మృత్యు ద్వారాలు


సాక్షి ప్రతినిధి, అనంతపురం : గుండెల్ని పిండేసే విషాదం.. హృదయాలను ద్రవింపజేసే ఘోరం. స్కూల్‌కు వెళ్లొస్తానమ్మా.. అని వెళ్లిన గంటలోపే మృత్యుశకటంలా దూసుకొచ్చిన రైలు బస్సును ఢీకొని ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. గురువారం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో విద్యార్థులు మృత్యువాత పడడాన్ని టీవీల్లో చూసిన ‘అనంత’ ప్రజానీకం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయ్యో.. ఎంత ఘోరం జరిగింది అంటూ నిట్టూర్చారు.

 

 ఈ నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో కాపలా లేని లెవల్ క్రాసింగ్ (ఎల్‌సీ)లు 170 ఉండడం ఆందోళన కల్గిస్తోంది. విషాద ఘటనలు జరిగాక నాయకుల పరామర్శలు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న ప్రభుత్వ హామీలు.. మృతుల కుటుంబాలకు సానుభూతి.. అంతోఇంతో నష్టపరిహారం చెల్లింపుతో సరిపెడుతూ శాశ్వత పరిష్కారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైల్వేల్లో జరిగే ప్రమాదాల్లో అధిక శాతం ఇలా కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్దే చోటు చేసుకుంటున్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా రైల్వే శాఖ క్రాసింగ్‌ల వద్ద కాపలాదారులను ఏర్పాటు చేయడంతో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.  

 

 అటకెక్కిన అనిల్ కకోద్కర్ కమిటీ సిఫార్సులు

 రైల్వేల్లో భద్రతా ప్రమాణాల మెరుగు పరచడం కోసం కేంద్రం అనిల్ కకోద్కర్ నేతృత్వంలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీ 2012 ఫిబ్రవరిలో పలు సిఫారసులు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణ ఒక ప్రధాన అంశం. దేశం మొత్తంపైన 32,735 లెవల్ క్రాసింగ్‌లు ఉండగా ఇందులో 14,896 కాపలా లేనివే ఉండటం పట్ల కమిటీ ఆందోళన వెలిబుచ్చింది.

 

 రైలు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 65 శాతం మంది లెవల్ క్రాసింగ్‌ల వద్దే ప్రమాదానకి గురై మరణిస్తున్నారని లెక్కలు తేల్చింది. కాపలా ఉన్నవైనా, లేనివైనా అసలు లెవల్ క్రాసింగ్‌లే లేకుండా చేయాలని కమిటీ సిఫారసు చేసింది. రైల్వే లెవల్ క్రాసింగ్‌లు ఉన్న చోట ఓవర్ బ్రిడ్జిలు కానీ, అండర్ టన్నెల్ బ్రిడ్జిలు కానీ నిర్మించాలని స్పష్టం చేసింది. తక్కువ రోడ్డు ట్రాఫిక్ ఉన్న లెవల్ క్రాసింగ్‌లను మూసేసి, రైల్వే పట్టాల వెంబడి ఇరువైపులా కొత్త రోడ్డు వేసి, సమీపంలోని ఓవర్‌బ్రిడ్జ్‌కి కానీ అండర్ టన్నెల్‌కు కానీ అనుసంధానం చేయాలని కమిటీ సూచించింది. ఇలా చేయడానికి దాదాపు రూ.50 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

 

 దీని వల్ల ఏటా రైల్వే ప్రమాదాల్లో 65 శాతం మంది మృత్యువాత పడకుండా కాపాడటమే కాకుండా సగటున 5 నుంచి 10 శాతం రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని తగ్గించడం వీలవుతుందని కమిటీ పేర్కొంది. ఆ విధంగా రూ.50వేల కోట్ల ఖర్చును సంవత్సరానికి రూ.7వేల కోట్ల చొప్పున ఏడేళ్లలో రాబట్టుకోవచ్చని కమిటీ సూచించింది. అయితే ఈ సిఫారసులను రైల్వే శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు. లెవల్ క్రాసింగ్‌లన్నీ బ్రిడ్జిలుగా మార్చకపోయినా.. కనీసం కాపలా మనుషులను అయినా ఏర్పాటు చేస్తే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.   

 

 గుంతకల్లు రైల్వే డివిజన్‌లో

 170 కాపలా లేని ఎల్‌సీ గేట్లు

 గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో మొత్తం 170 కాపలాదారులు లేని (అన్‌మ్యాన్డ్) లెవెల్ క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. వీటిలో 60 గేట్ల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. రెండేళ్లలో చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు.  

 

  2013-14  మధ్య డివిజన్ పరిధిలోని ధర్మవరం-పాకాలా సెక్షన్‌లోని వాయల్పాడు-కలికిరి రైల్వేస్టేషన్ మధ్య ఉన్న యల్‌సి గేట్ 109 వద్ద ఇండికా కారును రైలు ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు.

 

  2012 ఫిబ్రవరిలో గూడూరు-రేణిగుంట సెక్షన్‌ల పరిధిలోని శ్రీకాళహస్తి-రాచగుణేరి మధ్యలోని ఎల్‌సి గేట్ నెం.31లో లోడ్‌తో నిలిచిపోయిన లారీని రైలు ఢీకొంది. ఈ సంఘటనలో డ్యూటీలో ఉన్న విజయవాడకి చెందిన లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్‌లు మరణించారు. లారీ డ్రైవర్, క్లీనర్‌లు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

 

  పదేళ్ళ క్రితం అనంతపురం జిల్లా డీ.హీరేహాళ్ మండలం హిర్దెహాళ్ వద్ద గవిసిద్దేశ్వరం వెళ్లే ఆర్టీసి బస్సును రైలు ఢీకొనడంతో 14 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.   

 

 60 ఎల్‌సి గేట్ల వద్ద సేప్టీ కౌన్సెలర్ల

 నియమాకానికి టెండర్లు

 ఆర్‌యూబిలు నిర్మాణానికి వందల కోట్లు వ్యయం చేయలేమని నిర్ధారించుకున్న రైల్వే శాఖ కంటి తుడుపు చర్యలు చేపట్టనుంది. ఎల్‌సి గేట్ల వద్ద రోడ్డు సేఫ్టీ కౌన్సెలర్ల నియామకానికి ఈ నెల 14న గుంతకల్లు డీఆర్‌యం కార్యాలయంలో రూ.48 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలాంటి చర్యలు కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్గించవచ్చేమో కానీ ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించలేవని రైల్వే వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.  

 

 రైల్వే శాఖ పూర్తి భాధ్యత వహించాలి

 మెదక్ జిల్లాలో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం. ఈ పాపం మొత్తం రైల్వే శాఖదే. ప్రమాదాలు జరిగినప్పుడు చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించ డం, విచారణ చేపట్టడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగిరావు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి.   

 - వై.వెంకటరామిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ

 

 గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త

 రైల్వే గేట్‌మెన్లను నియమించాలి

 రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద కాపలాదారులను నియమించి ప్రమాదాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిసారి రైల్వేబడ్జెట్‌లో అన్‌మ్యాన్డ్ ఎల్‌సి గేట్లను ఎత్తివేసి అక్కడ కాపలాదారులను నియమిస్తామని వచ్చిన మంత్రులల్లా గొప్పలు చెబుతున్నారే తప్ప ఆచరణలో పెట్టడం లేదు. డబ్బు కంటే ప్రజల భద్రతే ముఖ్యమని భావించి గేట్‌మన్‌లను నియమించాలి.

 - కళాధర్, రైల్వే మజ్దూర్ యూనియన్, డివిజన్ కార్యదర్శి, గుంతకల్లు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top