పదే పదే అదే పని!

పదే పదే అదే పని!

  • ప్రభుత్వానికి కొరవడిన స్పష్టత

  •  నష్టం అంచనాలో రోజుకో ఆదేశం

  •  ఒకపని రెండుసార్లు చేస్తున్న సిబ్బంది

  •  రవాణా చార్జీల భారం డీలర్ల నెత్తిన

  • నక్కపల్లి: హూదూద్ తుపాను నష్టం లెక్కింపులో ప్రభుత్వం రోజుకో జీవో, పూటకో ఆదేశం విడుదల చేయడంతో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది నరకయాతన పడుతున్నారు. చేసిన పనినే మళ్లీ చేయాల్సి వస్తోందని అదేదో ముందే చెప్పుంటే ఈ పాటికి నష్టాన్ని అంచనా వేసి నివేదికలు తయారు చేసి ఉండేవాళ్లమని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 రోజుల నుంచి ఇంటిపట్టున లేకుండా పునరావాస కార్యక్రమాలు, సర్వేలు, నష్టం అంచనా పేరుతో కుటుంబానికి దూరంగా గడుపుతున్నామని విశ్రాంతి లేకుండాపోతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



    తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. బాధితులకు పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం నుంచి రోజుకొక జీవో, పూటకొక ఆదేశం వస్తోంది. దీంతో ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. విపక్షాలు, బాధితుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం పరిహారం పంపిణీ, బాధితుల గుర్తింపు, నష్టం అంచనా విషయంలో రోజుకోమాట మారుస్తోంది.

     

    బియ్యం పంపిణీలో...



    తుపాను ప్రభావిత గ్రామాల్లో మత్స్యకారులకు, చేనేత కార్మికులకు 50 కిలోలు, ఇతరులకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. తర్వాత  మత్స్యకారులకు, నేత కార్మికులకు 50 కిలోల వంతున ఇతరులకు 10 కిలోలే అని చెప్పి సరుకులు సరఫరా చేసింది. డీలర్లు అదేవిధంగా పంపిణీ చేస్తుంటే బాధితుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. కొన్ని గ్రామాల్లో 10 కిలోల వంతున పంపిణీ పూర్తయింది. ప్రభుత్వం మాటమార్చి మళ్లీ 25 కిలోలు ఇవ్వాలని చెప్పడంతో 15 కిలోల వంతున రెండోసారి అలాట్‌మెంట్ పంపించారు. ఒక కార్డుదారుడికి పదికిలోలు ఒకసారి 15 కిలోలు రెండోసారి ఇలా రెండుసార్లు డీలర్లు పంపిణీ చేయాల్సి వచ్చింది.



    ఆధార్ సీడింగ్ కాని వారికి, తెల్లకార్డులేనివారికి, పింక్‌కార్డు కలిగినవారికి తుపాను సాయం ఇవ్వొద్దని సర్కారు మొదట ప్రకటించింది. వీరందరికి అలాట్‌మెంట్  ఇవ్వలేదు. వారంతా ఆందోళన చేయడంతో ఇప్పుడేమో వారికి కూడా ఇవ్వాలని చెబుతోంది. అ లాంట్‌మెంట్ ఇచ్చారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుం చి డిపోలకు సరుకులు తీసుకెళ్లడానికి డీలర్లకు ఒక్క రూపా యి కూడా ఇవ్వలేదు. డీలర్లే చేతిచమురు వదుల్చుకోవాల్సి వస్తోంది. తుపాను పుణ్యమా అని ఒక్కొక్క డీలర్ రూ.3వేల నుంచి 5 వేల వర కు నష్టపోయారు. రెండుసార్లు రవా ణా చార్జీలు భరించాల్సి వచ్చింది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. నిత్యావసర సరుకులు, కూరగాయలయితే పూర్తిస్థాయిలో ఇంకా డిపోలకు చేరలేదు.

     

    పంట నష్టపరిహారం విషయంలోనూ...



    పంటనష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చే సింది. కొబ్బరి నష్టాన్ని చెట్ల సంఖ్య ఆధారంగా లెక్కించాలని, మామిడి, జీడిచెట్లను మాత్రం ఎకరా విస్తీర్ణంలో 20కి మించి చెట్లు కూలిపోతేనే పరిహారానికి సిఫార్సు చేయాలని పేర్కొనడంతో సర్వే బృందాలు ఆ విధంగానే పనిచేసి నివేదికలు తయారు చేస్తున్నాయి. చాలా గ్రామాల్లో  ఈ నిబంధనల ఆధారంగానే కొబ్బరి, మామిడి, జీడి, అరటి చెట్లకు జరిగిన నష్టాన్ని గుర్తించి బాధితుల జాబితా తయారు చేశారు.



    తీరా ఇదంతా జరిగిన తర్వాత శనివారం మామిడి, జీడి నష్టాన్ని కూడా కూలినచెట్ల సంఖ్య ఆధారంగా లెక్కించాలని, విస్తీర్ణంతో పనిలేదని ఆదేశాలు జారీచేసింది. దీంతో  అధికారులు తల లు పట్టుకుంటున్నారు. వెళ్లిన తోటల్లోకే మళ్లీ వెళ్లి నష్టం వాటిల్లిన చెట్లను లెక్కించి, ఫొటోలు తీయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే ఆదేశాలు మొదట్లోనే ఇస్తే సరిపోయేది కదా? రెండుసార్లు వెళ్లాల్సిన అవస రం ఉండేది కాదుకదా! అని సిబ్బంది అంటున్నారు.

     

    ఇళ్ల విషయంలోనూ ఇదే దుస్థితి



    నష్టం వాటిల్లిన ఇళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఇటువంటి ఆదేశాలే జారీ చేస్తోంది. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను చాలా గ్రామాల్లో బాధితుల జాబితాల్లో చేర్చలేదు. ఇప్పటివరకు తయారు చేసిన తుదిజాబితా ప్రకటిస్తామని వాటిలో పేర్లు లేని వారు 27లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇదంతా ఎందుకు ఒకేసారి ఈ పని చేయవచ్చు కదా, జాబితాలో పేర్లులేని వారు మళ్లీ దరఖాస్తు చేస్తే  ఇంకోసారి సర్వే బృందాలను పంపిస్తారన్నమాట!

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top