ప్రగతికి అడవి అడ్డంకి


జిల్లా ప్రగతికి అడవి అడ్డంకిగా మారింది. సాగునీటి ప్రాజెక్టులేగాక అభివృద్ధి కార్యక్రమాలకూఅడవి అడ్డొస్తోంది. అటవీ శాఖ అనుమతులు సకాలంలో రాకపోవడంతో సాగునీటి ప్రాజెక్టులపనులు నిలిచిపోయాయి. కృష్ణమ్మ గలగలలతో బంగారు పంటలు పండాల్సిన భూములుబంజరుగా మిగిలిపోతున్నాయి. స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ పనులను అటవీశాఖఅధికారులు ఇటీవల అడ్డుకోవడమే అందుకు నిదర్శనం.

 

సాక్షి ప్రతినిధి, తిరుపతి:
జిల్లా భౌగోళిక విస్తీర్ణం 37.03 లక్షల ఎకరాలు. ఇందులో 11.15 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. 18.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. సాగుకు యోగ్యమైన భూమిలో అరణియార్, కాళంగి వంటి చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 50 వేల ఎకరాలకు, చెరువుల ద్వారా 1.57 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే ఏ ఒక్క ఏడాది కూడా ఆ మేరకు నీళ్లందించిన దాఖలాలు లేవు.

 

పోనీ ఆ మేరకు నీళ్లందుతాయని లెక్క లు వేసుకున్నా రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. సెంట్రల్ ఇరిగేషన్ కమిషన్ నివేదిక ప్రకారం ఒక జిల్లా విస్తీర్ణంలో కనీసం 30 శాతం భూమికి నీటిపారుదల సౌకర్యం ఉండాలి. 30 శాతం అటవీ ప్రాంతం ఉండాలి. ఆ నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం జిల్లాలో 30.02 శాతం ఉంది. నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి ఐదు శాతం మాత్రమే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

 

నీటిపారుదల సదుపాయాన్ని కల్పించడానికి దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి,గాలేరు-నగరి సుజల స్రవంతి, స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్, తెలుగు గంగ ప్రాజెక్టులను చేపట్టారు. గాలేరు-నగరి ద్వారా 1,03,500 ఎకరాలు, హంద్రీ-నీవా ద్వారా 1.40 లక్షల ఎకరాలు, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ 87,734 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమేగాక 23,266 ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్లందించాలని నిర్ణయించారు. పర్యావరణ, అటవీ అనుమతులను తెప్పించిన వైఎస్ ఆ ప్రాజెక్టులను చేపట్టారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత ఆ ప్రాజెక్టులకు అటవీ శాఖ గ్రహణం పట్టుకుంది.  

 

 ఇంత జాప్యమేల

* రూ.300 కోట్లతో చేపట్టిన స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ పనులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కారణం అటవీ శాఖ అనుమతుల్లో జాప్యమే. శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలోని 190 కంపార్ట్‌మెంట్లో 640 ఎకరాల అటవీ భూమి స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ తవ్వకానికి అవసరమవుతుంది. ఆ మేరకు అటవీ శాఖకు మరో చోట భూమి చూపించి, పరిహారం అందిస్తే సరిపోతుంది. ఆ మేరకు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది.

* తెలుగుగంగ ప్రాజెక్టుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నికర జలాలను కేటాయించింది. ఈ ప్రాజెక్టు వల్ల బీఎన్ కండ్రిగ, శ్రీకాళహస్తి, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో 49 వేల ఎకరాలకు నీళ్లందించాలి. పదివేల ఎకరాలకు కూడా నీళ్లందిస్తున్న దాఖలాలు లేవు. ఇందుకు ప్రధాన కారణం అటవీ శాఖ అనుమతలు రాకపోవడమే. తెలుగుగంగ ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీలు తవ్వేందుకు 145 ఎకరాల అటవీ భూమి అవసరమవుతుంది. ఆ మేరకు అటవీ శాఖకు మరో ప్రాంతంలో భూమిని చూపించి, రూ.63.40 కోట్లను పరిహారంగా చెల్లిస్తే సరిపోతుంది. అదీ ఆచరణకు నోచుకోలేదు.

* జిల్లాలో గాలేరు-నగరి, హంద్రీ-నీవాలదీ అదే పరిస్థితి. అటవీశాఖ అనుమతుల్లో జాప్యంతోపాటూ ప్రభుత్వం సక్రమంగా నిధులు కేటాయించకపోవడంతో ఆ ప్రాజెక్టుల పనులు పూర్తిగా పడకేశాయి.

 

గోపాలన్నపైనే ఆశలు

తిరుపతి సమీపంలో ఎస్వీ జూపార్కు వద్ద రూ.వంద కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించేందుకు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. ఇందుకు 30.3 ఎకరాల అటవీ శాఖ భూమిని కేటాయించారు. ఆ ప్రాంతంలో స్టేడియం నిర్మాణానికి అటవీ శాఖ అనుమతించలేదు. కారణం ప్రభుత్వం మరో ప్రాంతంలో భూమిని చూపించకపోవడం, పరిహారాన్ని చెల్లించకపోవడమే. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా జిల్లాకే చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. అటవీ శాఖ అనుమతులకు, అవసరమైన నిధుల కేటాయింపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే వెనుకబడిన జిల్లా ప్రగతిపథంలో దూసుకెళుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top