లక్ష్యానికి చేరువయ్యాం


► కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

సాలూరురూరల్‌: వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ అంశంలో లక్ష్యానికి చేరువయ్యామని కలెక్టరు వివేక్‌యాదవ్‌ తెలిపారు. సోమవారం మండలంలోని పురోహితునివలస పంచాయతీ సన్యాసిరాజు పేట, వల్లాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ  గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఓడీఎఫ్‌ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను అనుకున్న స్థాయిలో చేపట్టామని ఆయన తెలిపారు. ఈ నిర్మాణాలను ప్రజలు వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనికై మండలస్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణాలు వినియోగించని గ్రామాల్లోని లబ్ధిదారులకు ఉపాధిహామీతో పాటు సంక్షేమ పథకాలు నిలుపుదల చేసే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అమలు చేస్తామన్నారు.



ఆ లబ్ధిదారులు వ్యక్తిగతమరుగుదొడ్లు వినియోగించుకుంటున్నట్లు గుర్తించినట్లయితేనే మరలా సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి మండలంలో నూతనంగా మరో మూడు పంచాయతీలను ఒ.డి.ఎఫ్‌.గ్రామాలుగా గుర్తించి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ ఉషారాణికి మండలంలోని నూతనంగా మూడు ఒ.డి.ఎఫ్‌. పంచాయతీలు గుర్తింపు వాటి పరిశీలనకు నియమించే అధికారులు బృందాలపై నేడు (మంగళవారం) సమావేశాన్ని నిర్వహించి జాబితాను తయారుచేయాలని ఆదేశించారు.



నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లతో కూడా ఆయన మాట్లాడారు. మండలంలో మరో ఓడీఎఫ్‌ పంచాయతీ మావుడిలో అనుకున్న సమయంలోగా నిర్మాణాలను పూర్తిచేయించడంపై ఆ పంచాయతీ పరిశీలకుడైన తహసీల్దార్‌ జనార్దనరావును అభినందించారు. కలెక్టరు వెంట ఐ.టి.డి.ఎ. పి.ఒ.లక్ష్మీషా, జెడ్పీసీఈఓ రాజకుమారి, ఆర్‌.డి.ఒ.గోవిందరావు, తహసీల్దార్‌ జనార్దనరావు, ఎంపీడీఓ ఉషారాణి, రూరల్‌ ఎస్‌.ఐ.గణేష్‌తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.

అధికారులకు స్వాగతం: గ్రామానికి వచ్చిన కలెక్టరు, పి.ఒ., ఆర్‌.డి.ఒ., సి.ఇ.ఒ., అధికారులకు సన్యాసిరాజు పేట గ్రామ మహిళలు హారతులు పట్టి పూలు చల్లి స్వాగతం పలికారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top