రాజకీయాలకు అతీతంగా రాజధాని ఉద్యమం

రాజకీయాలకు అతీతంగా రాజధాని ఉద్యమం


కర్నూలు(అర్బన్): కర్నూలును రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా నేతలు కలసిరావాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజధాని కోసం స్థానిక శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌లో చేపట్టిన 72 గంటల దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని అంశంపై మాట్లాడేందుకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదన్నారు.

 

గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని సాధ్యం కాదని శివరామకృష్ణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసినా.. చంద్రబాబు అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక కన్వీనర్ టి.శేషఫణి మాట్లాడుతూ రాజధాని సాధనకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ మాట్లాడుతూ కర్నూలును రాజధానిగా ప్రకటించకపోతే చంద్రబాబును కర్నూలులో తిరగనివ్వబోమన్నారు.

 

బలమైన విద్యార్థి ఉద్యమాలను చేపడతామన్నారు. విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణ, రాయలసీమ నిర్మాణ సమితి అధ్యక్షుడు జనార్దన్, ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కె.బలరాం తదితరులు ఉద్యమకారులకు సంఘాభావం తెలిపారు. దీక్షలో రాయలసీమ ప్రజా సమితి అధ్యక్షుడు కందనూలు క్రిష్ణయ్య, పీడీఎస్‌యూ నాయకులు ఈ.శ్రీనివాసులుగౌడ్, రైతు కూలీ సంఘం నాయకులు బి.సుంకన్న, టీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.చంద్రప్ప, నాయకులు మధు, సురేష్‌చౌదరి, పి.వెంకటేష్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా సామూహిక నిరాహార దీక్షలను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు భగ్నం చేశారు. దీక్షలోని ఉద్యమకారులను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top