సెంటిమెంట్ ఏమైంది?

సెంటిమెంట్ ఏమైంది? - Sakshi


నేలపాడు నుంచి తుళ్లూరుకు మారిన ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం

రాహుకాలం పేరుతో ఇంటి నుంచి బయటికి రాని సీఎం

మూడు గంటల ఆలస్యంగా సాగిన ముఖ్య ఘట్టాలు

►  సెల్ మెసేజ్‌లు.. పత్రాల్లో రైతులకు ప్లాట్లు

కేటాయించిన వాటి అభివృద్ధి ఎప్పుడో!


 

 

సాక్షి, అమరావతి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలు శనివారం అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి చంద్రబాబు నాయుడు ప్రతి కార్యక్రమాన్ని ముహూర్తాలు, వాస్తులు చూసి ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. వాస్తు రీత్యా రాజధాని నిర్మాణాన్ని నైరుతి నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తుళ్లూరు మండలం నేలపాడు గ్రామం నుంచి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భూముల సమీకరణ, మొదటి కౌలు, పింఛను ఇలా అన్నీ నేలపాడు రైతుల నుంచే ప్రారంభించినట్లు సీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు. అన్ని ముఖ్యమైన కార్యక్రమాలను నేలపాడు నుంచి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ గ్రామ రైతులకు ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని మాత్రం తుళ్లూరులో నిర్వహించారు.



బహిరంగ సమావేశంలో నేలపాడు సెంటిమెంట్‌ను ప్రస్తావించే సమయంలో కార్యక్రమానికి హాజరైన స్థానికులు కొందరు ఇదే విషయం ప్రస్తావించటం కనిపించింది. అతి ముఖ్యమైన ఘట్టాలను ప్రారంభించే సమయంలోనూ సాధారణంగా మంచి ముహూర్తం చూస్తారు. అమరావతి సీడ్ క్యాపిట ల్ రహదారి, అన్న క్యాంటీన్, రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించారు.





 రాహుకాలంతో మారిన ముహూర్తాలు

 రాజధాని ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమంలో మొట్టమొదటిది సీడ్ క్యాపిటల్ రహదారి శంకుస్థాపన. శనివారం ఉదయం 7.41 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రాహుకాలం తరువాత రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించారు. శుక్రవారం రాత్రి వర్షం కురవటంతో రహదారి శంకుస్థాపన చేసే ప్రాంతం బురదమయంగా మారింది. దీంతో శనివారం ఉదయానికి కార్యక్రమాన్ని మార్చినట్లు అందరికీ మెసేజ్‌లు పంపా రు. అందులో సమయం మాత్రం ప్రస్తావించలేదు. అధికార యంత్రాంగం, మీడియా, స్థానికులు ఉదయం 7.30 గంటలకే వెంకటపాలెం వద్ద రహదారి శంకుస్థాపన చేసే ప్రాంతానికి చేరుకున్నారు. వెలగపూడిలో అన్న క్యాంటీన్ ప్రాంతానికి, తుళ్లూరుకు నేలపాడు గ్రామస్తులు ముందుగా నిర్ణయించిన సమయానికి చేరుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు రాహుకాలం తరువాత నివాసం నుంచి బయటకు వచ్చారు.



వెంకటపాలెం వద్ద రహదారి శంకుస్థాపన ప్రాంతానికి 10.45కి చేరుకున్నారు. అక్కడి నుంచి వెలగపూడిలో అన్న క్యాంటీన్, ఆ తరువాత సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తుళ్లూరుకు చేరుకున్నారు. మిట్ట మధ్యాహ్నం రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించారు. అనుకున్న సమయం కంటే సుమారు మూడు గంటలు ఆలస్యంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.





 ప్లాట్ల అభివృద్ధి ఎప్పుడో?

 ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. మార్చిలో చూపించాల్సిన ప్లాట్లు నేటికీ చూపలేదు. కేవలం ధ్రువీకరణ పత్రాలు, సెల్ మెసేజ్‌లు పెట్టి ‘అవే మీ ప్లాట్లు’ అని చెప్పారు. 871 మంది రైతులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం 847 మందికి 331.81 ఎకరాల్లో 1092 ప్లాట్లు రెసిడెన్షియల్, 649 కమర్షియల్ ప్లాట్లు చూపించారు. వాటిని మూడు వారాల తరువాత పరిశీలించి మూడు నెలల్లో అభివృద్ధి పను లు చేపడతామని అధికారులు, సీఎం ప్రకటించారు. ప్లాట్ల కేటాయింపునకే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వ చ్చారు. ఇప్పటి వరకు భూమి చదును కార్యక్రమమే పూ ర్తికాలేదు. కేటాయించిన భూముల్లో మొక్కలు తొలగించి, చదును చేయాల్సిఉంది. ఆపై లేఅవుట్లు వేసి రోడ్లను అభివృద్ధి చేసి రైతులకు ప్లాట్లు చూపించాలి. ఇవి ఎప్పటికి పూర్తిచేస్తారని రైతులు అధికారులను అడగటం కనిపించింది.





 పేపర్లపైనే ప్లాట్లు..

తుళ్ళూరు : తమ భూములు తీసుకుని.. కంప్యూటర్ల ద్వారా లాటరీలు తీసి, ఎలాంటి అభివృద్ధి చేయకుండా పేపర్లపై ప్లాట్లు కేటాయిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. తుళ్లూరులో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు. రైతులు భూములు ఇవ్వక ముందు ఐదు రకాలుగా అభివృద్ధి చేశాకే ప్లాట్లు ఇస్తామని, దీనివల్ల రైతులకు మంచి ధరలు వస్తాయని సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. తమ పాట్లకు ధర రావాలంటే ముందుగా ప్రభుత్వం చెప్పినట్లు రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top