ఒత్తిడితో చిత్తు

ఒత్తిడితో చిత్తు


పని భారంతో రోగాలబారిన

పడుతున్న పోలీసులు

సెలవుల్లేక సతమతం

►  తాజాగా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం


 

 

పలమనేరు
: తీవ్రమైన పని ఒత్తిడితో పోలీసు విభాగంలోని కిందిస్థాయి సిబ్బంది చిత్తవుతున్నారు. బాస్‌లకు మస్కా కొట్టే సిబ్బంది మాత్రం జల్సాగా ఉంటుంటే చిత్తశుద్ధితో పనిచేసేవారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. తగినన్ని సెలవులు లేకపోవడం, అత్యవసర విధుల కు హాజరవుతుండడంతో సమయానికి తిండిలేక, తగిన విశ్రాంతి లేక రోగాల బారినపడుతున్నారు. ఇక మహిళా కానిస్టేబుళ్ల పరిస్థితి మరో ఘోరంగా తయారైంది. ఉదయం రెండు గంటల వ్యవధి మాత్రమే ఉండడంతో ఇంట్లో వంట కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.



విపరీతమైన టెన్షన్, ఉన్నతాధికారుల టార్గెట్లు, వేధింపులతో కొందరు సిబ్బంది ఉద్యోగం పైనే విరక్తి చెందుతున్నారు. విధి లేని పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదులుకోలేక, తమ కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక లోలోన మదనపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కుప్పం పోలీస్ స్టేషన్‌కు చెందిన రెడ్డెప్ప అనే కానిస్టేబుల్ సోమవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు.





 అమలుకు నోచుకోని వీక్లీ ఆఫ్

 గతంలో పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చేలా పోలీస్ ఉన్నతాధికారులు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పోలీస్ మ్యానువల్ ప్రకారం సంవత్సరానికి 15 లీవులు మాత్రమే వీరికి ఉన్నాయి. ఇక ఆప్షనల్ హాలిడేస్‌గా పదింటిని వాడుకునే వెసులుబాటుంది. ఒకవేళ మెడికల్ లీవ్ పెడితే జీతంలో కోత విధిస్తారు. ఈఎల్ (ఎర్నింగ్ లీవ్) పెట్టినా డబ్బులు చేతికందని పరిస్థితి. దానికితోడు సిబ్బంది పరిస్థితిని బట్టే సెలవులిచ్చే అవకాశం ఉంది.  తమకు కావాల్సిన వారికి మాత్రం సెలవులు ఇవ్వడం.. మిగిలిన వారికి కుదరదని చెప్పడం పోలీస్ శాఖలో షరా మామూలేనని ఓ సీనియర్ హెడ్‌కానిస్టేబుల్ ఆవేదన.





 40 శాతం మందికి జబ్బులే

 మొత్తం పోలీసులు 40 శాతం మంది సిబ్బంది షుగర్, బీపీ, అల్సర్‌తో బాధపడుతున్నారు. వీరికి సకాలంలో ఆహారం లేకపోవడం, తగిన విశ్రాంతి లేకపోవడం, మానసిక ఒత్తిడి జబ్బులకు కారణమవుతోంది. కనీసం పోలీస్ స్టేషన్ల లో విశ్రాంతి తీసుకోవడానికి కూడా తగిన సదుపాయాలు లేవు. దీంతో స్టేషన్‌లోని చెక్కబల్లలు, వరండాల్లో పడుకోవాల్సిందే. ఇలాం టి ఇబ్బందుల మధ్య అత్యవసర విధులను ఎలా నిర్వహించాలో అర్థం గాని పరిస్థితి.



ఎన్నాళ్ల నుంచో డిమాండ్లున్నాయి

 పోలీస్ శాఖలో పనిచేసే వారికి వారాంతపు సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీంతోపాటు భార్య కాన్పు సమయంలో భర్తకు సెలవు ఇవ్వడం, కోరుకున్నపుడు సెలవులు, ఎనిమిది గంటల డ్యూటీ, పోలీస్ స్టేషన్‌లో తగిన సదుపాయాలతో విశ్రాంతి తదితర డిమాండ్లను వీరు కోరుతూనే ఉన్నారు. కానీ వీరి సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోకుండానే పోతున్నాయి. సమాజాన్ని రక్షించే పోలీసులకు తగిన సౌకర్యాలు, మానసిక ప్రశాంతత లేక ఒత్తిడితోనే విధులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top