ఉలిక్కిపడిన తిరువెంగళాపురం

ఉలిక్కిపడిన తిరువెంగళాపురం - Sakshi


* అరబిందో ఫార్మా నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటన

* నిందితుడి సొంతూరులో కలకలం


బద్వేలు: వైఎస్‌ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురం ఉలిక్కిపడింది. హైదరాబాద్ బంజారాహిల్స్ సమీపంలోని కేబీఆర్ పార్కు వద్ద బుధవారం ఉదయం అరబిందో ఫార్మా ఉపాధ్యక్షుడు నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన ఘటనలో నిందితుడుగా భావిస్తున్న  ఓబులేసు సొంతూరు తిరువెంగళాపురం కావటమే ఇందుకు కారణం.  ఘటనపై  ఉదయాన్నే న్యూస్‌ఛానళ్లలో రావడంతో తిరువెంగళాపురంతో పాటు మండలమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన పులి మైఖేల్ పోరుమామిళ్లలో చర్మాల వ్యాపారం చేస్తున్నాడు.



ఇతనికి ఓబులేసు పెద్దకుమారుడు. ఓబులేసు 1998లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికై కడపలో శిక్షణ పొంది అనంతపురంలో విధుల్లో చేరినట్లు తెలిసింది. ఇది జరిగి రెండేళ్లు పైనే అయింది. అనంతపురంలో చేరినప్పటి నుంచి స్వగ్రామానికి రాలేదు. ఏడాది కిందట ఒక ఎస్‌ఐ ఏకే 47 తస్కరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తుపాకితోనే నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోరుమామిళ్ల సీఐ వెంకటకుమార్, ఎస్‌ఐ కృష్ణంరాజు నాయక్ మైఖేల్‌ను అదుపులోకి తీసుకుని ఓబులేసు విషయాన్ని విచారించారు. నిందితుడు గ్రామానికి రాక రెండేళ్లుపైనే అయిందనే విషయాన్ని కూడా వారు నిర్ధారించుకున్నారు

 

చూస్తేగాని చెప్పలేను: మైఖేల్

తన కుమారుడితో రెండేళ్లుగా సంబంధాలు లేవని, తాను ఎక్కడ ఉంటున్నాడో కూడా పెద్దగా తెలియదని ఓబులేసు తండ్రి మైఖేల్ తెలిపారు. నిత్యానందరెడ్డిపై తన కుమారుడు కాల్పులు జరిపారని పేర్కొంటూ ఛానళ్లు మసక ఫొటోలతో ప్రచారం చేశాయని, కానీ ఆ ఫొటోలు తన కుమారుడు ఓబులేసువి కావన్నారు. తాను ప్రత్యక్షంగా చూస్తే తప్ప గుర్తించలేనని పేర్కొన్నారు. తనకు తెలిసి ఓబులేసు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడంటే నమ్మలేకున్నానని చెప్పారు.

 

మంచోడంటున్న బంధువులు

ఓబులేసు, అతని కుటుంబమంటే గ్రామంలో మంచి పేరుందని పలువురు బంధువులు తెలిపారు. ఒక వ్యక్తిపై కాల్పులు జరిపేంతటి నేరం చేశాడంటే నమ్మశక్యం కావడం లేదని పేర్కొన్నారు. వివాహం కూడా చేసుకోకుండా విధి నిర్వహణే ముఖ్యంగా భావించేవాడని, గ్రామానికి వచ్చిన పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పేవాడన్నారు. ఇదంతా ఒకడే చేసే అవకాశం లేదని, ఓబులేసుతో ఎవరైనా చేయించి ఉండొచ్చని కొందరు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.

 

పలు కార్డులు స్వాధీనం

నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన నిందితుడు ఓబులేసుది తిరువెంగళాపురమని ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడంతో విచారణ చేపట్టామని సీఐ వెంకటకుమార్, ఎస్‌ఐ కృష్ణంరాజు నాయక్ తెలిపారు. ఓబులేసు తండ్రి మైఖేల్, మిగిలిన కుటుంబ సభ్యులను విచారించామన్నారు. ఓబులేసుకు చెందిన కొన్ని ఫొటోలు, ఆధార్, ఓటర్‌కార్డుతో పాటు పాత గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలకోసం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top