గమనం ఓ కవనం

గమనం ఓ కవనం


వెన్నెల్లో అడవి ఎంత మనోహరంగా ఉంటుందో ఐటీడీఏ పీఓ లోతేటి శివశంకర్‌ విజయ ప్రస్థానం కూడా అంతే అందంగా ఉంటుంది. వాస్తవానికి అడవి నుంచే ఆయన అసలు ప్రయాణం మొదలైంది. ఆయన మాటల్లోనూ అది స్పష్టంగా వినిపిస్తుంది. అర్ధాంగి గురించి ఎంత ప్రేమగా మాట్లాడుతారో.. అడవి బిడ్డలతో ఆత్మీయానుబంధం గురించి కూడా అంతే ఆప్యాయంగా మాట్లాడగలరు. అధికారిగా దర్పం ప్రదర్శిస్తూనే.. ఆత్మీయుడిగా గిరిజనులకు ప్రేమనూ పంచగలరు. స్నేహితులతో మాక్‌ ఇంటర్వ్యూలు, చిరంజీవిపై పిచ్చి అభిమానం పెంచుకోవడం, సివిల్స్‌కు సతీమణి సాయం చేయడం, అప్పుడప్పుడూ కలవడానికి వచ్చే గిరిజనులను గుర్తు పెట్టుకోవడం, తెలుగు సాహిత్యమంటే చెవి కోసుకోవడం... వంటి విషయాలన్నీ ‘సాక్షి’తో ఆయన ఇష్టంగా పంచుకున్నారు. విద్యార్థిగా, ఉద్యోగిగా, భర్తగా, గిరిజనుల ఆత్మ బంధువుగా ఆయన గమనం ఓ కవనంలా సాగుతోంది. ఆయన మాటలు చదివాక ఆ మాటే మీరూ అంటారు.               



సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘మాది విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామం. పదో తరగతి (1995–96) వరకూ అక్కడి జెడ్పీ హెస్కూల్‌లోనే చదివా. తర్వాత ఇంటర్మీడియెట్‌ (1996–98) చదివేందుకు వైజాగ్‌ వెళ్లా. నేను చదివిన వికాస్‌ కాలేజీలోనే ఇటీవల జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా వెళ్లడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అంతేకాదు నేను సివిల్స్‌ సర్వీసెస్‌ వైపు వెళ్లాలనే ఆలోచనకు మొగ్గ తొడిగింది విశాఖలోనే. అప్పటి వికాస్‌ కాలేజీ భవనానికి కొద్ది దూరంలోనే ‘ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌’ (డిక్‌) ఉండేది. అక్కడ కోచింగ్‌కు వచ్చేవారిని రోజూ గమనించేవాడిని. 1999 నుంచి 2003 వరకూ కర్నాటకలోని సూరత్‌కల్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో బీ టెక్‌ చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగం చేశా. కా నీ సివిల్స్‌ సర్వీసు ఆలోచన మాత్రం మనసును తొలిచేసేది.



ఏపీ స్టడీ సర్కిల్‌లోనే ప్రిపరేషన్‌...

హైదరాబాద్‌లోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వద్దనున్న ఏపీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసం చేరా. మ్యాథ్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లతోనే తొలుత ప్రిపరేషన్‌. కానీ సిలబస్‌ చాలా విస్తృతమే గాక వాటితో ప్రిపేరయ్యేవారూ తక్కువే. తొలి ప్రయత్నంలో ప్రిలిమినరీ కూడా దాటలేకపోయా. స్టడీ సర్కిల్‌లో పరిచయాలు పెరిగిన తర్వాత వారి సూచనలతో జాగ్రఫీ, తెలుగు సాహిత్యం సబ్జెక్ట్‌లకు మారిపోయా. ఈ సబ్జెక్ట్‌లే నా జీవితంలో చాలా కీలక ఘట్టాలకు భూమిక అవుతుందని ఆ రోజైతే నేను ఊహించలేదు. సివిల్స్‌ ప్రిపరేషన్‌లో ఉండగానే గ్రూ ప్‌–2 నోటిఫికేషన్‌ వచ్చింది. అవే సబ్జెక్ట్‌లతో ప్రయత్నిస్తే ఏసీటీవో ఉద్యోగం వచ్చింది. తొలి పోస్టింగ్‌ కూడా సొంత జిల్లాలోని పార్వతీపురంలోనే. సెలవు పెట్టి మళ్లీ సివిల్స్‌ ప్రిపరేషన్‌ కొనసాగించా. మూడో ప్రయత్నం (2013)లో నా చిరకాల స్వప్నం నెరవేరింది. ఎస్సీ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాదే ఫస్ట్‌ ర్యాంకు. అలా ఏపీ క్యాడర్‌ వచ్చింది.



స్నేహితుల సహకారం...

ఏపీ స్టడీ సర్కిల్‌లో నా రూమ్‌మేట్స్‌లో రమేష్‌కు ఐఆర్‌ఎస్‌ వచ్చింది. మరో మిత్రుడికి రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ (ఐఆర్‌టీఎస్‌). మేమంతా మాక్‌ ఇంటర్వ్యూ లకు ఎక్కడకూ వెళ్లలేదు. మాలోమేమే బోర్డుగా ఏర్పడి ఒక్కొక్కర్నీ అరగంట పాటు ఇంటర్వ్యూ చేసేవాళ్లం. అదంతా ల్యాప్‌టాప్‌తో రికార్డు చేసి చూ సుకొనేవాళ్లం. మేమేమి తప్పులు చేస్తున్నామో తె లుసుకొని సరిచేసుకొనేవాళ్లం. అందుకే మన జీవితంలో మనం ఎంచుకునే స్నేహితులను బట్టి కూడా విజయం ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు.



గిరిజనులతో అనుబంధం...

ఐఏఎస్‌ అధికారిగా నా తొలి పోస్టింగ్‌ విశాఖ జిల్లాలోని పాడేరు సబ్‌ కలెక్టర్‌గా. అక్కడ 11 నెలలే పనిచేసినా గిరిజనులతో అనుబంధం ఏర్పడింది. అదే సమయంలో మూడు నెలలు పాడేరు ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ ప్రాజెక్టు అధికారిగా కూడా పనిచేశా. భూ సంబంధిత వివాదాల సహా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గిరిజనుల సమస్యలెన్నింటినో పరిష్కరించే అవకాశం అలా కలిగింది. ప్రతి గురువారం కోర్టు తప్పనిసరి. వారి గ్రామానికెళ్లి వారి పెద్దల సమక్షంలోనే భూవివాదాలు పరిష్కరించేవాణ్ని. ఆదివాసీ దినోత్సవం విజయవంతంగా నిర్వహించి ముఖ్య మంత్రి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందా. గత ఏడాది నవంబర్‌ 16వ తేదీన సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించా.



తెలుగు సాహిత్యం రుచి చూశా...

సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసమే తెలుగు సాహిత్యం సబ్జెక్ట్‌ ఎంచుకున్నా మాతృభాష రుచి చూశా. అంతేకాదు వృత్తి జీవితంలో ఎన్నో సమస్యలను భిన్న కోణాల్లో పరిశీలించడానికీ ఉపయోగపడుతుంది. గిరిజనుల భూసమస్యలను పరిష్కరించడానికి రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావి శాస్త్రి) రాసిన ‘అల్పజీవి’ నవల. మనస్తత్వ శాస్త్రం ఆధారంగా తెలుగులో తొలి నవల అది. సామాన్యులకు చిన్న చిన్న సమస్యలే అయినా పెద్దవిగా కనిపిస్తాయి. ఆ చిన్న సమస్యనే వారి కోణంలో ఆలోచించి పరిష్కరిస్తే వారికి పెద్ద ఊరట. అలా దశాబ్దాల సమస్యలకు పరిష్కారం లభించిన ఎంతోమంది పాడేరు ప్రాంతం నుంచి ఇప్పటికీ నన్ను అభిమానంతో కలవడానికి సీతంపేట వస్తుంటారు.



కవిత్వమే మమ్మల్ని కలిపింది...

తెలుగు సాహిత్య పరిజ్ఞానంతో కవిత్వం రాయడం వచ్చేసింది. అదే నన్నూ, మా గృహ‘లక్ష్మి’నీ ఒక్కటి చేసింది. ఆమె పూర్వీకులదీ విజయనగరమే. వాళ్ల నాన్న డోల పాపుడు హైదరాబాద్‌లో ఏపీఎస్పీ ఏఎస్సైగా రిటైరయ్యారు. ఏపీ స్టడీసర్కిల్‌లో జాగ్రఫీ క్లాస్‌లో పరిచయమైనా తెలుగులో నేను చెప్పే కవిత్వమే ఆమెను బాగా ఆకట్టుకుంది. 2007 సంవత్సరంలో నేను గ్రూప్‌–2, ఆమె గ్రూప్‌–1 ఉద్యోగాలు సాధించాం. మా ఇద్దరి తొలి పోస్టింగ్‌ కూడా విజయనగరం జిల్లాలోనే. ఆమెకు పాచిపెంట మండల ఎంపీడీవో. నేను విజయనగరంలో ఏసీటీవో. అలా కలిసి వచ్చిన సంబంధంతోనే ఇరువైపుల పెద్దలను ఒప్పించి 2009, ఫిబ్రవరి 13న ఒక ఇంటివారమయ్యాం. ఆమె సపోర్టుతోనే సెలవు పెట్టి సివిల్స్‌ ప్రిపరేషన్‌ మరింత పెంచా. హైదరాబాద్‌లో ఖర్చుకు ఆమె డబ్బులు పంపేవారు. ఐఏఎస్‌ సాధించడంలో ఆమె పాత్ర ఉంది. ఇప్పుడు ఇక్కడే అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.      



కొత్త ప్రదేశమంటే చూడాల్సిందే....

జాగ్రఫీ పరిజ్ఞానం కూడా నాకు వృత్తిలో ఉపయోగపడుతోంది. అంతేకాదు కొత్త ప్రదేశాలు సందర్శించే (టూరిజం) హాబీ ఏర్పడటానికీ అదే కారణం. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొర్రా గుహల ప్రత్యేకత, చారిత్రక నేపథ్యం, శాస్త్రీయ విశేషాలతో తెలుగులో కరపత్రం రూపొందించా. ఆ వివరాలతో బొర్రా గుహల వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేయించా. గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా అరుకులో ట్రైబల్‌ మ్యూజియంను తీర్చిదిద్దా. అక్కడికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లాపుట్‌ అనే గిరిజన గ్రామం నుంచి కొంతమంది యువకులు గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి అక్కడున్న చిన్న జలపాతం గురించి చెప్పారు. అక్కడికెళ్లి చూస్తే నాకు బాగా నచ్చింది.



అధికారులతో మాట్లాడి అక్కడ చెక్‌డ్యామ్, దానిపై ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కట్టించా. పిల్లలు ఎంజాయ్‌ చేయడానికి అదో ఈతకొలనులా ఉండటంతో ఇప్పుడది ‘కొల్లాపుట్‌ జలతరంగిణి’ పేరుతో పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. చిన్నప్పుడు బయట ప్రాంతాలను సందర్శించే అవకాశం లేకపోయింది. కానీ ఇప్పుడు టూరిజం హాబీ అయిపోయింది. ఈ ఆసక్తితోనే ఇప్పుడు సీతంపేట ఐటీడీఏ పరిధిలోనూ పర్యాటక ప్రాంతాల (టూరిస్ట్‌ స్పాట్‌)ను అభివృద్ధి చేయడానికి ఓ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తున్నా. సంక్షేమ పథకాలను గిరిజనులకు పక్కాగా అందేలా చేయడానికి విభిన్న మార్గాల్లో ప్రయత్నిస్తున్నా. ముందుగా పథకాల సమాచారం వారికి తెలిసేలా ‘గిరి జాగృతి’ పేరుతో ప్రతి గ్రామానికీ దినపత్రికలు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నా.



నాన్న చూస్తారనే భయంతో...

    మా నాన్న లోతేటి సన్యాసప్పడు అరుకు, అనంతగిరి తదితర గిరిజన ప్రాంతాల్లోనే హెల్త్‌ అసిస్టెంట్‌గా ఎక్కువ కాలం పనిచేశారు. ఆయనకు తొలి పోస్టింగ్‌ కూడా పాడేరులోనే. ధర్మవరం నుంచి వెళ్లి వచ్చేవారు. సాయంత్రం ఇంటికొచ్చిన వెంటనే నేనేమి చదువుతున్నానో, స్కూల్‌లో ఏమి చెప్పారో పుస్తకాలు తెమ్మని చూసేవారు. ఇక పరీక్షలొస్తే ఇంటి దగ్గర కూడా ప్రశ్నాపత్రాల్లో ప్రశ్నలు అడిగి నేను ఎలా రాశానో తెలుసుకునేవారు. ఆ సబ్జెక్ట్‌ ఆయనకు తెలిసినా తెలియకపోయినా సరే! అలా నాన్న చూస్తారనే భయంతోనే నేను జాగ్రత్తగా చదివేవాణ్ని. తప్పు వచ్చిందంటే అది మరోసారి పునరావృతం గాకుండా చూసుకునేవాణ్ని. ఆ అలవాటే ఐఏఎస్‌ అధికారినయ్యే అదృష్టాన్ని తెచ్చింది. అంతేకాదు బాధ్యతల నిర్వహణలోనూ అంతే జాగ్రత్త వహిస్తా. ఇంటిని చక్కదిద్దడంలో కీలక పాత్ర అమ్మ కృష్ణవేణిదే. ఊర్లో అందరికీ కృష్ణమ్మ. అన్నయ్య మధుకుమార్‌ ఆదాయపన్ను శాఖ ట్రిబ్యునల్‌లో ఉద్యోగి.



చిరంజీవి అంటే అభిమానం...

స్కూల్‌ డేస్‌ నుంచి కూడా సినిమాలు ఎక్కువ చూసేవాణ్ని. చిరంజీవి అంటే పిచ్చి అభిమానం. చివరకు పేపర్లలో వచ్చే అతని సినిమా ప్రకటనలు కట్‌ చేసి పుస్తకంలో అతికించేవాణ్ని. దినపత్రికల్లో వచ్చే ముఖ్యమైన కరెంట్‌ అఫైర్స్‌ వార్తలనూ అలాగే దాచేవాణ్ని. అందుకే నేను క్విజ్, ఎస్సే రైటింగ్‌లో స్కూల్‌ టాపర్‌. ఆ అలవాటు వల్లే సాక్షి తదితర పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్, పోటీపరీక్షల మెటీరియల్‌నూ ఫైలింగ్‌ చేసుకొనేవాణ్ని. గ్రూప్‌–2, సివిల్స్‌ పరీక్షల్లో విజయానికీ అదొక కారణం.



నేను చదివిన స్కూల్‌ కోసం...

నేనే కాదు టీచర్ల పిల్లలు కూడా ధర్మవరం హైస్కూల్‌లోనే చదివేవారు. అప్పటి బ్యాచ్‌ 60 మంది కలిసి మూడేళ్ల క్రితం బహుదా సేవాసంస్థను ఏర్పాటు చేశాం. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆ స్కూల్‌లో ఏటా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నాం. ఇది వారిలో స్ఫూర్తి నింపడానికి ఎంతో ఉపయోగపడుతోంది. ఎవరు ఏ కోణంలో చూసినా సత్యం ఒక్కటే, ఎవ్వరు ఎలా పూజించినా దేవుడు ఒక్కడే అన్న రుగ్వేదంలో ఒక శ్లోకం ఆధారంగా సంస్థకు ‘బహుదా’ అని పేరు పెట్టా. ఇశాన్‌ గౌతమ్, సోహామ్‌ నందన్‌ అని మా ఇద్దరు పిల్లల నామకరణం చేసింది కూడా అలా ఆలోచించే.’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top