సబ్‌జైలు నుంచి ఖైదీ పరారీ


గోప్యంగా ఉంచిన అధికారులు

 ఏడాదిగా శిక్ష అనుభవిస్తున్న ఒడిశా యువకుడు

 సబ్‌జైలును పరిశీలించిన  జైళ్ల శాఖ డీఐజీ

 బొబ్బిలి:
  బొబ్బిలి సబ్‌జైలు నుంచి ఓ ఖైదీ పరారైన వార్త సంచలనం కలిగిస్తోంది. ఒడిశా రాష్ట్రం లోని జైపూర్‌కు చెందిన ధనురాన అలియాస్ బడాపెట్టు (ఖైదీ నంబర్ 2576) అనే 25 ఏళ్ల యువకుడు సబ్ జైలు నుంచి గోడ దూకి పరారయ్యాడు. ఈ సంఘటన ఈ నెల 24వ తేదీన జరిగినా విషయం బయటపడకుండా ఆ శాఖ అధికారులు జాగ్రత్త పడ్డారు. రామభద్రపురం వద్ద గత ఏడాది జూలై 16 జరిగిన లారీ దోపీడీ కేసులో యువకుడు ధనురాస ఎ2గా శిక్ష  అనుభవిస్తున్నాడు. గోడ గ్రిల్‌పై ఉండే వైర్లను తొలగించి అక్కడ నుంచి పరారైనట్లు భావిస్తున్నారు. వెంటనే జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది గుర్తించి వెతుకులాట ప్రారంభించినా ఫలితం లేకపోవడంతో అదే రోజు రాత్రి బొ బ్బిలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

  దీంతో పరారైన ఖైదీ గురించి   సీఐ రవి ఆధ్వర్యంలో వేట మొదలు పెట్టారు. రెండు రోజులుగా ఖైదీని పట్టుకోవడానికి ఎస్సై, ఏఎస్సైలతో కూడిన బృందం గాలిస్తోంది.  విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ చంద్రశేఖరరావు, జిల్లా జైళ్ల అధికారి కిశోర్‌కుమార్‌లు గురువారం  వచ్చి పరిశీలించారు. పరారైన ఖైదీతో పాటు జైలు లోపల 16 మంది నిందితులున్నారు. దీనిపై జిల్లా జైళ్ల అధికారి కిశోర్ కుమార్‌ను ప్రశ్నించగా ఖైదీ పరారవడం వాస్తవమేనని, గాలిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై పట్టణ సీఐ రవిని వివరణ కోరగా జైళ్ల శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

 

  పరారైన ఖైదీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, 24 గంటల్లో పట్టుకుంటామని చెప్పారు.  కాగా ఖైదీ పరారైన సంఘటనలో హెడ్ వార్డర్ సింహబలుడు, వార్డర్ గాంధీ నాయుడులను బాధ్యులను చేస్తూ జైళ్ల శాఖ డీఐజీ వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top