కరసేవకులతో వకుళమాత ఆలయ నిర్మాణం


తిరుపతి రూరల్ : పేరూరు బండపై కొలువైన వకుళమాత ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగకపోతే కరసేవకులతోనైనా ఆలయ పునర్నిర్మాణం చేస్తామని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి అన్నారు. తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ సమీపంలో పేరూరు బండపై కొలువైన వకుళమాత ఆలయాన్ని పరిపూర్ణానందస్వామి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి మంగళవారం సందర్శించారు.



ఆలయం ఉన్న బండపై ఆధారపడి బతుకుతున్న గ్రామస్తులతో సమావేశమయ్యారు. పరిపూర్ణానంద స్వామి ఆలయ నిర్మాణంకోసం గ్రామస్తులను ఒప్పించే ప్రయత్నం చేశారు. పేరూరు బండపై జరుగుతున్న మైనింగ్ అక్రమమని హైకోర్టు తేల్చిందన్నారు. టీటీడీ, ఎండోమెంట్ తక్షణం వకుళమాత ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. టీటీడీ బాధ్యతాయుతంగా చేయాల్సిన పనులను పక్కనపెట్టి ఇతర కార్యక్రమాలపై చొరవ చూపుతోందని విమర్శించారు.



శ్రీవారికి స్వయాన తల్లి అయిన వకుళమాతకు ఆశ్రయం కల్పించడంలో టీటీడీ దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. టీటీడీ, ఎండోమెంట్ ముందుకు రాకుంటే భక్తులే స్వచ్ఛందంగా విరాళాలు వేసుకుని ఆలయ నిర్మాణానికి దిగుతారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాచీన ఆలయాన్ని కాపాడుకోవాలన్న బాధ్యత, సంకల్పం భక్తుల్లో ఉన్నాయన్నారు. ధార్మిక కేంద్రమైన టీటీడీలో అలాంటి భావాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. బండ కొట్టుకుని బతుకులు సాగిస్తున్న గ్రామస్తులకు ఉపాధి కల్పించేందుకు టీటీడీ, ఎండోమెంట్ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, భీమాస్ రఘు పాల్గొన్నారు.

 

ఆలయ నిర్మాణం జరిగే వరకూ స్వామిని దర్శించుకోను

 

సాక్షి , తిరుమల : తిరుపతిలో వకుళమాత ఆలయం నిర్మించేంతవరకు తాను శ్రీవారిని దర్శించుకోనని పరిపూర్ణానంద మరోసారి స్పష్టం చేశారు. 250 మంది గిరిజనులతో కలసి మంగళవారం ఆయన తిరుమలకు చేరుకున్నారు. గిరిజనులందరికీ స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. పరిపూర్ణానంద మాత్రం దర్శనానికి వెళ్లలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్లకు ముందు ప్రకటించిన మాటకు కట్టుబడి ఉన్నానని, వకుళమాత ఆలయ నిర్మాణంపై టీటీడీ ఇంతవరకు పూనుకోకపోవడం బాధాకరమన్నారు.



ఇకనైనా ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు టీటీడీ అధికారులు చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాతే శ్రీవారిని దర్శిచుకుంటానని చెప్పారు. తనకూ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉందని, వకుళమాత ఆలయ నిర్మాణం జరిగే వరకు రాలేనని ఆయన ఆవేదన చెందారు. మంగళవారం ఆలయ సమీపంలోని ఆస్థాన మండపం వరకు మాత్రమే పరిపూర్ణాంద వచ్చి తిరిగి వెళ్లిపోయారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top