అభివృద్ధిలో ‘రాజ’ ముద్ర


సాక్షి ప్రతినిధి, కర్నూలు : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ఆ పేరు వింటే రైతన్నలకు ధైర్యం వస్తుంది. వారి మోములు చిరునవ్వుతో విచ్చుకుంటాయి. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఇప్పటికీ ఆయనను గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల కాలంలో వైఎస్సార్.. అన్ని వర్గాల వారికి ఏదోరూపంలో సంక్షేమ ఫలాలను అందించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన పనిచేశారు. ముఖ్యంగా రైతును రారాజుగా చూడాలనుకున్నారు. తన తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపై చేసి జిల్లాలో 86 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. అలాగే జిల్లాలోని 2.80 లక్షల మంది రైతులకు రూ.428 కోట్ల రుణాలను మాఫీ చేశారు. 4.73 లక్షల మంది రైతులకు తన ఐదేళ్ల కాలంలో రూ.871 కోట్లు పంట రుణాలు ఇప్పించి తిరిగి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించారు.

 

 ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను సబ్సిడీతో ఇప్పించారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించిన రెండు లక్షల మంది రైతులకు రూ.65 కోట్లు ప్రోత్సాహకాల ద్వారా అందించారు. ఏ ఆదరణకు నోచుకోని 3.50 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.8 కోట్ల నిధులను విడుదల చేస్తూ.. ఒకటో తేదీన ఠంచన్‌గా ఇచ్చేటట్లు చర్యలు తీసుకున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణం పేరిట జిల్లాలో 4.73 లక్షల గృహాలు, రాజీవ్ గృహకల్ప పథకం ద్వారా 1876 మందికి ఇళ్ల ప్లాట్లు ఇచ్చి పేదల సొంతింటి కలను సాకారం చేశారు.

 

 ఇందిరప్రభ పథకం ద్వారా 14,109 మంది పేదలకు 30,787 ఎకరాల మిగులు భూములు ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లాలో 1,937 మందికి రూ.5.84 కోట్లతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్ర చికిత్సలు చేయించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పావలా వడ్డీకే రూ.101.52 కోట్లు రుణాలుగా ఇప్పించారు. వలసల నివారణ, ప్రతి ఒక్కరికి ఉపాధే లక్ష్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 3.55 లక్షల మందికి పని కల్పించి రూ.252.31 కోట్లు ఇప్పించారు. జిల్లాలో 3.75 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారు. ఇంకా రాజీవ్ ఉద్యోగశ్రీ, పశుక్రాంతి పథకాలను ప్రవేశపెట్టి ఉపాధి అవకాశాలు కల్పించారు.

 

 దశాబ్దాలుగా పాలకుల నిరాదరణకు గురైన కర్నూలు జిల్లాలోని పల్లెలు, పట్టణాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందంజలో నిలిపారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 53 మండలాల్లో 250 ఇందిరమ్మ చెరువులను గుర్తించి రూ.360 లక్షలతో పనులు చేపట్టారు. దీంతో ఈ చెరువుల కింద ఆయకట్టు సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. వైఎస్సార్ హయాంలో సమృద్ధిగా వర్షాలు కురిసి బాగా పంటలు పండాయి.

 

 వైఎస్సార్ హయాంలో జిల్లా అభివృద్ధి ఇదీ..

  ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా 2.88 లక్షల మంది విద్యార్థులకు ఫీజుల రూపేణా రూ.67.20 కోట్లు ఇచ్చారు. వైఎస్‌ఆర్ అభయహస్తంతో 14,500 మందికి వృద్ధులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున లబ్ధి చేకూర్చారు.

 జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో డీపీఏపీ కింద రూ.81.31 కోట్లతో 14,159 వాటర్‌షెడ్లు నిర్మించారు.

 

 కరువు విమోచనా పథకం కింద ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి రూ.10 కోట్లతో 28,782 పనులు ఏర్పాటు చేశారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసి వ్యాపారం చేయటంలో కర్నూలు జిల్లా మహిళలు ప్రావీణ్యం సంపాదించారు. వారంతా ఇందిరక్రాంతి పథకం కింద రూ.75 కోట్లతో జిల్లా సమాఖ్య సభ్యులు వ్యాపారం చేయటం ప్రారంభించారు.

 

 జిల్లాలో 8,67,536 కుటుంబాలకు 2,203 చౌకధరల దుకాణాల ద్వారా రూ.2కే కిలో బియ్యం పంపిణీ చేసి ఒక్కపూటకే పరిమితమైన వారికి మూడు పూటలా భోజనం అందేలా చూశారు.

 ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ప్యాకేజీల కింద జిల్లాకు 6 వేల ముర్రాజాతి గేదెలు, రూ.35.54 కోట్లతో పాడిగేదెలు, గొర్రెలు, పొట్టేళ్లు, దూడలు పంపిణీ చేశారు.నాలుగేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.17.36 కోట్ల ఆర్థిక సాయాన్ని ఎస్సీలకు అందించారు.

 

 అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా ఒకే చోట విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం సమీకృత వసతిగృహాలను నిర్మించారు. రూ.1.70 కోట్లతో జిల్లాలో 5 భవనాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.  చెంచుల విద్యాభివృద్ధి కోసం రూ.4.24 కోట్లు ఖర్చు చేశారు. ఐదేళ్లలో రాజీవ్ యువశక్తి పథకం కింద రూ.42 కోట్లు ఖర్చు చేసి 5,713 యూనిట్లను మంజూరు చేశారు.

 

 రాజన్న ‘స్మృతి’లో..

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ సృ్మతివనం జిల్లాకే తలమానికంగా నిలిచింది. రూ.9 కోట్లతో చేపట్టిన ఈ స్మృతివనంలో వైఎస్‌ఆర్ భారీ విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటోంది.బట్టర్‌ఫ్లై గార్డెన్, 60 అడుగుల ఎత్తులో నిర్మించిన వీక్షణ కేంద్రంపై నుంచి చూస్తే నల్లమల అందాలు కన్పిస్తాయి. అందమైన రకరకాల మొక్కలు, చెట్లు స్మృతివనంలో మరో ఆకర్షణగా నిలుస్తున్నాయి. శ్రీశైలం, మహానంది పుణ్యక్షేత్రాలకు వెళ్లే మహారాష్ట్ర, కర్ణాటక యాత్రికులు స్మృతివనాన్ని సందర్శించి వెళ్తున్నారు.

 

 నేడు సేవా కార్యక్రమాలు

 కర్నూలు: సేవా కార్యక్రమాలతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతిని జరుపుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం జిల్లాలో వైఎస్సార్ విగ్రహాలకు పాలభిషేకం చేయనున్నారు. అలాగే  రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేస్తారు. రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలు, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయంతోపాటు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కళా వెంకటరావు భవన్‌లో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

 

  నంద్యాలలో డాక్టర్ హరినాథ్‌రెడ్డి నేతృత్వంలో మెగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. టంగుటూరులో వైఎస్సార్ అభిమానులు, పార్టీశ్రేణుల నేతృత్వంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. మంత్రాలయంలో మండల కన్వీనరు బీవీ రెడ్డి ఆధ్వర్యంలో, ఆత్మకూరులో శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ స్మృతి వనంలో కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. అక్కడి నుంచి ర్యాలీగా ఆత్మకూరు పట్టణానికి చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేయనున్నారు. అలాగే వెలుగోడు, బండిఆత్మకూరు, శ్రీశైలం, మహానంది పట్టణాల్లో కూడా వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top