బడుగులపై అగ్గిపిడుగు

బడుగులపై అగ్గిపిడుగు - Sakshi


వాళ్లంతా పొట్ట చేతపట్టుకుని బతుకుబండి ఈడ్చుకుంటూ ఎక్కడెక్కడినుంచో వచ్చారు. నిత్యం మురుగుతో సహవాసం చేస్తూ చీకట్లోనే మగ్గిపోతుంటారు. ఉదయం కూలికి పోతే పొద్దుగూకాకే ఇల్లు చేరేది. రైలుబళ్ల రణగొణ ధ్వనులు, ముక్కుపుటాలదరగొట్టే దుర్వాసనలు అలసిసొలసిన   ఆ  ప్రాణాలకు అస్సలు తెలీవు. జీవితం సజావుగా సాగిపోతోందనుకుంటున్న తరుణంలో ఆ బడుగులపై ‘అగ్గి’ పిడుగు పడింది. కష్టపడి సంపాదించిన నగదు, వస్తువులు సర్వం భస్మీపటలం కావడంతో కట్టుబట్టలతో మిగిలారు. కళ్లముందే ఇళ్లు కాలి పోతుంటే  దిక్కెవరు దేవుడా అని గుండెలవిసేలా రోదించారు. విజయవాడ రాజీవ్‌గాంధీ పార్క్   సమీపంలో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది.   - విజయవాడ సెంట్రల్

 

బాధితులకు పునరావాసం కల్పిస్తాం - కలెక్టర్ బాబు.ఏ


విజయవాడ : నగరంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాద సంఘటనలో నష్టపోయినవారందరిని ఆదుకుంటామని కలెక్టర్ బాబు.ఏ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నుంచి సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టామన్నారు. సంఘటన జరిగిన వెంటనే తమ సిబ్బంది హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని తెలి పారు. ఈ ప్రమాదంలో గాయాలకు గురైన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించి వైద్యసహాయం అందించామన్నారు. అగ్ని ప్రమాద కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వారికి భోజన వసతి, తాగునీరు కల్పిస్తున్నామన్నారు. నష్టపోయిన కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన చెప్పారు. గతంలో ఇదే ప్రాంతంలో పలుమార్లు అగ్నిప్రమాదం జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు పునరావాసం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట విజయవాడ సబ్‌కలెక్టర్ డాక్టర్ జి.సృజన, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, అర్బన్ తహశీల్దార్, ఆర్.శివరావు తదితరులు ఉన్నారు.

 

ఫైరింజన్ల రాకలో జాప్యం!

విజయువాడ సిటీ: అగ్నిమాపక వాహనాల రాకలో జాప్యమే ఎక్కువ పూరిళ్లు దగ్ధం కావడానికి కారణమనే విమర్శలు వినబడుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు ప్రమాదం జరి గిన వెంటనే నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకొని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కంట్రోల్ రూమ్ అగ్నిమాపక శకటం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉంది. అజిత్‌సింగ్‌నగర్ అగ్నిమాపక యంత్రాన్ని రప్పించారు. దీని రాకలో జాప్యం జరిగిందని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఒకే వాహనం రావడంతో మంటలు ఆర్పడం సాధ్యం కాక మరో వాహనం రప్పించారు. కలెక్టర్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక వాహనాల కొరతను దృష్టిలో ఉంచుకొని సీఎం క్యాంపు కార్యాలయంలోని వాహనం కూడా రప్పించాలంటూ ఆదేశించారు. అప్పటికే భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిస్థితికి అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడమే కారణమని చెబుతున్నారు. జగ్గయ్యపేటలో నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభోత్సవానికి జిల్లా అగ్నిమాపక అధికారి డి.నిరంజన్‌రెడ్డి సహా కొందరు అధికారులు వెళ్లారు. సమన్వయ సమస్యఎదురై వాహనాల రాకలో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు.  మధ్యాహ్నానికి  నిరంజన్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top