ఇదీ ‘అధికార’ న్యాయం!

ఇదీ ‘అధికార’ న్యాయం! - Sakshi


* భూమాపై కేసులు పెట్టిన వెంటనే అరెస్టు

* టీడీపీ నేతలు శిల్పా, సులోచన తదితరుల విషయంలో మీనమేషాలు

* కోర్టు ఆదేశించిన తర్వాతే కేసుల నమోదు.. ఆపై అరెస్టులో ఆలస్యం

* దర్జాగా తిరుగుతున్న టీడీపీ నేతలు


సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో అధికార పార్టీ రాజకీయ వేధింపులు మితిమీరుతున్నాయి. అక్రమ కేసులు బనాయించడమే కాకుండా.. ఒక్కో కేసులో ఒక్కోసారి జైలుకు పంపేందుకూ వెనుకాడటం లేదు. తద్వారా ప్రతిపక్ష పార్టీల నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇందుకు పోలీసులూ సహకరిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలపై మాత్రం ఫిర్యాదులు వచ్చినా కేసులు పెట్టేందుకు పోలీసు యంత్రాంగం జంకుతోందనే ఆరోపణలున్నాయి. చివరకు కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినా.. వారిని అరెస్టు చేసేందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు.



వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డిపై నమోదైన కేసులే.. తెలుగుదేశం నేతలపై నమోదైనా.. వారు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. ఈ ద్వంద్వనీతిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జెడ్పీ చైర్మన్, తెలుగుదేశం నేత మల్లెల రాజశేఖర్ ఏకంగా కల్తీ మద్యం కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్నారు. ఆయనపై పక్కా ఆధారాలున్నా.. అరెస్టు చేయడం లేదు. సీఎం చంద్రబాబు నుంచి తనకు అభయం ఉందని చెప్పుకొంటూ ఆయన తిరుగుతున్నారు.



కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో ఆయన కలెక్టర్ పక్కనే కూర్చున్నారు. జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ రాంపుల్లయ్యయాదవ్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ నేతలు.. అది సాధ్యంగాకపోవడంతో ఆయన ఆ సంఘం డెరైక్టర్లను కిడ్నాప్ చేశారంటూ నాటకం ఆడుతున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు డెరైక్టర్లను రాంపుల్లయ్యే కిడ్నాప్ చేశారంటూ ఆయన ఇంట్లో లేని సమయంలో శుక్రవారం రాత్రి పోలీసులు సోదాలు చేశారు. ఈ విధంగా అన్ని వ్యవహారాల్లోనూ అధికార పార్టీ జిల్లాలో ‘టై’ సృష్టిస్తోంది.

 

అవే కేసులు.. మరి అరెస్టులేవీ?

వాస్తవానికి భూమా నాగిరెడ్డిపై రెండు హత్యాయత్నం కేసులు (సెక్షన్ 307), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. మొత్తం మూడు కేసుల్లో.. మొదటి కేసు నంబర్ (224/12)లో సెక్షన్లు 147, 109, 447, 120 (బి), 427, 457, 342, 324, 307, 354, 152, 332, 336, 506, 509, రెడ్ విత్ 149, మరో కేసు (225/14)లో 147, 148, 324, 506, 307, రెడ్ విత్ 149, మూడో కేసు (226/14)లో సెక్షన్లు 324, రెడ్ విత్ 34తో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తెలుగుదేశం నేతలపై మాత్రం మొదట్లో నమోదు చేయకపోయినప్పటికీ.. తీరా కోర్టు అక్షింతలతో కేసులు నమోదయ్యాయి. అటు భూమాతో పాటు ఇటు తెలుగుదేశం నాయకుడు శిల్పామోహన్‌రెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచనతో పాటు ఇతర టీడీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులే నమోదయ్యాయి.



శిల్పామోహన్‌రెడ్డి, దేశం సులోచన, దేశం సుధాకర్‌రెడ్డి, అమృతరాజు, పెదకండిగ సుబ్రమణ్యం, రంగాప్రసాద్, కృష్ణమోహన్, ఇతరులపై ఈనెల 18న.. ఐపీసీ సెక్షన్లు 120 (బి), 324, 307 ఆర్/డబ్ల్యు 34, సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) కింద కేసులు నమోదు చేశారు. మరో కేసులో (227/14) దేశం సులోచన, వెంకటసుబ్బయ్య, గొల్ల లక్ష్మీనారాయణ, జాకీర్‌హుస్సేన్, తెలుగు కృష్ణమోహన్, అమీర్‌బాషాలపై సెక్షన్లు 323, 354, 427, అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. ఇందులో 354, అట్రాసిటీ కేసులు.. రెండూ నాన్ బెయిలబుల్ కేసులే. తెలుగు కృష్ణమోహన్‌పై ఇప్పటికే నంద్యాల త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. అయినా అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారు.

 

బెయిల్ తెచ్చుకునేదాకా ఆగుదాం..

వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు నమోదైన వెంటనే అరెస్టు చేసేందుకు ప్రభుత్వం నంద్యాలలో యుద్ధ వాతావరణం సృష్టించింది. తెలుగుదేశం నేతల విషయంలో మాత్రం పోలీసులు స్పందించడంలేదు. టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకునే వరకు వేచిచూడాలని పోలీ సులపై అధికార పార్టీ ఒత్తిళ్లు ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. కేసులో ఉన్న శిల్పామోహన్‌రెడ్డి బెంగళూరు నుంచి శనివారం నంద్యాల వచ్చారు. మున్సిపల్ చైర్‌పర్సన్, టీడీపీ నేత దేశం సులోచన శనివారం నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

కేసు వెనుక కేసు పెట్టి వేధింపులు


భూమా నాగిరెడ్డిపై మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఒక్కోసారి ఒక్కోకేసులో జైలుకు పంపేందుకు ప్రణాళిక వేశారు. వాస్తవానికి ఒకేసారి మూడు కేసుల్లో రిమాండ్ విధించాలని భూమా తరఫు న్యాయవాది పోలీసులను కోరారు. అయితే.. ప్రస్తుతం ఒక కేసు మాత్రమే పెడుతున్నామని.. మిగతా రెండింటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఒక కేసులో భూమా నాగిరెడ్డికి నంద్యాల కోర్టు బెయిల్ ఇచ్చింది. మిగిలిన రెండు కేసుల్లో.. ప్రస్తుతానికి ఒక కేసులో మళ్లీ జైలుకు పంపాలనేది అధికారపార్టీ దురాలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఆ కేసులో కూడా బెయిల్ వస్తే.. మూడో కేసులో ఇరికించి మళ్లీ జైలు మెట్లు ఎక్కించాలనేది అధికారపార్టీ పన్నాగంగా తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top