నేరగాళ్లకు అడ్డాగా లాడ్జీలు..!

నేరగాళ్లకు అడ్డాగా లాడ్జీలు..! - Sakshi


కర్నూలు: నగరంలోని కొన్ని లాడ్జిలు నేరగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఏబీఆర్ పార్కు సంఘటన కేసులో నిందితుడు ఓబులేసును కర్నూలులోని మధుర లాడ్జిలో అరెస్టు చేయడం స్థానికంగా అందరినీ ఉలికిపాటుకు గురి చేసింది. కర్నూలు నగరంలో వందకు పైగా లాడ్జిలు, డార్మెంటరీలు ఉన్నాయి.



వాటిపై పోలీసు నిఘా కొరవడటం వల్లే నేరగాళ్లు పాగా వేస్తున్నారు. పేరు, అడ్రస్, సెల్ నంబర్ మాత్రమే రిజిష్టర్‌లో నమోదు చేసుకుని గదులు అద్దెకు ఇస్తున్నారు. దీంతో తప్పుడు చిరునామాలతో లాడ్జిల్లో గదులు తీసుకుని నేరగాళ్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కాల్పుల సంఘటనలో నిందితుడైన ఓబులేసు.. సుబ్బారెడ్డి, వాణిజ్యనగర్, నంద్యాల చిరునామాతో గదిని తీసుకున్నాడు.



అసాంఘిక కార్యకలాపాలు..

నగరంలోని కొన్ని లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నకిలీ నోట్లు, బంగారం అక్రమ రవాణా, నకిలీ మద్యం వ్యాపారం, ఎర్ర చందనం స్మగ్లింగ్ వంటి వ్యాపారులు కర్నూలులోని లాడ్జిలోని గదులను అద్దెకు తీసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కొత్తబస్టాండ్ సమీపంలోని డార్మెంటరీల్లో గతంలో గద్వాల ప్రాంతానికి చెందిన దొంగలను అరెస్టు చేసి పెద్ద ఎత్తున రికవరీ చేశారు.



తాజాగా కొత్తబస్టాండ్‌లోని డార్మెంటరీల్లో గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక దొంగ తిష్ట వేసినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  హైదరాబాద్, బెంగుళూరు నగరాలను కలిపే మార్గంలో కర్నూలు ఉండటంతో కీలకంగా మారింది. నేరగాాళ్లు తమకు అనువుగా ఈ ప్రాంతాన్ని మార్చుకుంటూ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.



కనిపించని సీసీ కెమెరాలు..

కర్నూలు నగరంలో వందకు పైగా లాడ్జిలు, డార్మెంటరీలు ఉన్నాయి. అందులో సగం లాడ్జిల్లో కూడా సీసీ కెమెరాలు లేవు. నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేదా ఉన్నతాధికారి ఆదేశించినప్పుడు తప్ప సాధారణ సమయాల్లో నిఘా కొరవడటం వల్లే లాడ్జిలను నేరగాళ్లు అడ్డాలుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.



స్టార్ హోటల్ నుంచి సాధారణ లాడ్జి వరకు గదులను అద్దెకు తీసుకుని పేకాట కూడా జోరుగా సాగిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులకు లాడ్జిల యజమానులతో ఉన్న అవసరాల నేపథ్యంలోనే తనిఖీలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని లాడ్జిల్లో వ్యభిచారం, మట్కా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి.

 

 ప్రత్యేక నిఘా

 తాజా సంఘటన నేపథ్యంలో లాడ్జిలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్న దిశగా జిల్లా ఎస్పీ ఆకే రవిక్రిష్ణ చర్యలకు ఉపక్రమించారు. గుర్తింపు కార్డు ఉంటేనే గదులు అద్దెకు ఇవ్వాలని లాడ్జి యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు. నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురికి పైగా ఎస్‌ఐలు ఉన్నారు. పని విభజన చేసి లాడ్జిల తనిఖీల బాధ్యతలు ఒకరికి అప్పజెప్పే దిశగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ పరిధిలో ఎవరెవరు నిర్వహించాలనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో పోలీసు విధులు గందరగోళంగా మారాయి.



స్టేషన్ అవసరాలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సీఐల సూచనల మేరకు ఎస్‌ఐలు విధులు నిర్వహిస్తున్నారు. స్టేషన్ పరిధిలో జరిగే నేరాల ఆధారంగా పని విభజన చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాద్యతను అప్పజెప్పే విధంగా చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్ల సంఖ్యను బట్టి ఒకరికి బీట్ల తనిఖీ బాధ్యత, మరోకరికి పోలీస్ స్టేషన్ పరిపాలన బాధ్యత, రోజువారీ కోర్టు వ్యవహారాలు, పోలీస్ సిబ్బంది పాలనా వ్యవహారాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, లాడ్జిలు, వాహన తనిఖీలు ఇలా పని విభజన ద్వారా బాధ్యతలు అప్పగించి నేరాల నియంత్రణకు పోలీస్ బాస్ కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి తరహాలో క్రైమ్ కంట్రోల్‌కు ప్రత్యేకంగా ఎస్‌ఐతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి బాధ్యతాయుతమైన పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top