పుష్కర యాత్రికుల భద్రతపై దృష్టి

పుష్కర యాత్రికుల భద్రతపై దృష్టి - Sakshi


దుర్గకొండపై ఏర్పాట్లను పరిశీలించిన అధికారుల బృందం

మంగళవారం అభివృద్ధి పనులకు శ్రీకారం

వేగవంతంగా పూర్తిచేస్తామన్న ఈవో ఆజాద్


 

సాక్షి, విజయవాడ :  పుష్కర యాత్రికుల భద్రతే ప్రధాన ధ్యేయంగా ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. యాత్రికులు పుష్కర స్నానాలు చేశాక అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో వారికి ఇబ్బందులు లేకుండా ముందస్తు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారుల బృందం శుక్రవారం ఘాట్లు, దుర్గగుడిని పరిశీలించింది. ఈ బృందంలో కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, అదనపు పోలీసు కమిషనర్ మహేష్‌లడ్హా,  డీసీపీ అశోక్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్, సబ్‌కలెక్టర్ జి.సృజన, ఏసీపీ జి.రామకృష్ణ, దుర్గగుడి ఈవో చంద్రశేఖర్ ఆజాద్, ఈఈ కె.వి.ఎస్.ఆర్.కోటేశ్వరరరావు, డీఈ రమ, సి.ఐ. పి.వెంకటేశ్వరరావు ఉన్నారు. వీరంతా అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు.



15 రోజులూ భారీ భద్రత

ఇంద్రకీలాద్రిపై  భద్రతతో కూడిన అభివృద్ధి పనులు చేపడతామని కలెక్టర్ బాబు.ఎ, అదనపు పోలీసు కమిషనర్ మహేష్ లడ్హా తెలిపారు. 12 రోజులు పుష్కరాలు జరిగినప్పటికీ 15 రోజులు భక్తులు వస్తారని భావించి ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఇంద్రకీలాద్రిపై చేపట్టిన తొలగింపు పనుల టెండర్లు సోమవారం ఖరారుకానున్నాయి. మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో పనులు చేపట్టాలని ఈఈని కలెక్టర్  ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పుష్కరనగర్‌కు వస్తారని, అక్కడ్నుంచి స్నానఘట్టాలకు వెళ్లేందుకు వీలుగా వన్‌వేలో క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ నియంత్రణకు విశాలమైన క్యూలైన్లు నిర్మించాలన్నారు.



రెండు క్యూలైన్లను స్నానఘట్టాలకు అనుసంధానం చేస్తూ,. మరో రెండు క్యూలైన్లు అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేటాయించడానికి తగిన ప్రణాళికలతో ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. మహేష్ లడ్హా మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో ఎదుర్కొన్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అలాంటివి పునరావృతం కాకుండా క్యూలైన్లు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. మహామండపం, శివాలయం మార్గం ద్వారా, కొండపైకి ప్రధాన రహదారి మీదుగా వచ్చే వచ్చే భక్తుల క్యూలైన్ల ఏర్పాటు ప్రదేశాలు, మ్యాప్‌లు, ఇంద్రకీలాద్రి ఏరియల్ వ్యూలను పరిశీలించారు.



ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ మెట్లమార్గంలో భక్తులు పడే ఇబ్బందుల గురించి చర్చించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి నుంచి మహామండపానికి అనుసంధానం చేసే విస్తరణ పనులను వివరించారు. మొత్తం 44 కట్టడాలను తొలగించాల్సి ఉంటుందన్నారు. మంగళవారం పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తిచేస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top