ఉప్పలపాడులో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం

ఉప్పలపాడులో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం - Sakshi


 రాస్తారోకోకు దిగిన గ్రామస్తులు

48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి

లేకుంటే ఆమరణ దీక్ష ఎమ్మెల్యే గోపిరెడ్డి


 

నరసరావుపేట రూరల్
: ఉప్పలపాడు ప్రధాన సెంటర్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో విగ్రహం చేయి పూర్తిగా విరిగిపోగా, ముఖంపై పగులగొట్టేందుకు ప్రయత్నించిన గుర్తులు కనిపించాయి. తెల్లవారుజామున గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించారు. పార్టీ మండల నాయకులు, వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దెబ్బతిన్న విగ్రహాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో కలసి ఆయన వినుకొండ-గుంటూరు రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు.  గంటపాటు జరిగిన రాస్తారోకోతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.



రూరల్ ఎస్సై సురేంద్రబాబు రాస్తారోకో వద్దకు చేరుకుని ఎమ్మెల్యేతో చర్చించారు. గతంలో ఒకసారి విగ్రహంపై దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నిందితులను పోలీసులు గుర్తించలేదన్నారు. తాజా ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో నిందితులను గుర్తించకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామస్తులు వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై వివరించారు. పోలీసుల హామీతో ఎమ్మెల్యే గోపిరెడ్డి రాస్తారోకోను విరమించారు.





దమ్ముంటే పగలు వచ్చి విగ్రహం మీద చేయి వేయండి

వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికిపంద చర్యని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ధైర్యం ఉంటే పగటి పూట విగ్రహం మీద చేయి వేయాలని సవాల్ విసిరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్న గ్రామంలో రెచ్చగొట్టేందుకే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  పార్టీ నాయకులు కొమ్మనబొయిన శంకర్‌యాదవ్, పిల్లి ఒబుల్‌రెడ్డి, వల్లెపు నాగేశ్వరరావు, గాబ్రియెల్, గోగుల మనోహర్, చల్లా నారాపరెడ్డి, శివయ్య, నంద్యాల సత్యనారాయణరెడ్డి, శనివారపు బ్రహ్మారెడ్డి, కాసా ఆంజనేయులు, మూరే రవింద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top