యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం

యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం - Sakshi

  •    ఉచితంగా వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

  •      చెవిరెడ్డి ప్రయత్నం అద్భుతం కరుణాకర రెడ్డి ప్రశంస

  • తిరుపతి : ‘‘తనకున్న భక్తిని పదిమందికి పంచుతూ గ్రామాల్లో మరింతగా ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేదుకు నా తమ్ముడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేపట్టిన వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం అద్భుతమైంది’’ అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాలకు ఉచితంగా వినాయక విగ్రహాలను అందిస్తుంటారు.



    ఇందులో భాగంగా బుధవారం చేపట్టిన వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని భూమన కరుణాకరరెడ్డి పూజచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం, ఐక్యతను పెంచేందుకు చెవిరెడ్డి చేపట్టిన ఉచిత విగ్రహాల పంపిణీ కార్యక్రమం చాలా మంచిదని కొనియాడారు. గ్రామాల్లో విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం వినాయక విగ్రహాల పంపిణీ ద్వారా చేస్తున్నారన్నారు.



     ప్రతి ఏడాదీ కొనసాగుతుంది : చెవిరెడ్డి

     

    యువకులు ఐకమత్యంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ వినాయక విగ్రహాలను ఉచితంగా అందిస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది 680 విగ్రహాలు ఇచ్చానన్నారు. ఈ ఏడాది విగ్రహాలకు రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిందన్నారు. యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంచేందుకోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. కష్టపడేతత్వం, ఆధ్యాత్మిక లక్షణాలు ఉంటే ఏధైనా సాధించవచ్చన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల గ్రామాలకు 20 లక్షల రూపాయల ఖర్చుతో 720 విగ్రహాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఉపేంద్రరెడ్డి, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, పొట్టేలు మునస్వామి, చిన్నీయాదవ్, శ్రీరాములు, నంగా బాబురెడ్డి, భాను పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top