మోసగాళ్లు బాబోయ్..!

మోసగాళ్లు బాబోయ్..!


కోట్లు వస్తాయని ఒకరు..

లంకెబిందెలు దొరుకుతాయని మరొకరు  

ఆశపడితే అంతే సంగతులు..

జిల్లాలో కొనసాగుతున్న మోసాలు


 

గోరంత దీపం.. చీకట్లను పారదోలుతుంది. చిగురంత ఆశ మనిషి జీవితాన్ని నడిపిస్తుంది. అయితే ఆ ఆశ దురాశగా మారితేనే కష్టాలు మొదలవుతాయి. కష్టపడకుండా జల్సాలకు డబ్బులు వస్తాయంటే కొంత మంది వెనుకాముందు ఆలోచించకుండా ముందుకు దూకుతున్నారు. ఇలాంటి వారిని ఆసరాగా చేసుకునే మోసాలు కొనసాగుతున్నాయి. పట్టణాల్లోనే కాదు.. చిన్నచిన్న గ్రామాలకు కూడా ఈ వ్యవహారాలు పాకడంతో మోసాలకు బలవుతున్న వారి సంఖ్య  రోజురోజుకు పెరుగుతోంది.

 

గుంటూరు ఈస్ట్/ చిలకలూరిపేట :   సమాజంలో నేరాలు, మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మనుషుల్లోని బలహీనతలను సొమ్ము చేసుకోవాలనే కేటుగాళ్లు  పెరిగిపోయారు. ఆశ మంచిదేకానీ.. అత్యాశకు పోయి మోసగాళ్ల చేతుల్లో పడి ఉన్న ఆస్తులు పోగొట్టుకోవద్దని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధ్యాత్మిక రంగం నుంచి రియల్ ఎస్టేట్ తదితర రంగాలతో పాటు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యువతను నిలువునా ముంచుతున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి మోసపోయినవారు క్యూ కడుతున్నారు. ఇటీవల గుంటూరుకు చెందిన రాజస్థాన్‌లో పనిచేస్తున్న ఓ సైనికుడు పరిచయస్తుడిని నమ్మి సైనికుల కోటాలో స్థలం ఇప్పించమని రూ.5 లక్షలు సమర్పించాడు. చివరకు ఆ కేటుగాడు ఇదే విధంగా గతంలో ఎందరినో మోసం చేశాడని తెలిసి, బాధితుడు అర్బన్ ఎస్పీని ఆశ్రయించారు. బంగారానికి మెరుగు పెడతామని ఇళ్ల వెంట వచ్చి తమ వద్ద దొంగ బంగారం తక్కువ ధరకే వస్తుందని మోసం చేసే సంఘటనలు నగరంలో పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇటీవల కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వ్యక్తి కొందరికి ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడు.



ఆధ్యాత్మిక రంగంలో..

టీవీల్లో ప్రచారాలు.. వారి ఏజెంట్ల మాటలు నమ్మి.. కష్టాల్లో నుంచి బయట పడాలనే ఆశతో రూ.వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న యంత్రాలు, పూజా సామగ్రి చేతికందిన తరువాత బోగస్ అని తెలుసుకుని బావురుమంటున్నారు. దైవ ప్రతినిధులమని చెప్పేవారి వద్దకు వెళ్లి నగల నుంచి ఇళ్ల స్థలాలు కూడా సమర్పించి చివరకు పచ్చి మోసమని ఎస్పీ కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. మొదట జాతకం తెలుసుకుందామని వెళ్లి అనంతరం వాళ్ల ఉచ్చులో పడి రూ.లక్షలు వదిలించుకుంటున్న వాళ్లు కోకొల్లలు.

 

లంకె బిందెల కోసం పూజలు..

 చిలకలూరిపేటకు చెందిన నలుగురు యువకులు లంకె బిందెలు, గుప్తనిధుల మోజులో పడి గత ఏడాది పల్నాడుప్రాంతంలోని ఓ గ్రామంలో పాత ఇంట్లో తవ్వకాలు కొనసాగిస్తుంటే గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గతంలో గుప్త నిధులు, పూజల పేరుతో డబ్బు పోగొట్టుకున్న వారే ఇదే మార్గంలో మరికొంత మందిని మోసగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలడం విస్మయం కలిగించే అంశం.

 

రియల్ ఎస్టేట్..

రియల్ ఎస్టేట్ మోసాలకు అంతే లేకుండాపోయింది. కొరిటెపాడు రామన్నపేటలో ఇంటి యజమాని అమెరికాలో ఉంటూ నమ్మకస్తుడికి ఇంటి బాధ్యతలు అప్పగిస్తే అతను ఆ ఇల్లు తనదేనని నమ్మించి ఇంకొకరికి అమ్మేశాడు. ఇప్పుడు కొన్నవారు.. అసలు యజమాని కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.

 

మహా మోసగాళ్లు తిరుగుతున్నారు

ఒకరి వద్ద బ్లాక్ మనీ ఉంది వైట్ చేసి పెట్టాలి ఎవరైనా ఉన్నారా అంటూ కొందరు.. అద్భుతాలు సృష్టించే ఫలానా మెటల్ ఉంది క్యాష్ చేసి పెడితే కోటి రూపాయలు అని తిరిగే మోసగాళ్లు ఎక్కువయ్యారు. వీరంతా ఖద్దరు చొక్కాలు వేసుకుని ఏదో ఒక ప్రజాప్రతినిధి కార్యాలయం చుట్టూ బిజీబిజీగా తిరుగుతుండటంతో అత్యాసకుపోయే వారు వీరి వలలో పడుతున్నారు.

 

చేతులెత్తేస్తున్న పోలీసులు..

పోలీసు ఉన్నతాధికారులు బాధితుల ఫిర్యాదులు తీసుకుని సంబంధిత స్టేషన్ సిబ్బందికి తగిన ఆదేశాలిస్తున్నారు. చివరకు వెయ్యి ఫిర్యాదుల్లో పది మందికే న్యాయం జరుగుతోంది. విచారణ అనంతరం సివిల్ మ్యాటర్ మేమేమీ చేయలేమనో, ఆధారాలు ఏమీలేవనో పోలీసులు చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా సగటు జీవి అత్యాశకు పోకుండా జాగ్రత్తతో వ్యవహరిస్తేనే మనఃశాంతితో జీవిస్తారని నిపుణులు సలహా ఇస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top