ఇదేం న్యాయం?

ఇదేం న్యాయం?


తప్పు చేయని వైద్యుడిపై సస్పెన్షనా..!

 

వెంటనే ఉపసంహరించుకోండి

 నేటి నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు..

పదిరోజుల్లో స్పందించకపోతే ఆందోళన ఉధృతం

ప్రభుత్వానికి  వైద్యుల సంఘం అల్టిమేటం

డాక్టర్లను తిట్టడం కాదు.. సౌకర్యాలపై దృష్టిపెట్టండంటూ మంత్రులకు హితవు


 

లబ్బీపేట : ప్రభుత్వాస్పత్రి వైద్యుడు చంద్రశేఖర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. సిద్ధార్థ మెడికల్ కళాశాలలో బుధవారం అత్యవసరంగా సమావేశమైన అసోసియేషన్-సిద్ధార్థ వైద్య కళాశాల శాఖ సభ్యులు సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని, అప్పటి   వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని ప్రకటించారు. పది రోజుల్లో స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఆందోళన తీవ్రతరం చేస్తామని అల్టిమేటం జారీచేశారు. ఎలాంటి తప్పుచేయని క్యాజువాలిటీ వైద్యుడిని క్రిమినల్‌గా చూపిస్తూ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులతో పాటు సీనియర్ ప్రొఫెసర్లు కూడా పాల్గొన్నారు. వీరంతా సస్పెన్షన్‌ను వ్యతిరేకించడంతోపాటు తక్షణమే విధులు బహిష్కరించాలని పట్టుబట్టారు. మంత్రులకు వైద్యుల్ని తిట్టడం మినహా ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించడం చేతకాదని దుయ్యబట్టారు. కొందరు సీనియర్ల సూచన మేరకే వారం, పది రోజులు నల్లబ్యాడ్జీలతో   విధులకు హాజరవుతామని, అయినా స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు.




తప్పు చేయని డాక్టర్‌పై చర్యలా..?



సమావేశం అనంతరం అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కె.శివశంకర్‌రావు, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ ఎన్‌ఎస్ విఠల్‌రావు విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 7.15 గంటల సమయంలో శ్యామ్ అనే ఐదేళ్ల బాలుడ్ని కుక్కకాటుతో ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారని, పరిశీలించిన సీఎంవో డాక్టర్ దీనా వెంటనే ఏఆర్‌వీ, టీటీ, యాంటి బయోటిక్, వోవెరాన్ ఇంజక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. బాలుడి మెడ, తలపై గాయాలు ఉన్నాయని, ఆస్పత్రిలో ఇమ్యునోగ్లోబలిన్ మందు అందుబాటులో లేకపోవడంతో గుంటూరు రిఫర్ చేద్దామని ఆమె అనుకున్నారని చెప్పారు. ఉదయం 8 గంటలకు డాక్టర్ చంద్రశేఖర్ విధుల్లోకి వచ్చారని.. ఆ వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చి ఘటనపై ప్రశ్నించారని తెలిపారు. అరుుతే, అప్పుడే డ్యూటీలోకి వచ్చిన డాక్టర్ చంద్రశేఖర్ ఘటనపై సమాధానం చెప్పలేకపోయూరని వివరించారు. దీనిని సాకుగా చూపించి సస్పెన్షన్ వేయడమే కాకుండా ఓ క్రిమినల్‌కు విధించినట్టుగా విజయవాడ వదిలి వెళ్లవద్దంటూ ఆదేశాల్లో పేర్కొన్నారని వారు చెప్పారు. ఏ తప్పు చేయని వైద్యుడ్ని ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు.

 

వైద్యుల్ని తిట్టేందుకే ఆస్పత్రికి వస్తున్నారా..?

 

ఆస్పత్రికి వచ్చే మంత్రులు, అధికారులు వైద్యులను తిట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ, సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయడం లేదని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. 20ఏళ్ల కిందట ప్రసూతి విభాగంలో 150 నుంచి 200 ప్రసవాలు జరిగేవని, ప్రస్తుతం 550 నుంచి 600 ప్రసవాలు జరుగుతున్నాయని, కానీ అప్పటి వైద్యులు, అవే పడకలు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం ఎలా అందిస్తామని ప్రశ్నించారు. ఆరు నెలల కిందట జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో తాము సూచించిన ఒక్క సమస్యనైనా పరిష్కరించారా..? అన్నారు. మందు లేనిదే వైద్యులేమి చేస్తారని, మందులు సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం బేషరతుగా చంద్రశేఖర్‌పై సస్పెన్షన్ ఎత్తేయకపోతే  ఆందోళన తీవ్రతరం  చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో          అసోసియేషన్ మాజీ కార్యదర్శి డాక్టర్ పవన్  కుమార్, డాక్టర్ కె.అప్పారావు, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top