‘మీకోసం’.. జనం కోసమేనా?


► ‘మీ కోసం’లో పెరిగిపోతున్న బాధితుల అర్జీలు

► పెద్ద సంఖ్యలో పరిష్కరించినట్లు అధికారిక లెక్కలు

► గణాంకాలతో సమస్యలను కప్పిపుచ్చుతున్న యంత్రాంగం


► నూతన కలెక్టర్‌ వినయ్‌చంద్‌పై ఆశలు పెట్టుకున్న ప్రజల


ఒంగోలు టౌన్‌: ‘ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలకు సంబంధించి గత రెండేళ్లలో 6,04,404 అర్జీలు వచ్చాయి. వాటిలో 5,71,007 అర్జీలు పరిష్కరించినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. కేవలం 33,397 అర్జీలను మాత్రమే పరిష్కరించాల్సి  ఉందని ఘనంగా ప్రకటించింది. మీకోసం అర్జీల పరిష్కారంలో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 8వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.


ఈ గణాంకాలు చూస్తే మీకోసం కార్యక్రమంలో అర్జీ ఇస్తే చాలు చిటికెలో పరిష్కారం అవుతుందన్న భ్రమను అమాయక ప్రజలకు జిల్లా యంత్రాంగం కల్పిస్తోంది.  అయితే జిల్లా యంత్రాంగం ప్రకటించిన గణాంకాలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఏ వారానికి ఆ వారం అర్జీలను పరిష్కరించినట్లు గణాంకాలను ఘనంగా ప్రకటించుకుంటుంటే ఒకే సమస్యపై బాధిత ప్రజలు పదేపదే సుదూర ప్రాంతాల నుంచి మీకోసం కార్యక్రమానికి ఎందుకు వస్తున్నారో జిల్లా అధికారులే సమాధానం చెప్పాలి.


ప్రస్తుతం జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోయి వడగాలులు వీస్తున్నాయి. ప్రజలకు వారి సమస్యల ముందు ఎండలు, వడగాలులు పెద్దగా ఇబ్బంది పెడుతున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే అంతకంటే ముఖ్యమైన తమ సమస్యలను జిల్లా అధికారులు పరిష్కరిస్తే అదే మాకు చల్లటి ఉపశమనం కలిగిస్తుందంటూ సుదూర ప్రాంతాల నుంచి మీకోసంకు అర్జీలు తీసుకొస్తూనే ఉన్నారు.


మీకోసం నుంచి సంబంధిత శాఖకు వెళితే పరిష్కారమైనట్లేనా?

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు మండల కార్యాలయల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి చివరకు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు చేరుకొని జిల్లా ఉన్నతాధికారులకు మొర పెట్టుకుంటుంటారు. వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని సంబంధిత శాఖకు పంపిస్తున్నట్లుగా చూపించి అర్జీదారునికి రసీదు అందిస్తారు. అంటే ప్రజల నుంచి వచ్చిన అర్జీని సంబంధిత శాఖకు పంపిస్తే పరిష్కారమైనట్లేనని జిల్లా యంత్రాంగం విచిత్రమైన ప్రకటన చేయడాన్ని అర్జీదారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.


ఎండలు, వడగాల్పులకు ఎదురెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు నివేదిస్తే.. వారు అర్జీని తీసుకొని రసీదు ఇవ్వడం, ఒకటి రెండు రోజుల తరువాత సమస్య పరిష్కరించినట్లు సంబంధిత వ్యక్తి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో ఆనందంతో ఆ కార్యాలయానికి వెళితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా సమస్య పరిష్కారం కాకుండా అర్జీ ఆ కార్యాలయంలో అలాగే కనిపిస్తుంటుంది.


తన సమస్యను పరిష్కరించలేదా అని బాధితుడు అడిగితే కలెక్టరేట్‌ నుంచి మాకు అర్జీ మాత్రమే వచ్చిందని సంబంధిత సిబ్బంది సమాధానం ఇవ్వడంతో అవాక్కవడం బాధితుడికి అలవాటుగా మారింది. అర్జీలను పరిష్కరించకుండానే సంబంధిత శాఖకు పంపిస్తే పరిష్కారమైనట్లుగా జిల్లా యంత్రాంగం అడ్డగోలుగా లెక్కలు చూపిస్తూ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


కొత్త కలెక్టర్‌పైనే కోటి ఆశలు:

జిల్లా కలెక్టర్‌గా వి.వినయ్‌చంద్‌ మూడు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తొలిసారిగా సోమవారం మీకోసం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయనపైనే బాధిత ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత కలెక్టర్‌ సుజాతశర్మ మీకోసం కార్యక్రమానికి మొక్కుబడిగానే హాజరయ్యారు. జిల్లాలో దాదాపు రెండేళ్లపాటు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ కొన్ని పర్యాయాలు వారాల తరబడి మీకోసం వైపు కన్నెత్తి కూడా చూడలేదు.


పైగా ప్రజలు తమ సమస్యలను సుజాతశర్మకు విన్నవించుకున్నప్పటికీ తెలుగు భాషపై ఆమెకు పూర్తి స్థాయిలో పట్టులేకపోవడంతో కొన్నిసార్లు బాధితుల ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోయేది. ఈ నేపథ్యంలో నూతన కలెక్టర్‌గా వినయ్‌చంద్‌ బాధ్యతలు స్వీకరించడం, ఆయనకు క్షేత్ర స్థాయిలో ప్రజల సాధక బాధకాలు తెలియడంతోపాటు భాష సమస్య లేకపోవడంతో మీకోసంలో అర్జీలకు త్వరితగతిన పరిష్కారం దక్కుతుందని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top