చిరు వ్యాపారులకు వరం.. ముద్ర రుణం


ఆర్థిక భరోసా ఇస్తున్న   కేంద్ర ప్రభుత్వ పథకం

అందిపుచ్చుకుంటే వ్యాపార ప్రగతికి అవకాశం


 

గురజాల :  ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించి అప్పులు చేయడం.. ఆనక అధిక వడ్డీలు చెల్లించలేక అష్టకష్టాలు పడటం.. ఈ పరిస్థితి నిరుపేదల బతుకుల్లో షరా మామూలే. చిరు వ్యాపారులకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా వారికి ఆర్థిక అండనిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర రుణపథకం. ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది ఏప్రిల్ 8న ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకం ద్వారా చిన్న వ్యాపార కార్యకలాపాలకు అంటే తయారీ, సేవా రంగాలకు రుణా లు అందిస్తారు. దీనిని అందిపుచ్చుకొని తమ వ్యాపార విస్తర ణ చేసుకునే అవకాశం ఉంది. అన్ని జాతీయ బ్యాంకుల్లో ఈ పథకం కింద రుణం పొందొచ్చు.  

 

నిరంతర ప్రక్రియ..

 పీఎంఎంవై పథకానికి ఒక గడువు లేదు. చేసే వ్యాపారంపై సంపూర్ణ అవగాహన, ఆర్జించే మొత్తం అంచనాలతో దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే బ్యాంకర్లు పరిశీలించి, రుణ ఎగవేతదారుడు కానట్లయితే రుణం మంజూరు చేస్తారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులైన వారందరికీ రుణాలు అందిస్తారు.  

 

మూడు దశల్లో రుణం...

చిన్న వ్యాపార కార్యకలాపాలు, తయారీ, సేవారంగం, చిరు వ్యాపారులు, వాణిజ్య రంగాలకు రుణాలు అందివ్వడమే ముద్ర బ్యాంకు లక్ష్యం. ఇందులో మూడు రకాల రుణ పరిమితులు ఉన్నాయి.

 

అర్హులు వీరే..


ఈ పథకం ఎలాంటి వాహన కొనుగోళ్లకు వర్తించదు. వ్యాపారం అంటే కొని అమ్మితే కూడా ఈ రుణాలు ఇవ్వరు. సేవా రంగం అంటే బ్యూటీపార్లర్, హోటల్, ఇంటర్నెట్, టెంట్‌హౌస్, చేతివృత్తులు, కళాకారులు, రిఫ్రిజిరేటర్ ఏసీ, టీవీ, సెల్‌ఫోన్ మరమ్మతులు, ఆయా రంగాల్లో ప్రగతికి రుణలిస్తారు. ఉత్పాదక రంగం అంటే ముడిసరుకులు కొనుగోలు చేసి వస్తువులను ఉత్తత్తి చేయడం, కర్రలతో వస్తువులు, టైలరింగ్, వెల్డింగ్, ఫొటోస్టూడియో, ఆహార పదార్థాల తయారీ, ఉత్పత్తి, ప్లాస్టిక్ విస్తర్లు, టీ-కప్పులు తయారీవంటివి ఇందులోకి వస్తాయి. గేదెలు, గొర్రెలు పెంపకం, డెయిరీ ఇవి ఈ పథకం కిందకు రావు, వీటికి వ్యవసాయ రంగం ప్రత్యేక రుణాలు ఇస్తుంది.

 

 

 

 కిశోర విభాగం

 రూ.50వేలు పైబడి రూ.5 లక్షల వరకు రుణం లభిస్తుంది. అప్పటికే వ్యాపారాలు ప్రారంభించిన వారు విస్తరణ దిశగా అడుగులు వేసేందు కు ఈ మెత్తాన్ని అందిస్తారు. వీటిలో క్షౌరశాల(మంగళి షాపు), బ్యూటీ పార్లర్, ఆటో, ట్రక్కులు తదితర స్థి ర వ్యాపారాలకు రుణం అందిస్తారు.

 

 తరుణ్ విభాగం

 రూ.5 లక్షలు పైబడి రూ.10 లక్షల వరకు రుణం లభిస్తుంది. వీటిని ఇప్పటికే వ్యాపారాన్ని ప్రారంభించి అందులో చక్కటి ప్రతిభ కనబర్చిన వారికి, గతంలో నిర్వహించిన వ్యా పార నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ మెత్తాన్ని అందిస్తా రు. మెదటి ప్రాధాన్యం కింద మం జూరు చేసే శిశు విభాగం రుణాల విషయంలో హామీ అవసరం లేదు. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన పనిలేదు..రాయితీ వుండదు. రుణవడ్డీ రేటు నెలకు ఒక్క శాతం.

 

 శిశు విభాగం

 ఇందులో రూ. 50వేల వరకు రుణం లభిస్తుంది. ఇవి చిన్న వ్యాపారులు, తొలిసారి వ్యాపార రంగంలో అడుగుపెడుతున్న వారికి వర్తిస్తుంది. దీని కింద వీధి వర్తకులు, తోపుడబండ్లు వస్తాయి. వీరికి రూ.5వేల నుంచి రూ.50వేల వరకు రుణాన్ని అందిస్తారు.

 

 దరఖాస్తు చేయడం ఇలా...

 = రుణ అవసరం గల ఖాతాదారులు బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో అడిగిన సమాచారాన్ని క్లుప్తంగా వివరించాలి.

 = దాదాపుగా అన్ని జాతీయ బ్యాంకుల్లో ముద్ర  దరఖాస్తులు లభ్యమవుతాయి.

 = గుర్తింపు కోసం ఓటరుకార్డు, డ్రైవింగ్ లెసైన్సు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు తదితర కార్డుల్లో ఏదైన ఒకటి లేదా రెండు జిరాక్స్‌లు సమర్పించాలి.

 = నివాస గుర్తింపు కోసం ఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, ఆస్తిపన్ను రశీదు, బ్యాంకు పాస్ పుస్తకం, వీటిలో ఏదైన ఒకటి జిరాక్స్ పత్రాన్ని జతపర్చాలి.

 = ప్రస్తుతం దిగిన రెండు పాసుపోర్టు సైజు ఫొటోలు

 = వ్యాపారానికి కావాల్సిన కోటేషన్(నివేదిక) తప్పనిసరిగా వుండాలి.

 = ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ కుల ద్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంది.

 = బ్యాంకు పుస్తకం జిరాక్సును దరఖాస్తు పత్రానికి జతచేయాలి.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top