ఉద్యోగుల కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలి


నగరంపాలెం(గుంటూరు) :  రాష్ట్రంలో ఉద్యోగులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరుచూరి ఆశోక్ బాబు డిమాండ్ చేశారు. గుంటూరులోని ఏపీఎన్‌జీఓ కల్యాణమండపంలో శుక్రవారం జరిగిన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్లు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.జనవరి 2015 నాటికి ఎరియర్స్ ఉన్న 3.1144 శాతం డీఏ ను వెంటనే చెల్లించాలన్నారు. గ్రాట్యుటీ, అర్ధసెలవు క్యాష్‌మెంట్‌ను వెంటనే అమలు చేయాలన్నారు.



పెన్షనర్స్‌కు 10 సంత్సరాల అదనపు పెన్షన్ చెల్లించాలన్నారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర జేఏసీ జనరల్ సెక్రటరీ ఐవీరావు మాట్లాడుతూ  దేశంలోకి విదేశీ  పెట్టుబడులు ఆహ్వానించే కారణంతో కార్మిక చట్టాలను సవరణ చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. సమావేశంలో పాల్గొన్న పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆధ్యక్షుడు సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం అమలు చేస్తున్న కాంట్రిబ్యూషన్ విధానాన్ని రద్దుచేసి, పాత పద్ధతిలో పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు.



కార్యక్రమంలో ఏపీఎన్‌జీవో సంఘ ఉపాధ్యక్షుడు బాసిత్, గుంటూరు జిల్లా జేఏసీ కార్యదర్శి దయానందరాజు, ఒంగోలు జేఏసీ చైర్మన్ బండి శ్రీను, నెల్లూరు జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్, సెక్రటరీ రమణారెడ్డి, కృష్ణాజిల్లా జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, మహిళల విభాగం కన్వీనర్ రోజ్‌రాణి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్స్ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top