రిజిస్ట్రేషన్ల బాదుడు

రిజిస్ట్రేషన్ల బాదుడు


రేపటి నుంచి పెరగనున్న ఛార్జీలు

ఆస్తుల కొనుగోలుదారులపై రూ.15 కోట్ల భారం


కడప కోటిరెడ్డి సర్కిల్‌ :

ఆస్తుల క్రయ విక్రయాల ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఫీజు అమలుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అబ్కారీ తర్వాత రిజిస్ట్రేషన్‌శాఖ కీలక ఆదాయ వనరుగా మారింది. ఇటీవల ప్రభుత్వం ఆస్తుల విలువను పెంచడంలో భాగంగా చర్యలు చేపట్టి భూములు, భవనాలు, అపార్టుమెంట్లు, వాణిజ్య కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో  10 నుంచి 25 శాతం వరకు ఆస్తి విలువలను పెంచింది.



దీంతో జిల్లా కొనుగోలు దారులపై దాదాపు రూ. 15–20 కోట్ల భారం పడనుంది. రిజిస్ట్రేషన్‌ శాఖపరంగా జిల్లాను రెండు డివిజన్లుగా విభజించారు. అందులో కడప డివిజన్‌ పరిధిలో తొమ్మిది కార్యాలయాలు (కడప అర్బన్, రూరల్, సిద్దవటం, రాజంపేట, పుల్లంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చిట్వేలి, సుండుపల్లె) ఉన్నాయి. ఈ కార్యాలయాల ద్వారా రూ. 10–13 కోట్ల ఆదాయం ఒనగూరనుంది. ప్రొద్దుటూరు డివిజన్‌లో తొమ్మిది కార్యాలయాలు (ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, దువ్వూరు, కమలాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, వేంపల్లె, పులివెందుల) ద్వారా దాదాపు రూ. 7 కోట్ల ఆదాయం సమకూరనుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆస్తి విలువలు పెంచడం జరుగుతోంది.

 

భూముల విలువలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరు నుంచి పది శాతం, పట్టణప్రాంతాల్లో 10 నుంచి 25 శాతం వరకు ముఖ్యంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో భారీగా పెరిగాయి. ఇందులో నిర్మాణాలకు నోచుకుంటున్న అపార్టుమెంట్లు, కొత్త భవనాల రిజిస్ట్రేషన్‌ ఫీజులు అధికంగా పెరిగాయి. దీంతో జిల్లా ప్రజలకు రిజిస్ట్రేషన్‌శాఖ ద్వారా నిర్వహించే లావాదేవీలపై భారం పడనుంది. కడప డివిజన్‌లో గత సంవత్సరం రూ. 85 కోట్ల లక్ష్యం కాగా, ఈ సంవత్సరం ధరలు పెరగడంతో దాదాపు రూ. 13 కోట్ల ఆదాయం పెరగనుంది.



మొత్తంగా రూ. 100 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. ప్రొద్దుటూరు డివిజన్‌ పరిధిలో గత సంవత్సరం రూ. 50 కోట్లు లక్ష్యం కాగా, పెరిగిన ధరలతో మరో రూ. 7 కోట్లు మొత్తం కలిపి రూ. 57 కోట్ల ఆదాయం సమకూరనుంది. జిల్లా వ్యాప్తంగా రూ. 157 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. జిల్లాలో 32 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆస్తుల విలువను పెంచడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ధరలు పెరుగుతున్నాయని తెలియడంతో గత వారం రోజులుగా కొనుగోలుదారులతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top