‘త్రిపురాంతకం’ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించండి

‘త్రిపురాంతకం’ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించండి


ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్‌ను కోరిన ఎమ్మెల్యే డేవిడ్‌రాజు



త్రిపురాంతకం, ఒంగోలు కల్చరల్: త్రిపురాంతకంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి అవసరమైన మాస్టర్‌ప్లాన్ తయారుచేసి పనులు చేపట్టాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ ఈ.శ్రీనివాసరావును కోరారు. మనగుడి కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం ఒంగోలుకు వచ్చిన రీజనల్ జాయింట్ కమిషనర్‌ను ఆయన కలుసుకొని త్రిపురాంతకేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధి చర్యల గురించి ప్రస్తావించారు.

 

త్రిపురాంతకంలోని ఆలయాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారని..ఆలయాల అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందన్నారు. బాలా త్రిపురసుందరీదేవి ఆలయ గోపురంపై పిడుగుపడి ఎనిమిది నెలలైందని, ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టలేదన్నారు. వెంటనే  పనులు పూర్తి చేసి భక్తుల మనోభావాలను కాపాడాలని కోరారు.  యాత్రికల అవసరాల మేర ఇక్కడ సౌకర్యాలు లేవని వాటిని మెరుగు పరచాలన్నారు. పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం వద్ద గోపుర నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

 

ఆలయాల విషయంలో రాజకీయాలు తగవని అధికారులు దీనికి మాస్టర్ ప్లాన్ తయారుచేసి అభివృద్ధి పనులు పూర్తిచేయాలని కోరారు. మాస్టర్‌ప్లాన్‌ను ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పూర్తి చేసేందుకు అప్పగించామని ఆర్‌జేసీ శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆలయాలకు రెగ్యులర్ ఈఓను నియమించాలని డేవిడ్‌రాజు సూచించారు. సమావేశంలో ఏసీ శ్రీనివాసులు, ఈఓ వెంకట్రావు, శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్ సుబ్బారావు, మాజీ ఎంపీపీలు ఎన్ జయప్రకాష్, ఆళ్ల ఆంజనేయరెడ్డి, పార్టీ కన్వీనర్ పి చంద్రమౌళిరెడ్డి, యండ్రపల్లి సుబ్బారావు, సీతారామిరెడ్డి, వేగినాటి శ్రీనివాస్, భాస్కర్ తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top