మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దు

మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దు


మహానంది: మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దని రైతులకు కర్నూలుకు చెందిన డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.సరళమ్మ, నంద్యాల ఏడీఏ చెన్నయ్య సూచించారు. వరిలో తెగుళ్లను పరిశీలించేందుకు వారు సోమవారం మహానంది మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. వరిలో ప్రస్తుతం అగ్గి, ఆకుముడత తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఆకులపై నూలు కండె ఆకారపులో గోధుమ రంగులో మచ్చలు వస్తాయన్నారు.



కనుపులు నల్లగా మారుతాయని చెప్పారు. వీటిలో మూడు దశలు ఉంటాయని చెప్పారు. ఇలాంటి తెగుళ్లను మెడవిరుపు తెగుళ్లు అనుకుని మందులు చల్లుతారని, ఇది ఏ మాత్రం మంచిది కాదన్నారు. అగ్గి తెగులు కనిపిస్తే బావిస్టిన్ మందును లీటరు నీటికి ఒక గ్రాము, సిక్సర్ మందును లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున వాడాలన్నారు. ప్రస్తుతం రైతులు ఎక్కువగా 20-20-13 వేస్తున్నారని, కాని 20-20-0 మందును వాడాలని సూచించారు.



వరి దుబ్బుల వద్ద మచ్చలు బూడిద రంగులో కనిపిస్తున్నాయని.. నివారణకు ఎక్సాకొనజోల్ 2 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటికి కల్పి వాడాలన్నారు.  పొలంలో నీళ్లు లేకుండా పైరు అడుగుభాగం తగిలేలా స్ప్రే చేయాలన్నారు. ప్రస్తుతం సల్ఫైడ్ విష ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని.. అలాంటప్పుడు పొలాన్ని ఆరబెట్టాలని తెలిపారు. సల్ఫర్ ఉన్న ఎరువులు అసలు వాడరాదనిసూచించారు.  దీని ద్వారా విష ప్రభావం అధికంగా వస్తూ వేర్లు నల్లగా మారిపోతాయన్నారు. ఆకులపై కూడా మచ్చలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. యూరియా, పొటాష్ ఎరువులు వాడవచ్చన్నారు.



పొటాష్ వాడటం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. చిరుపొట్ట దశలో ఎకరా పైరుకు ఒక బస్తా పొటాష్ వేయాలని సూచించారు. వారి వెంట ఆర్‌ఏఆర్‌ఎస్ కీటక విభాగపు శాస్త్రవేత్త ఎన్,కామాక్షి, మహానంది ఏఓ కల్యాణ్‌కుమార్, ఏఈఓ బాల లింగమయ్య ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top