జిల్లాపై కాలుష్య రాకాసి

జిల్లాపై కాలుష్య రాకాసి


* విష వాయువులు, పదార్థాలు ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలు

* విజృంభిస్తున్న ధ్వని, వాయు, నీటి కాలుష్యాలు

* క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల వ్యాప్తి




 మంచి ఆరోగ్యానికి ఏం కావాలి?

 స్వచ్ఛమైన నీరు, గాలి, వాతావరణం

 పక్షపాతం లేకుండా ప్రకృతి  అందరికీ వీటిని ఇస్తుంది ..

 అయితే ఇవి కూడా కాలుష్యమైపోతే

 గాలిలో విషవాయువులు

 వాతావరణంలో బీభత్స ధ్వనులు

 నీటిలో కాలుష్య కారకాలుంటే..

 ప్రజలు ఏమై పోవాలి? వేరే గ్రహాలకు వెళ్లాలా?

 ఇలాగే జబ్బులతో కాలం వెళ్లదీయాలా?

 దీనిపై పాలకులకు చిత్తశుద్ధి లేదా?

 పరిశ్రమలపై కొరడా ఝళిపించలేదా?

 ...             ...                 ...

 ఒక్క నిమిషం..

 ప్రజలారా పర్యావరణ పరిరక్షణలో

 మీకు భాగస్వామ్యం లేదా?

 ఈ భూమి మీది కాదా?

 చెట్లను పరిరక్షించడం మీ చేతుల్లో లేదా?

 ఒక్కసారి ఆలోచించండి.. చేయి, చేయి కలపండి

 ప్రకృతిని కాపాడండి.. కాలుష్య కోరలు విరవండి

 సేవ్ ఎర్‌‌త.. సేవ్ పీపుల్.. సేవ్.. ఎన్విరాన్‌మెంట్!


 

కర్మాగారాల సమీపాలు ఇలా ఉండాలి..

ఏ పారిశ్రామిక వాడలో గమనించినా రణగొణ ధ్వనులు కార్మికుల కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. దీనిని నివారించాలంటే ధ్వని నియంత్రణ మాపనులను యాజమాన్యాలు కచ్చితంగా వాడాలి. కార్మికులకు కూడా అలాంటి పరికరాలు సమకూర్చాలి. నిత్యం పరిశ్రమల్లో పని చేసి వచ్చిన కార్మికులకు మనశ్శాంతి కలిగించడం కోసం వారు ఉండే ప్రదేశాల్లో పచ్చని పార్కులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలి. దీనివల్ల అపస్మారక స్థితికి వెళ్లినవారు కూడా తిరిగి యథాస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది.

 

ధూళి మేఘాలు కమ్మేస్తున్నాయ్

చీమకుర్తి, బల్లికురవలోని గ్రానైట్ గనులతో పాటు మార్కాపురం పలకల గనుల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నిబంధనల ప్రకారం ఇక్కడ మెటల్ రోడ్లే ఉండాలి. వాటిపై  క్రమం తప్పకుండా నీరు చల్లుతూ దుమ్ముధూళి లేవకుండా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలి. ఇది జరగకపోగా చిప్స్.. ఇసుక.. ఇతర పదార్థాలు తరలించేటప్పుడు ధూళి మేఘాల్లా లేస్తూ వాహన దారులను మింగేస్తోంది. దుమ్ము కళ్లల్లో పడిన సందర్భాల్లో చాలామంది ప్రమాదాలబారినపడుతున్నారు.  ఇటుక బట్టీలు విషవాయువులు వెదజల్లుతున్నాయి. దీని దెబ్బకు జనం అనారోగ్యం పాలవుతున్నారు.

 

గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు

కాలుష్య నివారణ  సంస్థ..  పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించింది. అవి గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు. మారిన నిబంధనల ప్రకారం స్టోన్ క్రషర్స్, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లను కూడా ‘రెడ్’ కిందకు తీసుకువచ్చారు. పర్యావరణానికి హాని కలిగించని వాటిని గ్రీన్ కిందకు.. కాస్త ప్రమాదకరంగా ఉన్నవాటిని ఆరెంజ్‌గా.. అత్యంత ప్రమాదంగా ఉండే పరిశ్రమలను రెడ్ జోన్లుగా వర్గీకరిస్తారు. జిల్లాలో 300 పైగా పరిశ్రమలున్నాయి. అయితే అందులో పది పరిశ్రమలు కూడా గ్రీన్ జాబితాలో లేవు. 80 వరకు ఆరెంజ్ జాబితాలో ఉండగా..మిగిలిన 210 పైగా పరిశ్రమలు రెడ్ జాబితాలో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి ఎంతమంది రెడ్ జోన్ కింద ప్రమాదకర రీతిలో ఉపాధి పొందుతున్నారో ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానిదే!

 

గాలి కాలుష్య పరిధి ఇదే

* గాలిలోని విష పదార్థాల వల్ల వస్తాయి ఈ వ్యాధులు

* రేణువులు: శ్వాసకోశ సంబంధిత వ్యాధులు

* సల్ఫర్ డైఆక్సైడ్: బ్రాంకైటీస్‌కు కారణం

* నైట్రోజన్ డైఆక్సైడ్: కళ్లు, ముక్కు మండడం, శ్వాశ పీల్చడంలో తీవ్ర చికాకు

* కార్బన్ మోనాక్సైడ్: శరీర జీవకణాలకు ఆక్సిజన్ లేకుండా చేస్తుంది. అపస్మారక  స్థితి కలుగుతుంది. 100 పీపీఎం దాటితే మరణానికి దారితీస్తుంది

* హైడ్రోకార్బన్లు: కేంద్ర నరాల వ్యవస్థకు నష్టం

* అమ్మోనియా: శ్వాసకోశ భాగాలన్నింటినీ ఇబ్బంది పెడుతుంది. కళ్లు తీవ్రంగా మండుతాయి.

* క్లోరిన్: ఊపిరితిత్తులతో పాటు కళ్లు మంట

* హైడ్రోజన్ సల్ఫైడ్: శ్వాసకోశాలకు పక్షపాతం. తక్షణమే మూర్ఛ పోతారు

* ఆస్బెస్టాస్: ఊపిరితిత్తుల క్యాన్సర్ కారకం

* సీసం(లెడ్): మెదడు పాడైపోవడం, కండరాల పక్షవాతం  సంభవిస్తాయి

 

 శబ్ద కాలుష్యానికి హద్దులు ధ్వని కలిగిస్తుందీ చేటు

* విపరీత శబ్దాలు ఉండే ధ్వనుల వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఫలితంగా రక్తపోటు వస్తుంది

* 65 డెసిబుళ్ల చప్పుడు మీరితే గుండె జబ్బులతో పాటు చెవుడు కూడా రావొచ్చు

* అధిక ధ్వని వల్ల పనిచేసే శక్తిని కోల్పోతాం. నిద్రపట్టదు. తలనొప్పి, అలసట ఎక్కువవుతాయి

* ఎక్కువైతే మానోవేదన కూడా కలుగుతుంది. దుష్పరిమాణాలు రాకుండా ఉండాలంటే ధ్వనులకు దూరంగా ఉండాలి.

 

సచ్ఛమైన నీరు ఉండాలిలా నీరు కాలుష్యమైతే జీవితం అంతే!

* చెరువుల్లో ఆక్సిజన్ అందక చేపలు చనిపోతాయి

* తాగడానికి, స్నానానికి , పరిశ్రమల్లో వినియోగించేందుకు, ఈత కొట్టేందుకు సైతం పనికిరావు

* ఇలాంటి నీటిని తాగితే న్యూమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, కోరింతదగ్గు, జలుబు, పోలియో కూడా రావొచ్చు

* సల్ఫేట్లు, ఫ్లోరైడ్లు, కాల్షియం, మెగ్నీషియం మిశ్రమ పదార్థాలు అధికంగా ఉంటే నీటిని ఆవిరి చేస్తాయి. ఉప్పు శాతం ఎక్కువవడం వల్ల సబ్బు అధికంగా వినియోగించాలి. నిల్వ చేస్తే తెల్లని తెట్టు ఏర్పడుతుంది.

* రసాయనాలు మితి మీరితే జీవులు, జీవకణాలు కదలకుండా ఆపుతాయి లేదా చచ్చిపోతాయి. (హెవీ మెటల్స్, ఆమ్లాలు, ఆల్కీన్లు, ఫినాయిల్, సైనైడ్లు, చీడపీడ మందులు మొదలైనవి)

* ఫినాయిల్, క్లోరో ఫినాయిల్, పారాఫిన్ హైడ్రోకార్బన్ల వల్ల నీటి రుచి, వాసనలు మారిపోతాయి. తాగేందుకు పనికిరావు.

* డిటర్జెంట్లు, సబ్బు నురగలు, జీవజాలాన్ని చంపేస్తాయి. పంటలకి, పశువులకు ప్రమాదం వాటిల్లుతుంది.

* బెరీలియం, సెలీనియం, క్యాడ్మియం, ఆర్థోఫాస్పరస్ చీడల మందులు, పీవీసీ , రేడియో యాక్టివ్ న్యూక్లయిడ్లు క్యాన్సర్‌కి దారితీస్తాయి.

* చెత్తా చెదారం , ఇటుక రాళ్లు..  తనంత తాను నీరు శుభ్రం చేసుకోగల శక్తిని తగ్గిస్తాయి.

* థర్మల్ కాలుష్యంలో మండే మంటల వల్ల ఆక్సిజను తగ్గుతుంది. వేడి పెరిగి ఎన్నో పదార్థాల్లో విషం పెరుగుతుంది. 40 డిగ్రీల సెంటీగ్రేడుకు మించిన వేడివల్ల చేపలు వలసపోతాయి లేదా చచ్చిపోతాయి.

 

చెట్లను నరకడం శాపం

కలప, వంట చెరకుతో పాటు హైవే విస్తరణ కోసం చెట్లను విపరీతంగా నరికేస్తున్నారు. దీనివల్ల కార్బన్‌డయాక్సైడ్ శాతం పెరిగిపోతోంది. ఆక్సిజన్ తగ్గిపోతోంది. అటవీసంపదను నరికివేయకుండా అటవీ సంరక్షణ చట్టాలను కఠినతరం చేస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి ఇంకా మెరుగు పడాల్సి ఉంది.

 

పొల్యూషన్ ‘నో చెక్’

ఒంగోలు నగరంలో పెరిగిన వాహనాల వల్ల ధ్వని, వాయు కాలుష్యాలు విపరీతమయ్యాయి. ఇరుకు రోడ్లు, సరైన ప్రణాళిక లేకపోవడంతో వాహనాలు ప్రతి చోటా ఆగాల్సి వస్తోంది. దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ శాతం పెరిగిపోతోంది. 5 సంవత్సరాలకు మించి వాహనాలను వాడకూడదనే చట్టం ఉంది. పొల్యూషన్ చెక్ క్రమం తప్పకుండా చేయించుకోవాలి. కానీ ఈ ఏర్పాట్లు అప్పుడప్పుడూ హైవేలపైనే కనిపిస్తున్నాయి. కాలం చెల్లిన వాహనాలను వాడకుండా నియంత్రించడంలేదు. పెట్రోలు, డీజిల్ కల్తీ వల్ల కూడా కాలుష్యం పెరిగిపోతుంది. ట్రాఫిక్ జామ్ అయితే వాహనల హారన్ల శబ్దాన్ని భరించే పరిస్థితి ఉండదు. అక్కడ  ఆస్పత్రులు ఉంటే రోగుల పరిస్థితి అంతే!

 

ఆ ఫ్యాక్టరీలు పర్యావరణ విఘాతాలు

ఒంగోలు సమీపంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ నుంచి సంబంధిత వ్యర్థాలను హైదరాబాదు సమీపంలోని మెయిన్ ఫ్యాక్టరీ వద్దకు తరలించేం దుకు రెండేళ్ల క్రితం యాజమాన్యం చర్యలు తీసుకుంది. అయితేఅవి వెళ్లేంతవరకు ఆ మార్గంలో ఉన్న ప్రజలు వాసన దెబ్బకు వాంతులు చేసుకున్నారు. ఇక ఈ ఫ్యాక్టరీ సమీపంలో ఉండేవారు కెమికల్స్ ఘాటుకు జనం బిత్తర పోతున్నారు. కానీ నివారణ చర్యలు మాత్రం కనిపించవు.



అలాగే నెల్లూరు- ఒంగోలు మార్గమధ్యంలో రైల్వే ట్రాక్ మార్గంలో మరో ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడకు వెళ్లగానే దానిలో నుంచి వచ్చే దుర్వాసన పేగులను కూడా తోడేసేలా ఉంటుంది శ్వాస తీసుకోవడానికి సైతం ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు సంబంధిత శాఖ జిల్లాలో లేకపోవడం కూడా సమస్యగా మారింది. అందుకే యాజమాన్యాలు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలాగాటం ఆడుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top