ఆగ్రహ జ్వాల

ఆగ్రహ జ్వాల - Sakshi


 

 సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన ఎస్సీలు కులాన్ని అవమానించారంటూ మండిపాటుమైలవరంలో సీఎం దిష్టిబొమ్మ దహనం,పది మంది అరెస్ట్ బందరులో దళిత సంఘాల ధర్నాజిల్లాలో సీఎంపై నాలుగు ఫిర్యాదులు


 

 విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘కుల’ వ్యాఖ్యలపై ఎస్సీలు నిప్పులు చెరిగారు. కులాన్ని అవమానించేలా మాట్లాడటంపై మండిపడ్డారు. అందరినీ సమదృష్టితో చూడాల్సిన ముఖ్యమంత్రే అవమానకరంగా వ్యాఖ్యలు చేయటాన్ని నిరసిస్తూ బందరులో ధర్నా నిర్వహించారు. మైలవరంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. అవనిగడ్డలో ఇద్దరు, తిరువూరులో ఒకరు, విజయవాడ కృష్ణలంకలో మరొకరు సీఎంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీలను అవమానించినందున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాల్సిందిగా వారి ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.



 జిల్లాలో నాలుగు ఫిర్యాదులు...

ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మార్పీఎస్, ఎస్సీ నాయకులు జిల్లాలో నాలుగుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ  వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు నలకుర్తి రమేషన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మాలమహానాడు నాయకుడు డి.గోవర్థన్, ఎమ్మార్పీఎస్ నాయకుడు కె.రాజేశ్వరరావు కూడా ఫిర్యాదు అందజేశారు. వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మార్పీఎస్ నాయకుడు ఎం.గోపాల్, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో మాదిగ హక్కుల పోరాట సమితి నాయకుడు యు.రోజ్‌కుమార్ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పలుచోట్ల నిరసనలు బందరులో దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో దళి సంఘాల వారు సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ముందుగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ధర్నా చేశారు. పోలీసు చర్యలను కూడా ఈ సందర్భంగా వారు ఖండించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని అడ్డంపెట్టుకొని ఎస్సీలను అవమానించిన సీఎంపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తమపై పోలీసులు ప్రతాపం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.



 మైలవరంలో దిష్టిబొమ్మ దహనం

మైలవరంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవ్వరూ కోరుకోరంటే ఎస్సీ కులాన్ని ఎంతగా సీఎం కించపరిచారో అర్థమవుతుందని, అంటే ఆ కులంలో ఉన్న వారు పిల్లలను కనకుండా ఆపివేయాలని డెరైక్టుగానే సీఎం చెప్పారని వారు మండిపడ్డారు. ఇటువంటి విపరీత బుద్ధి సీఎంకు ఎందుకు వచ్చిందోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆందోళన చేపట్టిన 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.



 నేతల ఖండనలు...

 పెనమలూరు మండలంలోని కంకిపాడులో కలపాల వజ్రాలు, బాకీబాబు, జగ్గయ్యపేటలో ఎస్సీ నాయకులు, ఉయ్యూరులో ఎస్సీ నాయకులు ఎస్.సురేష్‌బాబు, దాసరి రవి తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు చర్యలను ఖండించారు. ఎక్కడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో వారు మాట్లాడారు. తదుపరి కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top