భవిష్యత్ బాధలు

భవిష్యత్ బాధలు


 జిల్లాలోని పంచాయతీ కార్మికులకు కష్టం వచ్చింది. రెండు సంవత్సరాలు అధికారులు పంచాయతీ పీఎఫ్(భవిష్య నిధి) లావాదేవీలు నిలిపివేశారు. దీంతో ఉద్యోగ భద్రతపై 1,202 మంది ఆందోళన చెందుతున్నారు. 2012 నుంచి పంచాయతీ అధికారులు కార్మికులతో 12 శాతం పీఎఫ్ వాటా కట్టించుకున్నారు. 1,202 మంది కార్మికులు రెండు సంవత్సరాలపాటు వాటా చెల్లించారు. 2014 నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. జీవో 505 ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను పంచాయతీల పరిధిలో కాకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. దీంతో కార్మికులు కోర్టును ఆశ్రయించారు. తిరిగి పంచాయతీ పరిధిలోనే కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ తరువాత పంచాయతీ అధికారులు కార్మికుల పీఎఫ్ లావాదేవీలను నిలిపివేశారు. కార్మికులు పీఎఫ్ వాటాను ఇచ్చే ప్రయత్నం చేసినా అధికారులు తీసుకోవడం లేదు.



రెండు సంవత్సరాలు పీఎఫ్ కట్టించుకుని ఇప్పుడు ఎందుకు   నిలిపివేస్తున్నారంటూ కార్మికులు అడిగినా అధికారులు సమాధానం చెప్పడం లేదు. ఈ సమస్యపై జిల్లా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదు. దీంతో  వారు ఆందోళన బాటపట్టేందుకు   సిద్ధమవుతున్నారు. జిల్లాలో 1,363 పంచాయతీలు ఉన్నాయి. 98 పంచాయతీల పరిధిలో 834 పారిశుధ్య కార్మికులు, 300 మంది పంపు ఆపరేటర్లు, 36 గురు ఎలక్ట్రీషియన్లు, 30 మంది డ్రైవర్లు మొత్తం 1202 మంది ఉన్నారు. వీరంతా 1984 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. 2012లో వచ్చిన జీవో నంబర్ 11 ప్రకారం వీరికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు స్కిల్డ్ లేబ ర్‌కు రూ.10,079, అన్‌స్కిల్డ్‌కు రూ.8,079, సెమీస్కిల్డ్ వారికి రూ.5,579 ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలోని 14 మేజర్ గ్రామపంచాయతీల పరిధిలో మాత్ర మే జీవో నంబర్ 11 అమలుచేస్తామని, 19 పంచాయతీల్లో రూ.5,050 ఇస్తామని మరికొన్ని పంచాయతీల్లో రూ4,600 ప్రకా రం జీతాలు చెల్లిస్తామని 2013లో జిల్లా పంచాయతీ అధికారులు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.



కరువు భత్యం ఇస్తామని చెప్పారు. ప్రధానంగా పీఎఫ్, ఈఎస్‌ఐ అమలుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ అవేవీ అమలుకు నోచుకోలేదు.

 పలుమార్లు కార్మికుల వినతి మేరకు పీఎఫ్ వాటా తీసుకునేలా అన్ని పంచాయతీలకు తిరిగి ఉత్తర్వులు ఇస్తామని ఇటీవల డీపీవో వారికి హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకూ ఆ హామీ అమలు కాలేదని గ్రామ పంచాయతీ కార్మిక యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి వెంకట్రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం పీఎఫ్‌తో పాటు ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీంతో పాటు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే పీలేరు, రేణిగుంట, బీ.కొత్తకోట పంచాయతీలు త్వరలోనే మున్సిపాలిటీలుగా మారే అవకాశం ఉన్నందున 175 మంది పంచాయతీ కార్మికులు వీధిన పడుతారేమోనని ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనకు దిగుతామన్నారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top