ఢీ అంటే ఢీ

ఢీ అంటే ఢీ


బడ్జెట్‌పై పాలక, ప్రతిపక్షాల ఫైట్  రూ.486 కోట్లతో ఆమోదం

 

 

విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ రెవెన్యూ బడ్జెట్ సమావేశంలో అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అన్నాయి. పన్ను భారాలతో ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ విపక్షాలు మండిపడ్డాయి. పన్నుల బాదుడు లేకుండానే అదనపు ఆదాయాన్ని తెచ్చి చూపిస్తానని మేయర్ కౌంటర్ ఇచ్చారు. కార్పొరేషన్  రెవెన్యూ బడ్జెట్ సమావేశం బుధవారం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగింది. 2015-16 ఆర్థిక  సంవత్సరానికి సంబంధించి రూ.486 కోట్ల 94 లక్షల 27 వేల 327 బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. ఈ సమావేశం  పాలక, ప్రతిపక్షాల   మాటల తూటాల నడుమ వాడీవేడిగా సాగింది. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బి.నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ.. ఆస్తి పన్ను రూ.74 కోట్ల నుంచి రూ.132 కోట్లకు పెంచడాన్ని తప్పుబట్టారు.



పన్నుల బాదుడుకు మేయర్ శ్రీకారం చుడుతున్నారని ఆరోపించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.120 కోట్లు చూపారు కదా.. ఇప్పటివరకు ఎంత వసూలుచేశారని ప్రశ్నించారు. డిప్యూటీ కమిషనర్ డి.వెంకటలక్ష్మి మాట్లాడుతూ  రూ.74 కోట్ల సాధారణ డిమాండ్‌లో రూ.55 కోట్లు వసూలయ్యాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 30 కోట్లు, వివిధ కోర్టు కేసుల పరిష్కారం అయితే రూ.8 కోట్లు వసూలవుతాయన్నారు. వీటన్నింటినీ గత బడ్జెట్‌లో చూపామన్నారు. మీరు పాతవే సక్రమంగా వసూలు చేయకుండా కొత్తగా రూ.132 కోట్లు వస్తోందని అంచనాల్లో చూపడం వల్ల ఉపయోగం ఏమిటని పుణ్యశీల ప్రశ్నించారు. దొడ్డిదారిన పన్నులు పెంచేందుకు పాలకపక్షం పన్నిన కుట్రగా దీన్ని అభివర్ణించారు.



ఆదాయం పెంచుతాం



ప్రతిపక్షాలది పసలేని వాదనగా మేయర్ కొట్టిపారేశారు. రాజధానిగా నగరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్ల  నిర్మాణం జరుగుతాయన్నారు. తద్వారా ఆస్తిపన్ను పెరుగుతుందన్నారు. నగరంలో చేపట్టిన సమగ్ర సర్వేలో లొసుగులు బయటపడుతున్నాయన్నారు. ఇప్పటివరకు 31,158 అసెస్‌మెంట్లను సర్వే చేస్తే 648 గృహాల వారు పన్ను చెల్లించడం లేదని, 7,699 మంది చెల్లించాల్సిన దానికంటే తక్కువ చెల్లిస్తున్నారని తేలిందన్నారు. వీటిన్నింటినీ సరిచేస్తే ఆదాయం ఎందుకు పెరగదన్నారు. గతంలో 27 వేల డీఅండ్‌వో ట్రేడ్ లెసైన్స్‌ల ద్వారా రూ.3.50 కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. తాను బాధ్యతలు చేపట్టాక 32,700 ట్రేడ్స్ నుంచి రూ.6 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ లెక్కల ప్రకారం నగరంలో 65 వేల ట్రేడ్స్ ఉన్నాయన్నారు. వీటన్నింటి నుంచి పన్నులు రాబట్టగలిగితే రూ.10 కోట్ల ఆదాయం కచ్చితంగా వస్తుందని చెప్పారు. సింగ్‌నగర్, జక్కంపూడి, వన్‌టౌన్ ప్రాంతాల్లో యూజీడీ కనెక్షన్ల ద్వారా ఆదాయాన్ని రాబడతామన్నారు. నగరంలో 31 వేల ఖాళీ స్థలాలు ఉండగా ప్రస్తుతం 12 వేల స్థలాల నుంచే పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.



ఎలా పెరిగాయో చెప్పండి!



సీపీఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మి మాట్లాడుతూ తాజా బడ్జెట్‌లో రూ.148 కోట్ల మేర ప్రజలపై భారాలు వేశారని ఆరోపించారు. దీనిపై మేయర్ ఆగ్రహించారు.  ఆ మేర పన్నులు ఎలా పడ్డాయో సభకు వివరించాలన్నారు. అనూహ్య పరిణామంతో సీపీఎం సభ్యురాలు కంగుతిన్నారు. కార్పొరేషన్‌లో మాట్లాడటం, ప్రెస్‌మీట్ పెట్టడం చాలా తేలిక, నోరుంది కదా అని ఆరోపణలు చేయొద్దంటూ మేయర్ ఎదురుదాడికి దిగారు.



రూ.600 కోట్లు తూచ్



సమగ్ర సర్వే ద్వారా రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని ఎలా ప్రకటించారో చెప్పాలని పుణ్యశీల నిలదీశారు. తాను ఎప్పుడూ అలా చెప్పలేదని మేయర్ సమాధానమిచ్చారు. అధికారులు మాత్రమే ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారన్నారు. సకాలంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంలో పాలకపక్షం విఫలమైందని, వాస్తవ విరుద్ధంగా ఉన్న బడ్జెట్‌ను తాము ఆమోదించడం లేదని పుణ్యశీల, ఆదిలక్ష్మి అన్నారు. టీడీపీ సభ్యుడు జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ.. ఇది ప్రజారంజక బడ్జెట్ అని అభివర్ణించారు. కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. క్యాపిటల్ బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. పాలకపక్షం సభ్యులు బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. కమిషనర్ జి.వీరపాండియన్, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ముప్పా వెంకటేశ్వరరావు, వీరమాచినేని లలిత, షేక్ బీజాన్‌బీ, కోఆప్షన్ సభ్యులు సిద్ధం నాగేంద్రరెడ్డి, సి.ఉషారాణి తదితరులు మాట్లాడారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top