బతుకు తెల్లారిపోయింది..


- మిస్‌ఫైర్ అయిన రైల్వే పిస్తోలు

- ఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి

- మరో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు

డాబాగార్డెన్స్: వేకువజామునే లేచాడు. ఉదయం 4.30 గంటలకే డ్యూటీకి బయలుదేరుతుంటే.. ‘తెల్లవారేక వెళ్లొచ్చు కదా’ అంటూ భార్య వారించింది. ‘ఢిల్లీ నుంచి రైల్వే బోర్డు  సభ్యుడొచ్చారు. ఆయనతో అరకు స్పెషల్ డ్యూటీకెళ్లాలంటూ..’ చకచకా వెళ్లిపోయాడు. కాసేపటికే పిడుగులాంటి వార్త. భర్త చనిపోయాడని తెలుసుకొని ఆ ఇల్లాలు సొమ్మసిల్లిపోయింది. ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ముసలయ్య ఇంట్లో నెలకొన్న విషాదమిది. కన్నీరుమున్నీరవుతున్న ఆయన భార్య కృష్ణవేణిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. నగరంలో జరుగుతున్న డీజిల్ లోకో షెడ్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన రైల్వే బోర్డు సభ్యుడు హేమంత్‌కుమార్‌కు ఎస్కార్ట్‌గా ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన రక్షక దళంలో ముసలయ్య ఉన్నారు.



ఎస్కార్ట్‌గా వెళ్లే వారి వద్ద పిస్తోలు ఉండాలనే ఆదేశంతో డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వెనుక భాగాన ఉన్న ఆయుధలు భద్రపరిచే గదికి ఎనిమిది మంది రక్షక దళం వెళ్లారు. కానిస్టేబుల్ కె.సి.ప్రధాని 9 ఎమ్‌ఎమ్ పిస్తోలును చెక్ చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది. పక్కనే ఉన్న హెడ్ కానిస్టేబుల్ ధర్మాన ముసలయ్య (48) ఛాతి కింద భాగాన కుడి వైపున బుల్లెట్ దిగబడి ఎడమ వైపుకు దూసుకుపోయి పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ ఎస్.మల్లికార్జునరావుకు కూడా ఛాతి వెనుక భాగాన దిగబడింది. ఈ దుర్ఘటన మిగతా ఆర్పీఎఫ్ సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హుటాహుటిన పక్కనే ఉన్న రైల్వే ఆస్పత్రికి తరలిస్తుండగా హెచ్‌సీ ముసలయ్య మృతి చెందారు.



తీవ్రంగా గాయపడిన మల్లికార్జునరావు సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారు. ఇంటి నుంచి బయలుదేరిన భర్త ఇలా విగత జీవిగా తిరిగివస్తారనుకోలేదని ముసలయ్య భార్య కృష్ణవేణి రోదనను చూసిన వారందరూ కంటతడిపెట్టారు. సమాచారం తెలుసుకున్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎదురుగా ఉన్న గోర్ఖాలేన్‌లో నివాసం ఉంటున్న ముసలయ్య బంధువులు, సన్నిహితులు రైల్వే ఆస్పత్రికి చేరుకున్నారు.  రైల్వే పోలీసులు, టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముసలయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు రాకేష్ బీటెక్ పూర్తి చేసి ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు రాజేష్ రూర్కెలాలో ఎన్‌ఐటీ చదువుతున్నాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top