సాగుకు సోలార్ విద్యుత్

సాగుకు సోలార్ విద్యుత్ - Sakshi


సబ్సిడీపై అందించనున్న{పభుత్వం

ఈపీడీసీఎల్ పరిధిలో 3 హెచ్‌పీ, 5హెచ్‌పీ వరకూ అవకాశం

రైతులకు భారీ రాయితీలు

నామ మాత్రపు చార్జీలతో రూ.లక్షల విలువైన పరికరాలు

ఈపీడీసీఎల్, నెడ్‌క్యాప్ సంయుక్త నిర్వహణ


 

 విశాఖపట్నం : వ్యవసాయ విద్యుత్ మోటార్ల స్థానంలో సోలార్ పంపుసెట్లను ఏర్పాటుకు కేంద్ర ఇంధన శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాయి. నెడ్‌క్యాప్, ఈపీడీసీఎల్ విభాగాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు అమలు బాధ్యత  చేపట్టాయి. జిల్లాలో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 1400 మంది రైతులకు అవగాహన కల్పించి ముందుగా వారికి సోలార్ పంప్‌సెట్లు ఇవ్వాలని భావిస్తున్నాయి. ప్రస్తుతానికి 3హెచ్‌పీ, 5హెచ్‌పీ సామర్ధ్యం ఉన్న సోలార్ పంప్‌సెట్లను ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 5హెచ్‌పీ సోలార్ పంప్‌సెట్‌కు రూ.4.9లక్షలు ఖర్చవుతుంది. ఆ మొత్తంలో సోలార్ ప్యానెల్స్, అత్యుత్తమ ఐఎస్‌ఐ పంప్‌సెట్, రవాణా చార్జీలు, కూలీల ఖర్చు, విద్యుత్‌తీగలు, నీటి పైపులు, ఇన్‌స్టలేషన్‌ఖర్చు, ఐదేళ్ల మెయింటెనెన్స్ చార్జీలు, 5ఏళ్ల ఇన్యూరెన్స్ ప్రీమియం, పన్నులు, విడిభాగాలకు అయ్యే ఖర్చుతో కలిపి రైతు కేవలం రూ.55 వేలు చెల్లిస్తే సరిపోతుంది.



అదే విధంగా 3హెచ్‌పీ పంప్‌సెట్‌కు రూ.3.2లక్షలు వ్యయం అవుతుండగా అందులో రూ.40వేలు భరిస్తే సరిపోతుంది. మిగతా సొమ్మును ప్రభుత్వం, నెడ్‌క్యాప్ భరిస్తాయి. 270/450 స్క్వేర్ స్థలం, 150 నుంచి 200అడుగుల్లో నీటి లభ్యత ఉంటే రైతులు సోలార్ పంప్‌సెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కోస్తాలోని రైతులు తీరానికి  కనీసం 20కిలోమీటర్ల దూరంలో మోటార్ ఉండేలా చూసుకోవాలి. జిల్లాలో  23,795 వ్యవసాయ విద్యుత్ సర్వీసులుండగా హుద్‌హుద్ కారణంగా వాటన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ అనంతరం పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రతికూల పరిస్థితుల వల్ల దాదాపు 10వేల సర్వీసులు ఈ సీజన్‌లో విద్యుత్ సరఫరాకు దూరమయ్యాయి. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి. భవిష్యత్‌లో  ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సోలార్ పంపుసెట్లను వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. విద్యుత్ శాఖకు చెందిన స్థానిక ఎలక్ట్రికల్ ఇంజనీర్ల వద్ద దీనికి సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top