అక్రమాల పంచాయితీ

అక్రమాల పంచాయితీ


దొడ్డిదారిన బదిలీలు, పదోన్నతులు

డీపీవో కార్యాలయ లీలలు

ప్రతి పనికీ ఓ రేటు సెలవులో ఉండి చక్రం తిప్పుతున్న సీనియర్ అసిస్టెంట్


 

మచిలీపట్నం : జిల్లా పంచాయతీ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అధికారులను ప్రసన్నం చేసుకుని అమ్యామ్యాలు సమర్పించుకుంటే కోరిన చోటుకు పోస్టింగ్ ఇస్తున్నారని  సమాచారం. ఇటీవలనే బాధ్యతలు స్వీకరించిన ఓ అధికారి తనదైన శైలిలో  వ్యవహరిస్తుండటం విమర్శలకు  తావిస్తోంది. అధిక ఆదాయం ఉండే పంచాయతీలకు బదిలీలు చేస్తామని చెప్పి పశ్చిమ       గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఓ నలుగురు పంచాయతీ కార్యదర్శుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసుకుని కలెక్టర్‌కు ఫైలును పంపినట్లు సమాచారం. ఈ నలుగురు కార్యదర్శులు జిల్లాలో పనిచేస్తూ   ఏసీబీకి చిక్కిన వారే. యనమలకుదురు, కొండపల్లి వంటి పంచాయతీల్లో వీరిని నియమించేందుకు ఫైలు సిద్ధం చేసినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శులు అతి తక్కువగా ఉన్న మండలాలను గుర్తించి అక్కడ పంచాయతీ కార్యదర్శులను నియమించాలని కలెక్టర్ పదే పదే చెబుతున్నా... వీటిని పక్కనపెట్టి ఈ నలుగురికి వారు కోరుకున్న పంచాయతీల్లో పోస్టింగ్‌లు ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగు              తున్నాయని తెలుస్తోంది.  



 పదోన్నతుల్లోనూ అక్రమాలే...



డీపీవో కార్యాలయంలో ఇద్దరు నైట్‌వాచ్‌మెన్లు పని    చేస్తున్నారు. వీరికి అటెండర్లుగా పదోన్నతి ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. మొవ్వలో పనిచేస్తున్న స్వీపరును డీపీవో కార్యాలయంలో నైట్‌వాచ్‌మెన్‌గా నియమించేందుకు ఫైలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.



సెలవులో ఉండి చక్రం తిప్పుతున్న ఉద్యోగి...



విజయవాడ డీఎల్‌పీవో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి ఓ టీడీపీఎమ్మెల్యే సిఫార్సులతో నిబంధనలకు విరుద్ధంగా విజయవాడ సమీపంలోని అధిక ఆదాయమున్న ఓ పంచాయతీకి కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.  బాధ్యతలు చేపట్టిన ఈ ఉద్యోగి కొంత కాలం పాటు తనదైన శైలిలో వసూళ్లకు పాల్పడడంతో ఆగ్రహించిన స్థానికులు ఈ ఉద్యోగిని ఏసీబీకి పట్టించేందుకు వ్యూహం రచించారు. విషయం తెలుసుకున్న ఈ ఉద్యోగి సెలవుపై వెళ్లిపోయారు. అక్కడితో ఆగకుండా మచిలీపట్నంలోని డీపీవో కార్యాలయానికి వచ్చి ఇక్కడ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నాడు. ఇటీవల జరిగిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు, పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించిన పదోన్నతుల విషయంలో తెరవెనుక ఉండి ఈ ఉద్యోగి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెలవులో ఉన్నప్పటికీ డీపీవో కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఈ ఉద్యోగి ఉన్నతాధికారి షాడో మాదిరిగా వ్యవహరిస్తున్నట్లు కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సెలవుపై ఉన్న ఉద్యోగిని ఏ నిబంధనల మేరకు డీపీవో కార్యాలయంలో పనిచేయించుకుంటున్నారో తెలియని పరిస్థితి నెలకొందని సిబ్బందే పేర్కొంటున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top