తే.. నట్టేట ముంచారు..


రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట వందలాది మంది ఆందోళనకారులు కదంతొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిపై నాయకులు నిప్పులు చెరిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేశారు.  నాయకులను అదుపులోకి తీసుకోడానికి యత్నించిన పోలీసులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విచక్షణ రహితంగా మహిళలను పోలీసులు లాగిపారేయడంతో ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

 

 అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. హామీలను నమ్మి ఓటేసిన అన్నివర్గాలవారిని చంద్రబాబు వంచించారని ఆరోపించారు.  సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఓబళకొండారెడ్డి మాట్లాడుతూ  టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలు పది సంవత్సరాలుగా  ఖాళీగా ఉన్నారని.. మీరు కార్యకర్తల కోసమే పనిచేయాలంటూ ఇటీవల విజయవాడలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖానించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల కోసమే పనిచేస్తోందా..? అని ప్రశ్నించారు. అధికారులు, పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలల వేతన బకాయిలు కోసం 90 రోజులుగా యానిమేటర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో స్పందనలేదన్నారు.  

 

 సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ మధ్యాహ్నాం భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. 13 నెలలుగా భోజనం బిల్లులు అందక అవస్థలు పడుతున్నారన్నారు. రూ.400 తో ఆశా కార్యకర్తల కుటుంబాలు ఎలా బతుకుతాయని ఆయన ప్రశ్నించారు.  కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ నాగరాజు  తెలుగుదేశం ప్రభుత్వం కార్మికుల చట్టాలను ఉల్లఘింస్తోందన్నారు. సీఐ టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు లలితమ్మ మా ట్లాడుతూ వేతనాలు అందక కార్మికులు అస్థలు పడుతుండగా ముఖ్యమంత్రి సింగపూర్, జపాన్, మలేషియా జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

 

 ఉద్యోగం ఇచ్చే మాట అటుంచితే వే లాది ఉద్యోగాలను ఊడదీశారని మండిపడ్డారు.  ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి మాట్లాడుతూ   అంగన్‌వాడీ, ఆశా , మధ్యాహ్నా భోజన కాంట్రాక్టు కార్మికులకు రూ. 15 వేలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, వెలుగు యానిమేటర్లు, ఆశా కార్యకర్తలు, మెడికల్ అండ్ వైద్యశాఖలోని కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మధ్యాహ్నా భోజన కార్మికులు, ఫీల్డ్ అసిసెంట్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, స్కీమ్ వర్క్‌ర్లు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top